
వర్చువల్‌గా ప్రధాని మోదీ మాట్లాడుతుండగా.. నారాయణపేట జిల్లా జాజాపూర్‌లో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఎంపీ డీకే అరుణ, కలెక్టర్ సిక్తపట్నాయక్ తదితరులు
నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల, జనగామ జిల్లా రైతులకు మహర్దశ
8.75 లక్షల మంది రైతులు.. ఏటా రూ.960 కోట్లు.. 6 ఏళ్ల వరకు నిధులు
వర్చువల్‌లో పీఎండీడీకేవైని ప్రారంభించిన ప్రధాని మోదీ
ఈ నెలాఖరు వరకు జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్ ఖరారు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వెనుకబడిన జిల్లాలను ప్రగతి బాట పట్టించేందుకు కేంద్రం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై)(PMDDKY)ను అమల్లోకి తెచ్చింది. ఈ పథకానికి దేశవ్యాప్తంగా 100 జిల్లాలను ఎంపిక చేయగా, తెలంగాణలో నాలుగు జిల్లాలకు చోటు దక్కింది. ఉమ్మడి పాలమూరులోని నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగుళాంబ గద్వాలతో పాటు ఉమ్మడి వరంగల్‌లోని జనగామను చేర్చడంతో ఆయా జిల్లాల్లోని రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా శనివారం ఈ పథకాన్ని ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పథకం అమలు తీరు.. రైతులకు చేకూరనున్న ప్రయోజనాలపై ‘సాక్షి’ కథనం.
ఒక్కో జిల్లాకు ఏటా రూ.240 కోట్లు
తక్కువ వ్యవసాయ ఉత్పాదకత కలిగిన జిల్లాలను గుర్తించిన కేంద్రం ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తి పెంచే లక్ష్యంతో పీఎండీడీకేవైకి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు వంద జిల్లాలకు ఏటా రూ.24 వేల కోట్లు కేటాయిస్తుంది. ఆరేళ్ల పాటు ఈ నిధులు విడుదలవుతాయి. కేంద్రంలోని 11 మంత్రిత్వ శాఖల పరిధిలోని 36 పథకాలను సమ్మిళితం చేసి పీఎండీడీకేవైని అమలు చేస్తారు. కేంద్ర పథకాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాల అనుసంధానం.. ప్రైవేట్ రంగాల భాగస్వామ్యంతో రైతులకు లబ్ధి చేకూరుతుంది.
పర్యవేక్షణకు నోడల్ అధికారులు
పీఎండీడీకేవై పర్యవేక్షణకు కేంద్రం పెద్దపీట వేసింది. ఎంపికైన జిల్లాలకు ఐఏఎస్ ఆఫీసర్లను నోడల్ అధికారులుగా నియమించింది. గద్వాల జిల్లాకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పౌసుమిబసు, నాగర్‌కర్నూల్‌కు మత్స్య శాఖ సంయుక్త కార్యదర్శి నీతూకుమారి ప్రసాద్‌ను నియమించింది. వీరిద్దరూ తెలంగాణ కేడర్ అధికారులే. నారాయణపేట జిల్లాకు బిహార్ కేడర్ ఐఏఎస్ అధికారి రమణకుమార్, జనగామ జిల్లాకు హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న ఏజీఎంయూటీ కేడర్ అధికారిణి సుష్మా చౌహాన్ నియమితులయ్యారు.
జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో సమితులు..
పీఎండీడీకేవై అమలుకు జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో సమితులు ఏర్పాటుకానున్నాయి. జిల్లాస్థాయిలో కలెక్టర్ ఆధ్యర్యంలో జిల్లా ధన్ ధాన్య కృషి సమితిని ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర ధన్ ధాన్య కృషి సమితి, జాతీయ స్థాయిలో కేంద్ర మంత్రి, కార్యదర్శి స్థాయిలో ఏర్పాటైన సమితులు పథకం అమలును పర్యవేక్షిస్తాయి. నేల, నీటి సంరక్షణ, సహజ, సేంద్రియ సాగు విస్తరణతోపాటు మొత్తంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో స్వయం సమృద్ధికి తగిన చర్యలు చేపడతారు. పండ్ల తోటలు, మత్స్య సంపద, తేనె టీగల పెంపకం, పశుపోషణ పెంపుతోపాటు పంట ఉత్పత్తుల మార్కెంటింగ్‌పై దృష్టి సారిస్తారు.
యాక్షన్ ప్లాన్‌కు కసరత్తు..
మొదటగా జిల్లా స్థాయిలో ఏర్పాటైన సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే నిర్వహిస్తారు. ఏ ప్రాంతంలో ఉత్పాదక లోపాలు (దిగుబడి తక్కువ), వైవిధ్యీకరణ పాటించకపోవడం (ప్రతి ఏటా ఒకే రకమైన పంట వేయడం), నీటి వనరులు, మార్కెట్ పరంగా మౌలిక సదుపాయాలు, శీతల గిడ్డంగుల కొరత, రుణాల పరిస్థితి (సగటు కంటే తక్కువ రుణాలు అందుబాటులో ఉండడం)పై పూర్తిస్థాయిలో పరిశీలిస్తారు. ఇందుకనుగుణంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేస్తారు. ఈ నెలాఖరు లేదంటే వచ్చే నెల మొదటి, రెండో వారంలోపు యాక్షన్ ప్లాన్ ఖరారు చేస్తారు.