డబుల్‌ డెక్కర్‌ ఆగయా.. నిజాం నాటి బస్సులకు పూర్వ వైభవం..

First Three  Electric Double Decker Buses Launched In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ‘అలనాటి చారిత్రక డబుల్‌ డెక్కర్‌ పూర్వవైభవాన్ని సంతరించుకుంది. హైదరాబాద్‌ అందాలను ఆస్వాదిస్తూ  రెండంతస్తుల బస్సుల్లో  ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభూతి’ అంటూ ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్‌ ఆ అందమైన అనుభవాన్ని నగరవాసులకు తిరిగి అందుబాటులోకి తెచ్చారు. త్వరలోనే  డబుల్‌ డెక్కర్‌ బస్సులను రోడ్డెక్కించనున్నట్లు  ఆయన అప్పుడే చెప్పారు. ట్విట్టర్‌ వేదికగా స్పందించినట్లుగానే పర్యావరణ ప్రియమైన ఎలక్ట్రిక్‌  డబుల్‌ డెక్కర్‌ బస్సులను మంగళవారం ప్రారంభించారు.

నగరవాసులతో పాటు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను, సందర్శకులను సైతం విశేషంగా ఆకట్టుకొనే విధంగా ఉన్న మూడు డబుల్‌ డెక్కర్‌  బస్సులను నానక్‌రాంగూడలోని హెచ్‌ఎండీఏ అనుబంధ హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ లిమిటెడ్‌  కార్యాలయం వద్ద జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఫార్ములా– ఈ ప్రిక్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు  ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. చేవెళ్ల ఎంపీ జి.రంజిత్‌రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఆహ్లాదభరింతంగా పర్యాటక విహారం.. 
ఫార్ములా– ఈ ప్రిక్స్‌ సందర్భంగా  ప్రారంభించిన డబుల్‌ డెక్కర్‌ బస్సులు ప్రస్తుతం రేసింగ్‌ ట్రాక్‌ పరిధిలోని ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, పారడైజ్‌ ,నిజాం కాలేజీ రూట్‌లలో తిరుగుతాయి. మొదటి విడతగా హెచ్‌ఎండీఏ 6 బస్సులను కొనుగోలు చేయగా  ప్రస్తుతం మూడింటిని ప్రవేశపెట్టారు. త్వరలో మరో మూడు బస్సులు రానున్నాయి. దశలవారీగా మొత్తం 20 బస్సులను ప్రవేశపెట్టేందుకు హెచ్‌ఎండీఏ  ప్రణాళికలను సిద్ధం చేసింది. ఫార్ములా– ఈ ప్రిక్స్‌ అనంతరం డబుల్‌ డెక్కర్‌ బస్సులను చారిత్రక, వారసత్వ కట్టడాల సర్క్యూట్‌లలో నడుపుతారు. హైదరాబాద్‌ పర్యాటక స్థలాలను ఈ బస్సుల్లో సందర్శించవచ్చు. పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించనున్నారు. ఈ నెల 11న ఫార్ములా– ఈ పోటీల సందర్భంగా డబుల్‌ డెక్కర్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. 

ఇదీ నేపథ్యం... 
నిజాం కాలంలోనే ప్రవేశపెట్టిన డబుల్‌ డెక్కర్‌ బస్సులను ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ 2003 వరకు నడిపింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి  జూపార్కు వరకు, అఫ్జల్‌గంజ్‌ వరకు ఇవి నడిచేవి. సికింద్రాబాద్‌ నుంచి మెహిదీపట్నం వరకు  డబుల్‌ డెక్కర్‌లు ఉండేవి. నగరవాసులతో పాటు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఆ బస్సులో పయనించేందుకు ఎంతో మక్కువ చూపేవారు. ట్యాంక్‌బండ్‌ మీదుగా  ఇందులో ప్రయాణం చేయడం ఒక గొప్ప అనుభూతి. కాలక్రమంలో బస్సుల నిర్వహణ భారంగా  మారడంతో వీటికి కాలం చెల్లింది. ఫ్లైఓవర్‌ల కారణంగా కూడా బస్సులు నడపడం  కష్టంగా మారింది. మంత్రి కేటీఆర్‌ చొరవ మేరకు ప్రస్తుతం అత్యాధునిక సాంకేతిక సామర్థ్యంతో రూపొందించిన ఎలక్ట్రిక్‌  డబుల్‌ డెక్కర్‌లు అందుబాటులోకి వచ్చాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top