ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌.. ఇంకా జాప్యమే! | Engineering Counseling Still late in Telangana | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌.. ఇంకా జాప్యమే!

Jun 5 2025 1:50 AM | Updated on Jun 5 2025 1:50 AM

Engineering Counseling Still late in Telangana

15 తర్వాతే షెడ్యూల్‌... అధికారుల నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: షెడ్యూల్‌ ఇంకా విడుదల కాని కారణంగా ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. మే 11వ తేదీనే సెట్‌ ఫలితాలు విడుదల చేశారు. సాధారణంగా ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలైన వెంటనే షెడ్యూల్‌ ప్రకటిస్తారు. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ముందే కౌన్సెలింగ్‌ చేపడతామని, క్లాసులు కూడా త్వరగా ప్రారంభిస్తామని ఉన్నత విద్యామండలి ఆరునెలల క్రితమే చెప్పింది. కానీ సెట్‌ ఫలితాలు విడుదలై నెల కావొస్తున్నా ఇంతవరకూ కౌన్సెలింగ్‌పై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

జాప్యానికి వారు అనేక కారణాలు చెబుతున్నారు. ఈ నెల రెండో వారం వరకూ షెడ్యూల్‌ మాత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. రానురాను ప్రక్రియ ఆలస్యమవుతున్న కారణంగా ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు యాజమాన్య కోటాలో చేరాలనుకునే వారు ఇతర రాష్ట్రాల వైపు చూస్తున్నారు.  

ఏఐసీటీఈనే కారణమా? 
కాలేజీల్లో సీట్లు, బ్రాంచ్‌లకు సంబంధించి ప్రతీ కాలేజీకి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతి అవసరం. ఏటా ఏప్రిల్‌ నెలాఖరు, లేదా మే మొదటివారంలోనే ఈ గుర్తింపు ఇస్తుంది. తమతో సంప్రదించిన తర్వాతే సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని అన్ని రాష్ట్రాలూ ఏఐసీటీఈకి లేఖలు రాశాయి. అనుమతి ఇచ్చినా, రాష్ట్ర పరిధిలోని విశ్వవిద్యాలయాలు కొత్త సీట్లు, బ్రాంచ్‌కు అనుబంధ గుర్తింపు నిరాకరిస్తున్నాయి. 

ఇది న్యాయ వివాదానికీ కారణమవుతోంది. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకొని ఈసారి ఏఐసీటీఈ ఆచితూచి అడుగులేస్తోంది. ఈ కారణంగానే అనుమతి ఇవ్వడానికి ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 13లోగా ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ఏఐసీటీఈ తెలిపింది. 

దీంతో రాష్ట్రంలో ఎన్ని ఇంజనీరింగ్‌ సీట్లు ఉంటాయనే దానిపై స్పష్టత వస్తుంది. ప్రస్తుతం 1.16 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లు ఉన్నాయి. గత ఏడాది దాదాపు 12 వేల సీట్ల పెంపునకు కాలేజీలు ముందుకొచ్చాయి. 3 వేల సీట్లు పెంచినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదు.  

ఖరారు కాని ఫీజులు 
ఇంజనీరింగ్‌ ఫీజులు ఖరారవ్వకపోవడమూ కౌన్సెలింగ్‌కు అడ్డంకిగా మారింది. రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ ప్రతీ మూడేళ్లకోసారి ఇంజనీరింగ్‌ ఫీజులను సమీక్షిస్తుంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు ఖరారు చేయాల్సి ఉంది. ప్రైవేట్‌ కాలేజీలు సమర్పించిన గడిచిన మూడేళ్ల వార్షిక నివేదికలపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. 

కాలేజీలు కృత్రిమంగా జమా ఖర్చుల నివేదికలు ఇచ్చాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఫీజుల పెంపు నిర్ణయాన్ని ఎఫ్‌ఆర్‌సీ ప్రభుత్వానికి తెలిపింది. సర్కార్‌ నుంచి ఇంత వరకూ ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. కౌన్సెలింగ్‌ చేపట్టే సమయంలో ఏ కాలేజీలో ఎంత ఫీజు అనే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫీజులపై స్పష్టత లేని కారణంగా కౌన్సెలింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో వివరాలు ఫీడ్‌ చేయలేమని అధికారులు అంటున్నారు.  

ముందుకు సాగని అనుబంధ గుర్తింపు 
కౌన్సెలింగ్‌ నాటికి వర్సిటీలు సీట్లు, బ్రాంచ్‌లు ఖరారు చేసి, అనుబంధ గుర్తింపు ఇవ్వాలి. ఈ జాబితాను సాంకేతిక విధ్యావిభాగానికి పంపాలి. వీటి ఆధారంగానే సాఫ్ట్‌వేర్‌ రూపొందిస్తారు. విద్యార్థులు కన్వీనర్‌ కోటాకు ఆప్షన్లు ఇవ్వడానికి వీలుంటుంది. ఇప్పటికే కాలేజీల తనిఖీలు పూర్తి చేసిన జేఎన్‌టీయూహెచ్‌.. కొన్నింటిపై అభ్యంతరాలు లేవనెత్తింది. 

ల్యాబ్‌లు, ఫ్యాకల్టీ సరిగా లేదని పేర్కొంది. వీటిని సరిచేసుకునేందుకు గడువు కూడా ఇచ్చింది. మరోవైపు కొత్త సీట్ల పెంపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ఇవన్నీ అఫ్లియేషన్ల ప్రక్రియను ముందుకు కదలనివ్వడం లేదు. జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల భర్తీకి జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలు పెట్టింది. అయినా రాష్ట్ర కౌన్సెలింగ్‌ ముందుకు కదిలేట్టు లేదు. 

ప్రైవేట్‌ కాలేజీల హడావిడి 
రాష్ట్ర కౌన్సెలింగ్‌ ఆలస్యమవ్వడం, విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో సీట్లపై ఆరా తీయడంతో ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో గుబులు మొదలైంది. దాదాపు 35 వేల సీట్లు యాజమాన్య కోటా కింద భర్తీ అవుతాయి. కన్వీనర్‌ సీట్ల భర్తీ తర్వాతే మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు భర్తీ చేయాలి. దీంతో కాలేజీలు ముందే సీట్ల రిజర్వేషన్‌పై ఆరాట పడుతున్నాయి. పీఆర్వోలు, కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని సీట్లు అనధికారికంగా భర్తీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement