ఎంత పనిచేస్తివి.. ఏ కష్టం రానీయకుండా చూసుకున్నం కదామ్మా!

Girl Ends Life For Youth Harassment Gajwel - Sakshi

ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు 

మనస్తాపంతో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య.. తల్లడిల్లిన తల్లిదండ్రులు

గజ్వేల్‌లో విషాదం 

గజ్వేల్‌ రూరల్‌: పెళ్లయిన 15 ఏళ్లకు పుట్టిన కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కానీ ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధించాడు. యువతి ఇల్లు, కాలేజీ చుట్టూ తిరుగుతూ ఇబ్బందిపెట్టాడు. విషయం తల్లిదండ్రులకు తెలిసి మందలించినా వేధింపులు ఆపలేదు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గజ్వేల్‌ పట్టణంలో శుక్రవారం ఈ విషాదం జరిగింది. 

ఆరు నెలలుగా వేధింపులు.. 
గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని గుండన్నపల్లికి చెందిన ఎల్ల యాదగిరి, అండాలు దంపతులు వ్యవసాయంతో పాటు మొక్కజొన్న కంకులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పెళ్లైన 15 ఏళ్లకు సంగీత (17) పుట్టింది. ప్రస్తుతం సంగీత గజ్వేల్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రజ్ఞాపూర్‌కు చెందిన సల్ల శ్రీకాంత్‌ అలియాస్‌ అర్జున్‌ అనే యువకుడు 6 నెలలుగా గుండన్నపల్లిలో సంగీత ఇంటి ముందు, కళాశాలకు వెళ్లే సమయంలో వెంబడిస్తూ ప్రేమించాలని వేధిస్తున్నాడు.

విషయం సంగీత కుటుంబీకులకు తెలియడంతో 2 నెలల క్రితం యువకుడిని మందలించారు. కొద్ది రోజులు మిన్నకున్న తర్వాత మళ్లీ వారం రోజులుగా ఆ యువకుడు వెంబడించడం ప్రారంభించాడు. తనను ప్రేమించాలని, లేకుంటే తనతో కలిసి దిగిన ఫొటోలను అందరికీ చూపిస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని సంగీత ఇంటి పక్కన ఉండే బాబాయి కూతురితో చెప్పుకొని బాధపడింది. కాలేజీకి వెళ్లి వచ్చేందుకు కుటుంబీకులను తోడు తీసుకెళ్లేది. శ్రీకాంత్‌ వేధింపులతో మనస్తాపానికి గురై కళాశాలకు కూడా వెళ్లలేక బాధపడేది.  

చెల్లెలితో మాట్లాడి.. ఇంటికెళ్లి.. 
పరీక్షలు సమీపిస్తుండటంతో సంగీత గురువారం కళాశాలకు వెళ్లి వచ్చింది. సాయంత్రం ఇంటి పక్కనే ఉండే చెల్లెలితో కొద్దిసేపు మాట్లాడింది. తల్లిదండ్రు లు మొక్కజొన్న కంకులను విక్రయించేందుకు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటి తర్వాత గుర్తించిన కుటుంబీకులు తలుపులు తెరిచి చూడగా సంగీత విగతజీవిగా కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

సంగీత ఆత్మహత్య విషయం తెలుసుకున్న తోటి మిత్రులు, విద్యార్థులు శుక్రవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సంగీత ఫొటోలతో ప్లకార్డులను పట్టుకొని న్యాయం చేయాలని, ఆమె మృతికి కారణమైన యువకుడిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  

కడుపుకోత మిగిల్చావు బిడ్డా 
‘అయ్యో బిడ్డా.. ఎంత పనిచేస్తివి. ఒక్కగానొక్క కూతురు. ఏ కష్టం రానీయకుండా చూసుకున్నం. నువ్వు దూరమై మాకు కడుపుకోత మిగిల్చావు’అంటూ సంగీత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యేలా ఏడ్చారు. శ్రీకాంత్‌ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధించడంతో పాటు చంపుతానని బెదిరించడంతో తమ కూతురు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందన్నారు. సంగీత చావుకు కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top