
యూరియా కోసం నల్లగొండలోని ఆగ్రో ఏజెన్సీ వద్ద బారులు తీరిన రైతులు
యూరియా కోసం ప్రతీరోజూ రైతులకు కష్టాలే..
కామారెడ్డి జిల్లా బీబీపేటలో 15 గంటల పాటు అన్నదాతల నిరీక్షణ
మరిపెడలో టోకెన్ల కోసం గేటు దూకిన మహిళా రైతులు
సాక్షి, నెట్‌వర్క్: గంటల తరబడి బారులు తీరినా...రైతులకు ఒక్క యూరియా బస్తా కూడా దొరకడం గగనమైంది. రోజురోజుకూ యూరియా కష్టాలు తీవ్రతరం అవుతున్నాయి. దీంతో రాస్తారోకోలు, ధర్నాలకు దిగుతున్నారు.
» ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చూస్తే...యూరియా కోసం జడ్చర్లలో 167 జాతీయ రహదారిపై సిగ్నల్‌గడ్డ వద్ద రైతులు ధర్నా చేశారు. మహమ్మదాబాద్ మండలం నంచర్లగేట్ వద్ద రైతులు రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రాజాపూర్, బాలానగర్, చిన్నచింతకుంట, మిడ్జిల్ మండలాల్లోని పలు కేంద్రాల వద్ద రైతులు బారులు తీరారు. నవాబ్‌పేటలో వేలాది మంది రైతులు రావడంతో పోలీసు పహారా మధ్య యూరియా పంపిణీ చేశారు.
» నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఉప్పునుంతల పీఏసీఎస్ వద్ద జప్తీ సదగోడుకు చెందిన మొగిలి అనిత క్యూలో నిల్చొని స్పృహతప్పి పడిపోయింది. వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో రైతులు ధర్నా చేశారు.
» భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పీఏసీఎస్‌కు రైతులు భారీగా పోటెత్తారు.
» మెదక్ జిల్లా శివ్వంపేట పీఏసీఎస్‌కు తెల్లవారు జా ము నుంచే రైతులు పెద్దఎత్తున బారులు తీరారు.
» నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆగ్రో ఏజెన్సీ వద్దకు రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. చిన్నపిల్లల తల్లులు, వృద్ధులు కూడా క్యూ లైన్‌లో నిల్చున్నారు.
» కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని సొసైటీకి యూరియా లారీ వస్తుందన్న సమాచారంతో ఉదయం 4 గంటల నుంచే రైతులు క్యూ కట్టారు. గంటల తరబడి వేచి ఉండడం ఇబ్బందిగా మారడంతో వరుసలో రాళ్లు, చెప్పులు, చెట్ల కొమ్మలు ఉంచారు. రాత్రి 7 గంటల వరకు నిరీక్షించినా లారీ రాకపోవడంతో నిరాశతో తిరుగుముఖం పట్టారు.
» ఉమ్మడి వరంగల్‌జిల్లాలో యూరియా కష్టాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం సొసైటీ వద్ద రైతులు తెల్లవారుజామునుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. చివరకు యూరియా లారీ రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. నర్సింహులపేట మండల కేంద్రంలో పీఏసీఎస్ ఎదుట కూపన్ల కోసం ఉదయం నుంచే రైతులు చెప్పులను క్యూలో పెట్టారు. డోర్నకల్ మండలం గొల్లచర్ల సమీపంలోని పీఏసీఎస్ ఎదుట రైతులు రాస్తారోకో నిర్వహించారు. దంతాలపల్లి రైతు వేదిక వద్ద కూపన్ల కోసం కిలోమీటర్ మేర లైన్ కట్టి గంటల కొద్ది వేచి చూశారు. మరిపెడ పీఏసీఎస్‌లో మహిళా రైతులు యూరియా టోకెన్ల కోసం గేటు దూకి మరి కార్యాలయంలోకి వెళ్లారు.
» వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రామలింగాయపల్లి పీఏసీఎస్‌కు రాత్రి యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు అక్కడే పడుకునేందుకు బుధవారం రాత్రి చద్దర్లు, గొడుగులతో వచ్చారు. జనగామ జిల్లా కేంద్రంతోపాటు తరిగొప్పుల, స్టేషన్‌ఘన్‌పూర్‌లో యూరియా కోసం బారులుతీరారు.
» జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల ఆగ్రోస్–1, చిట్యాల ఓడీఎంఎస్ దుకాణం వద్ద పోలీస్ పహారాలో యూరియా పంపిణీ చేశారు.
» ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని రాజారాంపేట సొసైటీ వద్ద ఒకే బస్తా ఇవ్వడంపై రైతులు మండిపడ్డారు. కేంద్రం ఇన్‌చార్జ్, ఎంపీఓ శివ రైతులతో వాగ్వాదానికి దిగడం ఉద్రిక్తతకు దారి దీసింది. కోర్టుకు వెళ్లాలంటూ రైతులను ఆయన బయటకు తోసేసే ప్రయత్నం చేయగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.