
సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం పాట్లు
ఉమ్మడి పాలమూరులో అవే ఇక్కట్లు
చెన్నూరులో ఓ రైతుకు ఫిట్స్
మిరుదొడ్డి/నంగునూరు/చెన్నూర్‌రూరల్, మహబూబ్‌నగర్‌నెట్‌వర్క్: జోరువానలోనూ యూరియా కోసం రైతులు బారులు తీరారు. బుధవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి యూరియా లారీ వస్తుందని తెలియడంతో వేల సంఖ్యలో రైతులు తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తడిసి ముద్దవుతూనే గొడుగులు పట్టుకొని టోకెన్ల కోసం క్యూ కట్టారు.
» నంగునూరు ఆగ్రోసేవా కేంద్రానికి యూరియా వస్తుందని తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు తెల్లవారు జామునే వచ్చి క్యూలైన్‌లో నిలబడ్డారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా రాత్రి వరకు నిరీక్షించారు.
» మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం దుగ్నేపల్లి గ్రామంలో రైతు బొంబురపు రాజిరెడ్డి యూరియా కోసం వరుసలో నిలబడి ఉండగా ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి రైతులు 108లో చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
» ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా యూరియా కష్టాలు తీరడం లేదు. జడ్చర్లలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. దేవరకద్ర, మూసాపేట, చిన్నచింతకుంట మండలాల్లోనూ ఇదే పరిస్థితి. నారాయణపేట జిల్లా మద్దూరు పీఏసీఎస్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ పీఏసీఎస్ వద్ద పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేపట్టారు.
» నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ, కల్వకుర్తిలో పీఏసీఎస్, తిమ్మాజిపేటలోని ఆగ్రో కేంద్రాల వద్ద రైతులు గంటల తరబడి ఎదురుచూశారు. లింగాల మండల కేంద్రంలోని పీఏసీఎస్‌కు రెండు లారీల యూరియా రావడంతో రైతుల సంఖ్య పెరిగి తోపులాటకు దారి తీసింది.
» జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలో తోపులాట, ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గట్టులోనూ రైతులు భారీగా తరలిరావడంతో పోలీసుల సమ క్షంలో యూరియా పంపిణీ చేశారు. వడ్డేపల్లిలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రైతులు ఉదయం నుంచి రాత్రి వరకు కడుపు మాడ్చుకొని క్యూలైన్లలో నిల్చున్నారు.