యంగ్‌ కలెక్టర్‌.. ఒకేసారి ఐదు కుర్చీల్లో..! | Four Additional Responsibilities for Hanumakonda Collector Chahat Bajpai | Sakshi
Sakshi News home page

యంగ్‌ కలెక్టర్‌.. ఒకేసారి ఐదు కుర్చీల్లో..!

May 8 2026 12:53 PM | Updated on May 8 2026 1:27 PM

Four Additional Responsibilities for Hanumakonda Collector Chahat Bajpai

వరంగల్‌ అర్బన్‌ : గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీడబ్ల్యూఎంసీ)లో గురువారం నుంచి ప్రత్యేకాధికారి పాలన ప్రారంభమైంది. హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ టీ.కే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. బల్దియా పాలక మండలి పదవీ కాలం బుధవారంతో పూర్తయిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే నాటికి ప్రత్యేకాధికారి పాలన కొనసాగనుంది. గ్రేటర్‌ వరంగల్‌ ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా, స్పెషల్‌ ఆఫీసర్‌గా చాలాతక్కువ మంది కలెక్టర్లకు ఇలాంటి అవకాశం లభిస్తుందని సీనియర్‌ అధికారులంటున్నారు. 

ఒకరికే.. నాలుగు అదనపు బాధ్యతలు
వరంగల్, హనుమకొండ జిల్లాలకు హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అత్యంత కీలకమయ్యారు. గ్రేటర్‌ వరంగల్‌ మహానగరం, కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(కుడా) రెండు జిల్లాల్లో విస్తరించి ఉంటుంది. బల్దియా కమిషనర్‌గా పనిచేసిన ఆమె ఇటీవల పదోన్నతిపై హనుమకొండ కలెక్టర్‌గా నియామకమయ్యారు. ప్రభుత్వం కమిషనర్‌ పోస్ట్‌ను ఇంకా భర్తీ చేయలేదు. ఆమెనే కలెక్టర్‌గా, బల్దియా ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా, కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(కుడా) వైస్‌ చైర్‌పర్సన్‌గా, హనుమకొండ జెడ్పీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక మీదట బల్దియా ప్రత్యేకాధికారిగా కొనసాగనున్నారు. ఇలా ఐదు కుర్చీల్లో ఆమె బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. అయితే అన్నింటినీ చక్కదిద్దడం కత్తిమీద సామే అంటున్నారు విశ్లేషకులు. 

మహా నగర అభివృద్ధిని కొనసాగిద్దాం : ప్రత్యేకాధికారి చాహత్‌ బాజ్‌పాయ్‌
కిందిస్థాయి నుంచి వింగ్‌ అధికారి వరకు బాధ్యతాయుతంగా తమ విధులను సమన్వయంతో పనిచేస్తూ, మహా నగర అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేద్దామని గ్రేటర్‌ వరంగల్‌ ప్రత్యేకాధికారి, హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో స్పెషల్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వింగ్‌ అధికారులతో సమావేశమై పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. సుమారు రూ.100 కోట్ల విలువైన పెద్ద ప్రాజెక్టులు వేగంగా అమలయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. 

ముఖ్యంగా రహదారులు, పారిశుద్ధ్యం మౌలిక వసతుల కల్పన దృష్టి కేంద్రీకరించాలన్నారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో  ప్రజా ఫిర్యాదులకు తక్షణం స్పందించాలని, ఫైళ్లు ఎక్కడా నిలిచిపోకూడదని హెచ్చరించారు. యూజీడీ ప్రాజెక్ట్‌ డీపీఆర్‌ అంతిమ దశకు చేరుకున్నందున ఇంజనీరింగ్‌ అధికారులు అందుకు అవసరమైన సూచనలు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్, సీఎంహెచ్‌ఓ డా.రాజారెడ్డి, ఇన్‌చార్జ్‌ సిటీ ప్లానర్‌ రవీందర్‌ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, ఎంహెచ్‌ఓ డా.రాజేశ్, ఈఈలు రవికుమార్, సంతోశ్‌బాబు, మహేందర్, మాధవీలత పాల్గొన్నారు. స్పెషల్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన చాహత్‌ బాజ్‌పాయ్‌కి అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement