పెద్దవాగుతో మొదలు!

GRMB Begin With Management With Peddavagu Project - Sakshi

గోదావరిలోని ఈ ప్రాజెక్టు ప్రయోగాత్మకంగా బోర్డు పరిధిలోకి.. 

జీవోలు ఇవ్వనున్న ప్రభుత్వాలు  

మిగతావాటిపై కుదరని ఏకాభిప్రాయం 

దశలవారీగా అన్నింటిని బోర్డు పరిధిలోకి తెస్తామన్న చైర్మన్‌ 

సాక్షి, హైదరాబాద్‌:  గోదావరి బోర్డు పరిధిలోకి వెళ్లే ప్రాజెక్టులపై కొంత స్పష్టత వచ్చింది. ఇరు రాష్ట్రాల సమ్మతి మేరకు అక్టోబర్‌ 14 నుంచి గోదావరి బేసిన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న పెద్దవాగు ప్రాజెక్టును తొలి దశలో బోర్డు తన పరిధిలోకి తీసుకునేందుకు మార్గం సుగమమైంది. శ్రీరాంసాగర్‌ మొదలు సీతమ్మసాగర్‌ వరకు గోదావరిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులన్నిం టినీ బోర్డు పరిధిలో ఉంచాలన్న ఏపీ డిమాండ్‌పై ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవడంతో పెద్దవాగు నిర్వహణ బాధ్యతల ను ప్రయోగాత్మకంగా చేట్టాలని సోమవారం జరిగిన బోర్డు భేటీలో నిర్ణయమైంది.

పెద్దవాగును అప్పగిస్తూ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాక, వీటి నిర్వహణను బోర్డు చేపట్టనుంది. అయితే, దశలవారీగా ప్రాజెక్టులను అధ్యయనం చేసి వాటిని బోర్డు పరిధిలోకి తీసుకురానున్నట్లు గోదావరి బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ స్పష్టం చేశారు. 

పెద్దవాగు.. సీలేరులపైనే కీలక చర్చ 
ప్రాజెక్టుల పరిధి, సిబ్బంది నియామకం, నిధులు తదితర అంశాలపై చర్చించేందుకు సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి బోర్డు పూర్తిస్థాయి భేటీ జరిగింది. బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన జరిగిన భేటీకి తెలంగాణ, ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శులు రజత్‌కుమార్, శ్యామలరావుతోపాటు ఈఎన్‌సీలు మురళీధర్, నారాయణరెడ్డి పాల్గొన్నారు. గోదావరిపై తెలంగాణ ఎస్సారెస్పీ నుంచి సీతమ్మసాగర్‌ వరకు అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవా లని ఏపీ పట్టుబట్టింది.

దీనికి తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఉమ్మడిగా ఉన్న పెద్దవాగును మాత్రమే బోర్డుపరిధిలో ఉంచాలని కోరింది. పెద్దవాగు కింద ఉన్న 16 వేల ఎకరాల ఆయకట్టులోనూ 13 వేల ఎకరాల మేర ఆయకట్టు ఏపీలో ఉన్నందున నిర్వహణకు వ్యయంలో ఏపీనే 85% చెల్లించాలని కోరింది. అయితే తొలిదశలో ట్రయల్‌ మాదిరి పెద్దవాగును పరిధిలోకి తెచ్చుకొని, దాని అమలు, నిర్వహణ బాధ్యతలు చూస్తామని బోర్డు స్పష్టం చేసింది. దశలవారీగా మిగతా ప్రాజెక్టులను అధ్యయనం చేసి బోర్డు పరిధిలోకి తెస్తామంది. ఏ రాష్ట్ర సిబ్బంది ఆ రాష్ట్ర పరిధిలోనే పనిచేస్తారని తెలిపింది.

పెద్దవాగుకు అవసరమైన ఉత్తర్వులు వెం టనే విడుదల చేసేందుకు ఏపీ సమ్మతి తెలిపింది. సీలేరు విద్యుదుత్పత్తి ప్రాజెక్టును సైతం బోర్డు పరి ధిలోకి తేవాలని తెలంగాణ కోరింది. సీలేరు విద్యుత్‌లో సగం తెలంగాణకు రావాల్సి ఉన్నా ఏపీ ఇవ్వ డంలేదంది. దీనిపై ఏపీ అభ్యంతరం చెప్పగా, బోర్డు సైతం విద్యుదుత్పత్తి కేంద్రాల అంశం కేంద్రం పరిధిలో ఉన్నందున.. తోసిపుచ్చింది.  

బడ్జెట్‌ ఉద్దేశం చెబితే సీడ్‌మనీ విడుదల 
బోర్డులుకు ఇరు రాష్ట్రాలు చెల్లించాల్సిన చెరో రూ.200 కోట్ల సీడ్‌మనీ అంశంపైనా బోర్డు భేటీలో చర్చ జరిగింది. కేవలం ఒక్క ప్రాజెక్టునే బోర్డు పరిధిలో ఉంచినప్పుడు రూ.200 కోట్ల నిధులు అవసరం ఏముంటుందని రెండు రాష్ట్రాలు ప్రశ్నించాయి. నిధుల విడుదల ఆర్థికశాఖతో ముడిపడి ఉన్నందున బడ్జెట్‌ ఉద్దేశాలను బోర్డు తమకు చెబితే వాటినే ఆర్థిక శాఖకు తెలియజేస్తామని ఇరు రాష్ట్రాలు వివరించాయి.  

నేడు కృష్ణా బోర్డు భేటీ 
కృష్ణా బోర్డు మంగళవారం భేటీ జరుగనుంది. ప్రాజెక్టుల అధీనంతోపాటు నిధులు, సిబ్బంది పై బోర్డులో చర్చించనున్నారు. విద్యుదుత్పత్తి కేంద్రాల చుట్టూనే ప్రధానచర్చ జరిగే అవకాశాలున్నాయి. వీటితోపాటే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలోని ఔట్‌లెట్‌లపై నిర్ణయాలు వచ్చే అవకాశాలున్నాయి.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top