
సాక్షి, హైదరాబాద్: ఆసియా కప్-2025లో భాగంగా నేడు భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పాక్ జట్టుతో భారత్ క్రికెట్ ఆడటంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని చెప్పిన ప్రధాని మోదీ.. క్రికెట్ మ్యాచ్ ఆడటానికి ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. దీనికి బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. భారత్-పాక్ మ్యాచ్‌పై స్పందించారు. ఈ క్రమంలో తాజాగా అసద్ మీడియాతో మాట్లాడుతూ.. పహల్గాం దాడి తర్వాత పాక్‌తో మ్యాచ్ ఎలా ఆడుతారు. మతాన్ని అడిగి మరీ 26 మందిని దారుణంగా కాల్చి చంపారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని చెప్పిన మోదీ.. క్రికెట్ మ్యాచ్ ఎలా జరుగుతుందో చెప్పాలి. 26 మంది పౌరుల ప్రాణాల కంటే డబ్బే ఎక్కువ విలువైందా?. దీనికి కేంద్రంలోని బీజేపీ సమాధానం చెప్పాలి. పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలు తెంచుకున్నప్పుడు.. నీటి ఒప్పందాలు కూడా రద్దు చేసుకున్నప్పుడు మ్యాచ్ మాత్రం ఎందుకు ఆడుతున్నారు. పహల్గాం బాధితులకు మోదీ ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. దేశభక్తి పేరుతో బీజేపీ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు.
ఇదిలా ఉండగా.. భారత్–పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ నిర్వాహణపై మొదటి నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ, ఇరు జట్లు మాత్రం ఆడకూడదని ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక, మాజీ క్రికెటర్లు కూడా దీనిపై స్పందిస్తూ, “అంతర్జాతీయ టోర్నమెంట్లలో మ్యాచ్‌లు తప్పనిసరిగా ఆడాలి. లేకపోతే జట్లను మొత్తం సిరీస్ నుంచి ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది” అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక సోషల్ మీడియాలో కూడా భారత్–పాక్ మ్యాచ్ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. #BoycottPakistanMatch హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో కొనసాగుతుండగా, యువత భారీ స్థాయిలో ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తున్నారు. పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడవద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
