Friendship Day: మైత్రి.. ఓ మాధుర్యం.. అండగా ఉంటూ, ఆదర్శంగా నిలుస్తూ..

Friendship Day 2022: Long Time Friends, Suppeort In Hard times In karimnagar - Sakshi

సాక్షి, కరీంనగర్‌: బాల్యం.. స్నేహం ఎవరికైనా తీయని జ్ఞాపకం. విద్యార్థి దశలో మొదలైన స్నేహం.. జీవితంలో కలిసి సాగడం నిజంగానే అరుదు. అదో అదృష్టం కూడా. బతుకు బాటలో స్నేహ బంధానికి మించింది లేదు. స్నేహితులు లేని జీవితాన్ని ఎవరూ ఊహించరు.. ప్రాణ స్నేహితులు చాలా అరుదుగా ఉంటుంటారు. స్నేహం తప్ప మరేదీ ఆశించకుండా కొనసాగే బంధాలు మాత్రమే కలకాలం ఉంటాయి. నేడు స్నేహితుల దినోత్సవం 
సందర్భంగా ప్రత్యేక కథనం..


ఫ్రెండ్‌షిప్‌డే రోజున కేక్‌ కట్‌ చేస్తున్న స్నేహితులు

అతివల ‘స్నేహం’
కోరుట్ల: స్నేహానికి వయో..లింగ భేదం లేదు. కోరుట్ల పట్టణానికి చెందిన ఓ పదిహేను మంది మహిళలు 15 ఏళ్లుగా తమ స్నేహ బంధాలను కొనసాగిస్తున్నారు. తమ గ్రూపునకు స్నేహం అనే పేరు పెట్టుకుని దాన్ని సార్థకత చేసుకునే దిశగా ఒకరికొకరు కష్టసుఖాల్లో కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. కోరుట్లకు చెందిన గృహిణులు గరిపెల్లి మాధవి, కంటాల అనిత, రమాదేవి, సునీత, లీల తదితరులు పదిహేనేళ్లుగా ప్రెండ్స్‌గా ఉన్నారు. వీరంతా ఎవరి ఇంట్లో ఏలాంటి శుభ కార్యాలు ఉన్నా కలిసికట్టుగా ఒకరికొకరు సాయంగా పనులు చేసుకుంటారు. అంతే కాదు..గ్రూపు సభ్యుల్లో ఎవరికి కష్టం వచ్చినా తమకు తోచిన రీతిలో అవసరాలు తీర్చడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రతీ ఫ్రెండ్‌షిఫ్‌ డే రోజున తమ అనుబంధాన్ని బలీయం చేసుకునేందుకు అంతా కలిసి కేక్‌ కట్‌ చేసి ఏడాదికి ఒకరి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి గడుపుతారు. 


నగదు అందజేస్తున్న క్లాస్‌మేట్స్‌

 మిత్రుడికి అండగా క్లాస్‌మేట్స్‌
రుద్రంగి(వేములవాడ): మండల కేంద్రానికి చెందిన పీసరి భూమానందం ఇటీవల అనారోగ్యం బారిన పడగా వైద్యం చేయించుకునే స్థోమత లేదు. ఈక్రమంలో తోటి మిత్రులైన క్లాస్‌మేట్స్‌ (2000–01 ఎస్సెస్సీ బ్యాచ్, రుద్రంగి జెడ్పీ హైస్కూల్‌) వైద్య ఖర్చులకు రూ.50వేలు ఆర్థికసాయం చేసి స్నేహభావాన్ని చాటుకున్నారు. 

నేను, ఎమ్మెల్యే ప్రాణ స్నేహితులం
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నేను ప్రాణ స్నేహితులం. గోదావరిఖని తిలక్‌నగర్‌ డౌన్‌లో ఒకే వాడలో ఉంటాం. మేం బంధువులమైనా చిన్నప్పటి నుంచి  పీజీ వరకు కలిసే చదివాం. మా ఇద్దరి మధ్య ఏరోజూ గొడవ జరగలేదు. చందర్‌కు చాలా ఓపిక. గతంలో మా ఏరియాలో కౌన్సిలర్‌గా గెలిచేందుకు ఇద్దరకీ అవకాశం ఉండడంతో చందర్‌ కోసం నేను పోటీ చేయకుండా త్యాగం చేశా. అదే ఏరియాలో ఇప్పుడు నేను కార్పొరేటర్‌. 
– పెంట రాజేశ్, 37వ డివిజన్‌ కార్పొరేటర్, రామగుండం

కులమతాలకు అతీతం
కోరుట్ల: స్నేహానికి కులమతాలు అడ్డుకాదు. ఇదే కోవలో కోరుట్లకు చెందిన ఖాలిక్‌ పాషా, ముక్క శ్రీనివాస్‌ చిన్ననాటి నుంచి స్నేహితులు. పది నుంచి ఇంజినీరింగ్‌ వరకు కలిసి చదువుకుని ప్రస్తుతం ఖాలీక్‌ పాషా దక్షిణాఫ్రికాలో జాబ్‌ చేస్తుండగా, శ్రీనివాస్‌ అమెరికాలో పనిచేస్తున్నారు. ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా శనివారం ఇద్దరు కోరుట్లలో కలుసుకుని తమ స్నేహ జ్ఞాపకాలు పంచుకున్నారు. 


ఖాలిక్‌ పాషా, శ్రీనివాస్‌

ముగ్గురు వైద్యుల ముచ్చటైన స్నేహం
సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన ప్రముఖ వైద్యులు పి.పెంచలయ్య, ఎన్‌.వి.రమణ రావు, పి.చంద్రశేఖర్‌ మంచి స్నేహితులు. 1984–85లో మెడిసిన్‌ చదువుతున్న రోజుల్లో కర్నూల్‌ మెడికల్‌ కాలేజీలో వీరి స్నేహం మొదలైంది. ముగ్గురి సొంత జిల్లాలు వేరైనా సిరిసిల్లలో స్థిరపడ్డారు. ప్రభుత్వ డాక్టర్లుగా నిజాయితీగా పని చేశారు. వీరి సతీమణులు శోభారాణి, లీలా శిరీష, శ్రీవాణిలు సైతం సిరిసిల్ల గైనాకాలజిస్ట్‌ డాక్టర్లుగా స్థిరపడ్డారు. రెండున్నర దశాబ్దాలుగా వైద్యసేవలు అందిస్తున్నారు.


సాయికిరణ్, నరేశ్, సంతోష్, కరుణాకర్‌

మంచి స్నేహితులను వదులుకోవద్దు
పెద్దపల్లి: మంచి స్నేహితులు లభించడంతో మంచి జీవితాన్ని పొందవచ్చు. అమ్మానాన్న జన్మను ఇస్తే స్నేహితులు మనకు బంగారు బాట చూపిస్తారు. మంచి స్నేహితులను వదలుకోకూడదు. రాజకీయాల్లో ఉన్న సమయాల్లో నా మిత్రుడు (ప్రస్తుతం అడిషనల్‌ డీజీపీ శ్రీనివాసరెడ్డి) నన్ను చదువుకోమని ప్రోత్సహించాడు. ఆయన ప్రోత్సాహంతో నేను రాజకీయాలు వీడి ఉన్నత చదువులు చదివిన. యువత చెడు స్నేహాలు చేయొద్దు. మనకున్న మంచి స్నేహితులను విడిచిపెట్టొద్దు.  
లక్ష్మీనారాయణ,అదనపు కలెక్టర్, పెద్దపల్లి 

స్నేహితులే నా ప్రాణం
పెద్దపల్లికమాన్‌: స్నేహితుల సహకారంతోనే అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ స్థాయికి వచ్చాను. చిన్ననాటి బాల్య మిత్రులు ముక్తార్‌ ఫ్యాషన్‌– డిజైనర్, సతీశ్‌– టీచర్, బాలు– బిజినెస్‌ చేస్తూ నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహించారు. రక్త సంబంధాలే దూరమవుతున్న ఈ కాలంలో నేను చేసే పనిలో అన్నీ వారై నా విజయంలో పాలు పంచుకున్నారు. జీవితాంతం వారు న్యాయవాద వృత్తిలో నాతోపాటు ఉండాలని ఈ విద్యా సంవత్సరంలో వారిని ఎల్‌ఎల్‌బీ చదివిస్తున్నా.  
– పి.రాకేశ్, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్, పెద్దపల్లి 

పాతికేళ్ల స్నేహబంధం
వేములవాడ: వాళ్లిద్దరూ చిన్ననాటి మిత్రులు.. కలిసే చదువుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ ప్రజాసేవలో తరిస్తున్నారు. వేములవాడ మున్సి పల్‌ 3వ వార్డు కౌన్సిలర్‌గా నిమ్మశెట్టి విజయ్, 27వ వార్డు కౌన్సిలర్‌గా గోలి మహేశ్‌ సేవలందిస్తున్నారు. వేములవాడ పట్టణంలో 1 నుంచి 12వ తరగతి వరకు గీతా విద్యాలయంలో చదువుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ కలిసే నడిచారు. రాష్ట్రం సాధించుకున్న అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీలో కొనసాగుతూ కౌన్సిలర్లుగా గెలి చారు. నాటి నుంచి నేటి వరకు అరేయ్‌... ఒరేయ్‌ అంటూ భుజాలు తడుముకుంటూ దోస్తానా చలాయిస్తున్నా రు. అంతేకాకుండా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ 30కి పైగా రక్తదానాలు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు.

క్లాస్‌మెట్లు.. జాబ్‌మెట్లు
బోయినపల్లి(చొప్పదండి): మండలకేంద్రానికి చెందిన మాడిషెట్టి సాయికిరణ్, వాసాల సంతోష్, మోగులోజి నరేశ్, సంబ కరుణాకర్‌లు స్థానిక హైస్కూల్‌లో 2008లో  పదోతరగతి ఉత్తీర్ణులు అయ్యారు. తర్వాత ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. నలుగురు ఒకేసారి పోలీసులుగా సెలక్ట్‌ అయ్యారు.  పండుగలు, ఇతరత్రా సెలవుల్లో ఊరికి వచ్చినపుడు సందడి చేస్తామని చెప్పారు. 

‘ఫ్రెండ్స్‌’ సేవాభావం
మెట్‌పల్లి(కోరుట్ల): మెట్‌పల్లికి చెందిన సురిగి శ్రీనివాస్‌ స్నేహితులతో కలిసి ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఐదుగురితో మొదలైన ట్రస్ట్‌లో ప్రస్తుతం 60మంది సభ్యులుగా ఉన్నారు. అందరూ తమ సంపాదనలో నుంచి కొంత మొత్తాన్ని ట్రస్ట్‌కు అందిస్తున్నారు. దీనికి తోడు పలువురు చేస్తున్న ఆర్థికసాయంతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top