గాడ్జెట్‌ ఫ్రీ..‘బాల్య’నగరి..

Gadget Free.. Say No To Gadgets Slogans Attract People - Sakshi

టీవీల విజృంభణతో చిన్నారుల్లో శారీరక చురుకుదనం లోపించడం ప్రారంభమై, గాడ్జెట్స్‌ పుణ్యమాని పతాక స్థాయికి చేరింది. ఇక కరోనా దెబ్బకు ఈ సమస్య మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో నగరంలో ఏర్పాటవుతున్న పలు కిడ్స్‌ జోన్స్, ప్లే ఏరియాలు గాడ్జెట్‌ ఫ్రీ, సే నో టు గాడ్జెట్స్‌ వంటి నినాదాలతో నగరవాసుల్ని ఆకర్షిస్తున్నాయి. కొంపల్లి, పోచారం, నెక్లెస్‌రోడ్, మియాపూర్‌.. వంటి ప్రాంతాల్లో ఉన్న ఈ ప్లే ఏరియాస్‌ భాగ్యనగరంలో బాల్యనగరాల్లా వారాంతాల్లో కిటకిటలాడుతున్నాయి.
సాక్షి, సిటీబ్యూరో 
 
‘గాడ్జెట్ల జోరు వల్ల చెమట్లు పట్టేంత స్థాయిలో పిల్లలు ఆటలాడటం అరుదైపోయింది. అయితే అలాంటి ఆటల ద్వారానే చిన్నారుల్లో మానసిక, శారీరక వికాసం సాధ్యమవుతుంది. అందుకే మేం సంపూర్ణంగా గాడ్జెట్‌ ఫ్రీ ప్లే ఏరియా ఏర్పాటు చేశాం’ అని నెక్లెస్‌రోడ్‌ మీద నెలకొల్పిన సిమ్‌ అండ్‌ శామ్స్‌ ప్లే, పార్టీ టౌన్‌ నిర్వాహకులు చెప్పారు. నగరంలోనే అతిపెద్ద ఇండోర్‌ స్పోర్ట్స్‌ స్పేస్‌ ఫర్‌ చిల్డ్రన్‌ తమదే అన్నారాయన. ఆటలు టు ఆరోగ్యం.. గాడ్జెట్‌ అడిక్షన్‌ నుంచి చిన్నారుల్ని బయటకు తీసుకురావాలంటే అంతకు మించి ఆసక్తిని పెంచే ఆటల్ని అందిస్తున్నారు. ట్రాంపొలైన్స్, స్టిక్కీ వాల్, డోనట్‌ స్లైడ్, స్పైరల్‌ స్లైడ్, వాల్‌ క్లైంబర్స్, నింజా సర్క్యూట్, వల్కనో స్లైడ్, బబుల్‌ రోల్, మంకీ బ్రిడ్జి.. వంటి శారీరక వ్యాయామానికి ఉపకరించి ఆరోగ్యాన్నిచ్చేలా, పలు ప్రత్యేకమైన డిజైన్డ్‌ గేమ్స్‌ ఇలాంటి ప్లే ఏరియాల్లో ఏర్పాటు చేస్తున్నారు.   జంప్స్, రన్స్‌.. స్కూల్స్, ఇంటి పరిసరాల్లో ఆడుకునేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో వీటికి చిన్నారులు ఆకర్షితులవుతున్నారు. నాలుగేళ్లలోపు చిన్నారులకు ప్రత్యేకమైన టాడ్లర్‌ ఏరియా నెలకొల్పుతున్నారు. మిగిలినవన్నీ 14ఏళ్లలోపు చిన్నారులకు అనువుగా తీర్చిదిద్దుతున్నారు. 

బర్త్‌డే.. సందడే.. 
కేవలం ఆటపాటలకు మాత్రమే పరిమితం చేయకుండా చిన్నారుల పుట్టిన రోజులు కూడా జరుపుకునేందుకు వీలుగా వేదికలు రూపొందిస్తున్నారు. స్పెషల్‌ సర్కస్‌ థీమ్‌ వంటి పార్టీ ఏరియాలో.. బర్త్‌డేలు నిర్వహిస్తున్నారు.
అలాగే చిన్నారులతో వచ్చే పెద్దలు బోర్‌ ఫీల్‌ కాకుండా వారికి కూడా తంబోలా, మ్యూజిక్‌ ఛెయిర్స్, వాల్‌ పాసింగ్, డ్యాన్స్‌ పోటీలు.. ఏర్పాటు చేస్తున్నారు.  

కిడ్స్‌.. అండ్‌ పేరెంట్స్‌.. 
మా ప్లే ఏరియా మొత్తం 6వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పాం. ఇందులో పిల్లలూ, పేరెంట్స్‌ కలిసి కూడా ఎంజాయ్‌ చేయవచ్చు. ఫంక్షన్‌ హాల్, కెఫెటేరియా.. వంటివి ఉన్నాయి. 15 రకాల వైవిధ్యభరితమైన గేమ్స్‌
ఉన్నాయి. చిన్నారికి మాత్రమే ఎంట్రీ ఫీజు ఉంటుంది. చిన్నారితో వచ్చే పేరెంట్స్‌కి ఉచితంగా ప్రవేశం కల్పిస్తాం.  
 – ప్రణీత్‌, సిమ్‌ ఎన్‌ శ్యామ్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top