
జిల్లాకు పూర్తిస్థాయిలో చేరని బతుకమ్మ కానుక
మహిళా సంఘాల సభ్యులు 1,95,540 మంది
మహబూబాబాద్ అర్బన్ : తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ(Bathukamma Gift). ఆడబిడ్డలకు ఇష్టమైన ఈ వేడుకలకు కానుకగా గత ప్రభుత్వం చీరలు(sarees) అందించేది. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రస్తుతం ప్రభుత్వం మహిళా సంఘాల్లోని సభ్యులకు చీరలను అందించేందుకు నిర్ణయించింది. అయితే ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభమైనా.. నేటికీ జిల్లాకు బతుకమ్మ చీరలు(Bathukamma sarees) చేరకపోవడం గమనార్హం. అయితే ఇతర జిల్లాలకు చీరలు చేరినట్లుగా తెలిసింది.
కాగా, మహిళా సంఘాల సభ్యుల వివరాలు ప్రభుత్వానికి ఇవ్వకపోవడంతోనే ఆలస్యం అవుతుందని సంబంధిత జిల్లా అధికారులు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఏటా బతుకమ్మ పండుగకు చీరల పంపిణీతో లక్షలాది మంది మహిళలకు లబ్ధి చేకూరింది. ఈ చీరలు పండుగ సందర్భంగా ఆనందాన్నివ్వడంతోపాటు, ఆర్థిక భారాన్ని తగ్గించే విధంగా ఉండేవని మహిళలు అభిప్రాయపడుతున్నారు. ఈసారి బతుకమ్మ పండుగ కూడా వచ్చేసింది.. మరి చీరలు ఎప్పుడు వస్తాయని మహిళలు ఎదురుచూస్తున్నారు.
మహిళా సంఘాల సభ్యులకే..
గతంలో రేషన్‌కార్డు(Ration card) కలిగి ఉండి 18 సంవత్సరాలు నిండిన యువతులు, మహిళలకు ప్రభుత్వం చీరలు అందించేది. ప్రస్తుతం మహిళా సంఘాల్లోని సభ్యులకు మాత్రమే చీరలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో మహిళా పొదుపు సంఘాల్లో 1,95,540 మంది సభ్యులుగా ఉన్నారు. వీరికి మాత్రమే ఈఏడాది ప్రభుత్వ కానుక అందనుంది. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీ కేంద్రాలు, 482 గ్రామపంచాయతీలు ఉన్నాయి.
ఇందులో మెప్మా సిబ్బంది, గ్రామస్థాయిలో ఐకేపీ సిబ్బంది, గ్రామపంచాయతీ కార్యదర్శులు, సీసీలు తదితరులతో చీరలు పంపిణీ చేయనున్నారు. డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులై ఉండి వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదైతేనే చీరను అందించనున్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతులు, మహిళలకు ఈసారి చీరలు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం ఒక చీరపై రూ.800 ఖర్చు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. తొర్రూరు పట్టణ కేంద్రానికి మాత్రం 15వేలు చీరలు వచ్చినట్లు తెలిసింది.