TS: విద్యుత్‌ వినియోగదారులకు చార్జీల షాక్‌! | Sakshi
Sakshi News home page

TS: విద్యుత్‌ వినియోగదారులకు చార్జీల షాక్‌!

Published Wed, Dec 1 2021 1:34 AM

Electricity Regulatory Board Chairman Sri Ranga Rao Speech Over Electricity Charges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో విద్యుత్‌ వినియోగదారులకు చార్జీల షాక్‌ తగలనుంది. విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్‌ శ్రీరంగారావు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ సబ్సిడీలు సర్దుబాటు చేశాక 2022–23కు సంబంధించిన రూ.10,928 కోట్ల భారీ ఆర్థిక లోటును పూడ్చడానికి భారీగా విద్యుత్‌ చార్జీల పెంపు తప్ప మరో మార్గం లేకుం డాపోయింది.

అయితే చార్జీల పెంపు ద్వారా ఎంత మేరకు ఆర్థిక లోటును పూడ్చుకోవాలన్న దానిపై త్వరలో ఈఆర్సీ నిర్ణయం తీసుకోనుంది. వినియోగదారులపై ప్రత్యక్షంగా రూ.2వేల కోట్లు, పరోక్షంగా మరో రూ.2వేల కోట్ల వరకు చార్జీల పెంపు భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. పేద, మధ్య తరగతి, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల వినియోగదారుల విద్యుత్‌ బిల్లులు భారీగా పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

పెంపుపై స్పష్టత ఇవ్వని డిస్కంలు 
ఏఆర్‌ఆర్‌ నివేదికతో పాటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెంచాల్సిన విద్యుత్‌ చార్జీల (రిటైల్‌ టారిఫ్‌ షెడ్యూల్‌) ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పిం చాల్సి ఉంది. మంగళవారం ఏఆర్‌ఆర్‌ నివేదికలు అందజేసిన పంపిణీ సంస్థలు.. చార్జీల పెంపు ప్రతిపాదనలను మాత్రం వాయిదా వేసుకున్నాయి.

దీంతో సాధ్యమైనంత త్వరగా టారిఫ్‌ ప్రతిపాదనలను సమర్పించాలని ఈఆర్సీ చైర్మన్‌ ఆదేశించారు. డిస్కంలు వీటిని సమర్పిస్తేనే విని యోగదారుల కేటగిరీల వారీగా విద్యుత్‌ చార్జీల పెంపుపై స్పష్టత రానుంది. డిస్కంల ప్రతిపాదనలు అందిన తర్వాత నిబంధనల మేరకు ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణ నిర్వహించి చార్జీల పెంపునకు అనుమతిస్తామని శ్రీరంగారావు పేర్కొన్నారు.

2021–22కి సంబంధించిన ఏఆర్‌ఆర్‌లను సైతం డిస్కంలు సమర్పించినా, ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న మరో 4 నెలల్లో ఎలాంటి విద్యుత్‌ చార్జీల పెంపు ఉండదని చైర్మన్‌ ప్రకటించారు. 2021–22లో రూ.10,624 కోట్ల ఆర్థిక లోటు ఉండనుందని డిస్కంలు అంచనా వేయగా, ట్రూఅప్‌ చార్జీల ద్వారా దీనిని భర్తీ చేసేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు.  

పొంచి ఉన్న ఆరేళ్ల భారం 
ప్రతి ఏటా నవంబర్‌ 30లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్‌ఆర్‌లు, విద్యుత్‌ చార్జీల సవరణ ప్రతిపాదనలను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాలని విద్యుత్‌ చట్టం పేర్కొంటోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో సరఫరా చేసేందుకు ఎన్ని మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరం కానుంది? ఇందుకు ఎంత వ్యయం కానుంది? ప్రస్తుత చార్జీలతోనే విద్యుత్‌ సరఫరా చేస్తే వచ్చే ఆదాయం ఎంత? ఏర్పడే ఆదాయం  లోటు ఎంత? ఈ లోటును పూడ్చుకోవడానికి ఏ మేరకు విద్యుత్‌ చార్జీలు పెంచాలి అనే సమగ్ర అంచనాలు ఏఆర్‌ఆర్‌ల్లో ఉంటాయి.

తెలంగాణ వచ్చాక తొలిసారిగా 2015–16లో, ఆ తర్వాత 2016–17లో రెండో/చివరిసారిగా విద్యుత్‌ చార్జీలు పెంచారు. చివరిసారిగా డిస్కంలు 2018–19కి సంబంధించిన ఏఆర్‌ఆర్‌లను ఈఆర్సీకి సమర్పించగా, అప్పట్లో చార్జీలు పెంచలేదు. దీంతో 2016–17లో పెంచిన విద్యుత్‌ చార్జీలే గత ఆరేళ్లుగా రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఆరేళ్ల ఆదాయ లోటును ట్రూఅప్‌ చార్జీల రూపంలో వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి వీలుగా డిస్కంలు త్వరలో ఈఆర్సీకి పిటిషన్‌ సమర్పించే అవకాశం ఉంది. దీనికి ఈఆర్సీ అనుమతిస్తే వినియోగదారులపై ఒకేసారి ఆరేళ్ల భారం పడే ప్రమాదముందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ సబ్సిడీలను పెంచితే ఆ మేరకు భారం వినియోగదారులపై తగ్గే అవకాశం ఉంది. ఏఆర్‌ఆర్, టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించకుంటే, ట్రూ అప్‌ చార్జీల రూపంలో ఆ తర్వాత వసూలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వబోమని గత ఈఆర్సీ అప్పట్లో తేల్చిచెప్పింది. ఈ ఆదేశాలకు కట్టుబడి ఉంటారా అని ప్రస్తుత చైర్మన్‌ శ్రీరంగారావును విలేకరులు ప్రశ్నించగా.. డిస్కంల నుంచి ప్రతిపాదనలు వస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చారు.  

ట్రూ అప్‌ చార్జీలంటే.. 
ఒక ఆర్థిక సంవత్సరంలో డిస్కంలకు సంబంధించిన మొత్తం వ్యయ అంచనాలను ఈఆర్సీ ముందస్తుగా ఆమోదించి, దానికి అనుగుణంగా విద్యుత్‌ టారిఫ్‌ను నిర్ణయిస్తుంది. ఏడాది ముగిశాక ఈఆర్సీ ఆమోదించిన అంచనాలకు మించి ఖర్చు అయితే.. ఆ వ్యత్యాసాన్ని వసూలు చేసుకోవడానికి (ట్రూ అప్‌ చార్జీల పేరిట) డిస్కంలకు ఈఆర్సీ అనుమతిస్తుంది.  

Advertisement
Advertisement