నయీం కేసులో ఖాకీలందరికీ క్లీన్‌చిట్‌

Gangster Nayeem Case Clean Chit To All Police - Sakshi

సాక్ష్యాలు లేనందున వారిని కేసు నుంచి తప్పిస్తున్నామన్న సిట్‌

ఆర్టీఐ ద్వారా సమాధానం రాబట్టిన ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌

అడిషనల్‌ ఎస్పీ నుంచి కానిస్టేబుల్‌ దాకా 25 మందిపై ఆరోపణలు

సాక్షి, హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీముద్దీన్‌ అలియాస్‌ నయీంతో పోలీసులెవరూ అంటకాగలేదట. అత నితో పోలీసులెవరికీ ఎలాంటి సంబంధాలు లేవట. నాలుగేళ్ల దర్యాప్తు తర్వాత పోలీసుశాఖ ఇదే విషయాన్ని తేల్చింది. నయీంతో కలిసి పలు భూ సెటిల్‌మెంట్లు, అక్రమ దందాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులందరికీ డిపార్ట్‌ మెంట్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఈ కేసులో ఆరోపణలు వచ్చిన రాజకీయ నేతలంతా ఇప్పటికే ఊపిరి పీల్చు కోగా.. తాజాగా అడిషనల్‌ ఎస్పీ నుంచి కానిస్టేబుల్‌ దాకా 25 మంది పోలీసు అధికారులకు సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తునకు నేతృత్వం వహిస్తోన్న ఐజీ నాగిరెడ్డి ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) దాఖలు చేసిన సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానమిస్తూ క్లీన్‌చిట్‌ విషయాన్ని వెల్లడించారు. 2016 ఆగస్టులో షాద్‌నగర్‌ సమీపంలోని మిలీనియం టౌన్‌షిప్‌ వద్ద జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్‌ నయీం హతమైన సంగతి తెలిసిందే.

ఆ తరువాత అతని నేరాలు, అకృత్యాలపై సమగ్ర విచారణ జరిపించేందుకు ప్రభుత్వం ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను వేసింది. నయీం నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో పాల్పడిన పలు భూసెటిల్మెంట్లు , కిడ్నాపులు, హత్యలకు రాజకీయ నాయకులు, పోలీసులు సహకరించారని ఆరోపణలు వచ్చాయి. నయీంను కలిసిన పలువురు రాజకీయ నాయకులు, పోలీసుల ఫొటోలను అతని ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సిట్‌ వారిని విచారించింది. ఇద్దరు అడిషనల్‌ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలతోపాటు హెడ్‌ కానిస్టేబుల్‌ల వరకు మొత్తం 25 మందికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని, అందుకే వీరిని కేసు నుంచి తప్పిస్తున్నట్లు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ చేసుకున్న ఆర్టీఐ దరఖాస్తుకు సిట్‌ చీఫ్‌ ఐజీ నాగిరెడ్డి సమాధానమిచ్చారు.

క్లిన్‌చిట్‌ పొందింది వీరే..
అడిషనల్‌ ఎస్పీలు శ్రీనివాస్‌ రావు, చంద్రశేఖర్‌. డీఎస్పీలు ఈజి శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, సాయి మనోహర్, ప్రకాష్‌ రావు, వెంకట నరసయ్య, అమరేందర్‌ రెడ్డి 
తిరుపతన్నలు ఉన్నారు. ఇక ఇన్‌స్పెక్టర్లు మస్తాన్, రాజగోపాల్, వెంకటయ్య, శ్రీనివాస్‌ నాయుడు, కిషన్, ఎస్‌ శ్రీనివాసరావు, వెంకట్‌ రెడ్డి, మజీద్, వెంకట సూర్య ప్రకాష్, రవి కిరణ్‌ రెడ్డి, బలవంతయ్య , నరేందర్‌ గౌడ్, రవీందర్‌ ఉన్నారు. 

కేసును సీబీఐకి అప్పగించండి
నయీం కేసుల నుంచి పోలీసుల పేర్లను తొలగించడంపై ఎఫ్‌జీజీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసు విచారణ సరిగా జరగడం లేదని, వెంటనే ఈ కేసును సీబీఐకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ తమిళిసైకి ఎఫ్‌జీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి శనివారం లేఖ రాశారు. నయీం ఇంట్లో దొరికిన డైరీలో ఉన్న వివరాలను ఇప్పటివరకు ఇవ్వలేదని, 4 ఏళ్లుగా కేసును సిట్‌ దర్యాప్తు చేస్తున్నా... బాధితులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 240 కేసులు నమోదు చేస్తే.. ఇప్పటివరకు 173 కేసుల్లోనే చార్జిషీట్లు నమోదు చేశారని, నయీం ఇంటి వద్ద లభించిన డబ్బు విషయంలోనూ నిజాలు దాస్తున్నారని ఆరోపించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top