పాతబస్తీలో దంపతుల హత్య | Elderly Couple Murdered in Old City Hyderabad | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో దంపతుల హత్య

Apr 21 2026 1:13 AM | Updated on Apr 21 2026 1:13 AM

Elderly Couple Murdered in Old City Hyderabad

అఖిల్‌ఖాన్‌

మృతురాలు 4 నెలల గర్భిణి.. నిందితుడు మృతుడికి స్వయానా అన్న

డబ్బు విషయంతో వాగ్వాదం..రూ.7వేల కోసమే దారుణం ! 

చార్మినార్‌: పాతబస్తీలో దంపతుల హత్య ఉదంతం కలకలం రేపింది. నిందితుడు మృతుడికి స్వయాన అన్న. సుల్తాన్‌పురాలోని ఓ అద్దె ఇంట్లో అఖిల్‌ఖాన్‌(38), అజ్మేరీ బేగం(35) దంపతులు నివాసముంంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అజ్మేరీబేగం ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. గతంలో నూర్ఖాన్‌ బజార్‌లో నివసించే వీరు ఇల్లు ఖాళీ చేసి కొంతకాలం క్రితమే సుల్తాన్‌పురా వచ్చారు. ఈ నేపథ్యంలో అఖిల్‌ఖాన్‌ తన అన్న ఆదిల్‌ఖాన్‌ వద్ద రూ.7వేలు చేబదులుగా తీసుకున్నట్టు సమాచారం. నెలలు గడుస్తున్నా, ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఆదిల్‌ఖాన్‌ సోమవారం సాయంత్రం 4 గంటలకు తమ్ముడి ఇంటికి వచ్చాడు.

రూ. 7వేల విషయంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. దాదాపు రెండు గంటల పాటు ఘర్షణ జరిగింది. అయితే రెండురోజుల్లో డబ్బు తిరిగి ఇస్తానని చెప్పినా, ఆదిల్‌ఖాన్‌ వినకుండా అఖిల్‌ఖాన్‌ గొంతు, పొట్టలో పొడిచాడు. ఈ గొడవలో తలదూర్చిన మరదలు అజ్మేరీబేగంపై కూడా అప్పటికే కోపంతో ఉన్న ఆదిల్‌ఖాన్‌ ఆమెను సైతం కత్తితో పొడిచి హత్య చేశాడు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఇద్దరినీ చంపేశాను పోలీసులకు చెప్పుకోండి అంటూ.. బిగ్గరగా అరుస్తూ వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.

అయితే నిందితుడు ఆదిల్‌ఖాన్‌కు పిల్లలు లేకపోవడంతో ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నట్టు సమాచారం. అఖిల్‌ఖాన్‌ తీసుకున్న డబ్బు ఇవ్వకపోగా, నీకు పిల్లలే లేరు కదా... డబ్బు తీసుకొని ఏం చేసుకుంటావు అని అనడంతో ఆదిల్‌ఖాన్‌ మనస్తాపానికి గురై తమ్ముడు, మరదల్ని హత్య చేసి ఉండొచ్చని స్థానికులు అనుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి శంషాబాద్‌ డీసీపీ రాజేశ్, మీర్‌చౌక్‌ ఏసీపీ శ్యాంసుందర్, ఇన్‌స్పెక్టర్‌ ఎం.కొండలరావు వచ్చారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చార్మీనార్‌ ఎమ్మెల్యే మీర్‌ జుల్పికర్‌ అలీ మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు.  

Advertisement
 
Advertisement
Advertisement