భర్తల భరతం పట్టిన భార్యామణులు! | Sakshi
Sakshi News home page

భర్తల భరతం పట్టిన భార్యామణులు!

Published Fri, Mar 10 2023 1:56 AM

Dund ceremony in Banjara tradition - Sakshi

కారేపల్లి: భార్యామణులు భర్తల భరతంపట్టారు. ఇంకొందరు పచ్చ బరిగెలతో వరసైన వారి వీపులను విమానం మోత మోగించారు. చేసేదేం లేక పురుషపుంగవులు పరుగు లంకించుకున్నారు. హోలీ సందర్భంగా గిరిజన తండాల్లో ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ. గత ఏడాది హోలీ నుంచి ఈ ఏడాది హోలీ మధ్యకాలంలో భూక్యా, లాకావత్, తేజావత్, వడిత్యా వంశస్తుల కుటుంబాల్లో ఎవరికైతే తొలి సంతానంగా మగబిడ్డ జన్మిస్తాడో ఆ ఇంట్లో డూండ్‌ వేడుక వైభవంగా నిర్వహిస్తారు.

కారేపల్లి మండలం సామ్యతండాలో భూక్యా నగేష్, సుజాత దంపతులకు తొలి సంతానం మగబిడ్డ దర్శక్‌ జన్మించడంతో ఈ వేడుక నిర్వహించారు. డూండ్‌ అంటే గిరిజన భాషలో వెతకడం అని అర్థం కాగా, బాలుడిని ఒక ఇంట్లో దాచిపెట్టి గ్రామస్తులంతా వెతకడమే ఈ వేడుక! ఇదంతా హోలీ రోజు ముగియగా.. గురువారం గ్రామంలో ఓ గుంజ పాతి, తినుబండారాలు ఉన్న రెండు గంగాళాలను తాళ్లతో కట్టారు. గంగాళాలకు మహిళలు పచ్చి బరిగెలతో కాపలాగా ఉండగా, పురుషులు వాటిని ఎత్తుకెళ్లేందుకు యత్నించారు.

మహిళలు, పురుషులు సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పాత్రలు ఎత్తుకెళ్లేందుకు వచ్చే పురుషులను మహిళలు సరదాగా కొడుతుండటం చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఈ వేడుకలో బావ, బావమరిది వంటి వరసైనవారు మహిళల దెబ్బల రుచి చూడాల్సిందే. చివరకు పురుషులు గంగాళాలను ఎత్తుకెళ్లి ఆరగించడంతో వేడుక ముగిసింది. 
 

Advertisement
Advertisement