
కేసముద్రంలో యూరియా టోకెన్ల కోసం ఆదివారం రాత్రి చీకట్లో పడిగాపులు పడుతున్న రైతులు
దొరకని చోట తప్పని ఘర్షణలు..వాగ్వాదాలు.. ఆందోళనలు
చిన్నశంకరంపేట/మిరుదొడ్డి/దోమకొండ/కేసముద్రం: యూరియా కష్టాలు రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొన్నిచోట్ల ఘర్షణలకు కూడా దారి తీస్తున్నాయి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయి సహకార సంఘం వద్ద యూరియా కోసం ఆదివారం తెల్లవారుజాము నుంచే రైతులు క్యూలైన్‌లో చెప్పులు పెట్టి పడిగాపులు కాశారు. యూరియా పంపిణీ సందర్భంగా ఒక బస్తా నాదంటే నాదని ఇద్దరు రైతులు కొట్టుకున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరికొందరు రైతులు వారిని సముదాయించారు. చివరకు కొట్టుకున్న ఇద్దరు రైతులకు యూరియా దొరకలేదు.
⇒ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని రైతువేదిక వద్దకు చుట్టు పక్క గ్రామాలకు చెందిన రైతులు శనివారం అర్ధరాత్రి నుంచే క్యూ కట్టి ఆదివారం తెల్లవారుజాము వరకు జాగారం చేశారు. అయితే యూరియా లారీ రాలేదని అధికారులు చెప్పడంతో రైతులు నిరాశతో వెనుదిరిగారు.
⇒ కామారెడ్డి జిల్లా దోమకొండలోని సింగిల్‌విండో కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం ఆందోళన చేశారు. కొందరికి యూరియా దొరకపోవడంతోవ్యవసాయాధికారులు, సింగిల్‌విండో కార్యాలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
⇒ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైతు వేదిక వద్ద ఆదివారం అర్ధరాత్రి యూరియా టోకెన్ల కోసం రైతులు బారులుదీరారు. సోమవారం యూరియా బస్తాలు పంపిణీ చేయనుండగా, అధికారులు ముందస్తుగా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలుసుకున్న రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చి క్యూలో నిల్చున్నారు.