కొండెక్కిన కోడిగుడ్డు.. ఘాటెక్కిన ఉల్లి

Eggs And Onions Prime Price High - Sakshi

భారీగా పెరిగిన ఈ రెండింటి ధరలు

లాక్‌డౌన్‌ కాలంతో పోలిస్తే రెట్టింపు

వర్షాలతో తగ్గిన ఉల్లి దిగుబడి

డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేక పెరిగిన గుడ్డు ధర  

నల్లగొండ : కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఉల్లి ఘాటెక్కిస్తుండగా.. గుడ్డు కొండెక్కి కూర్చుంది. ఈ రెండింటి ధరలు లాక్‌డౌన్‌ కాలంతో పోలిస్తే.. ప్రస్తుతం రెట్టింపయ్యాయి. కరోనాను ఎదుర్కోవాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుడ్డు, ఉల్లి తప్పని సరిగా తినాల్సిన పరిస్థితి. దీంతో వీటికి డిమాండ్‌ బాగా పెరిగింది. దానికి అనుగుణంగా సరఫరా లేకపోవడంతో రెట్టింపు అయిన ధరలతో పేదలు కొనలేకపోతున్నారు. (‘భగీరథ’ ప్రయత్నం.. ఫ్లోరైడ్‌ మాయం)

లాక్‌డౌన్‌ కాలంలో అందుబాటులో ధరలు
లాక్‌డౌన్‌ సందర్భంలో ఉల్లి, గుడ్డు ధరలు భారీగా పడిపోయాయి. ఆ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడడంతో.. అప్పట్లో ఉల్లి కేజీ ధర రూ.పది నుంచి రూ.12 ఉంది. ఆ సమయంలో గుడ్డు పేపర్‌ ధర రూ.2.50 మాత్రమే ఉండగా.. బయట రూ.3.50 పలికింది. పౌల్ట్రీ రైతులు నష్టాలు భరించి తక్కువ ధరకు అమ్మారు. కొత్తగా కోడిపిల్లల పెంపకాన్ని నిలిపివేశారు. ఇప్పుడు ఉన్న కోళ్లతోనే గుడ్లు తీస్తుండడంతో ఉత్పత్తి తగ్గింది.

వర్షాలతో దెబ్బతిన్న ఉల్లిపంట..
మన ప్రాంతానికి ఎక్కువగా మహారాష్ట్ర నుంచే ఉల్లి దిగుమతి అవుతుంది. పైన పడిన వర్షాలతో ఉల్లి పంట చాలా వరకు దెబ్బతిన్నది. దీంతో దిగుబడి తగ్గింది. మార్కెట్‌లో ప్రస్తుతం తెల్ల ఉల్లి రూ.45 పలుకుతుండగా ఎర్ర ఉల్లి రూ.40 పలుకుతోంది.

గుడ్డుకు పెరిగిన డిమాండ్‌...
కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండాలన్నా.. కరోనా సోకిన వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలన్నా.. రోజూ గుడ్లు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో చాలామంది రోజూ తప్పనిసరిగా గుడ్డు తింటున్నారు. ఈ నేపథ్యంలో వీటికి డిమాండ్‌ భారీగా పెరిగింది. అందుకు తగిన ఉత్పత్తి లేకపోవడంతో కొరత  ఏర్పడింది. దీంతో ఒక్కో గుడ్డు ధర రూ.6 వరకు పెరిగింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top