
జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
పిల్లలు, వృద్ధులకు ఆందోళన కలిగించొద్దు
పర్యావరణ సమతుల్యత పాటించాలంటున్న నిపుణులు
టపాసులు కాల్చేవేళ నిర్లక్ష్యం వహించొద్దు
గ్రీన్ దీపావళి వైపు పలువురి అడుగులు
కళ్ల విషయంలో జాగ్రత్త : వైద్యుల సూచన
వెలుగులు విరజిమ్మే దీపావళి కాంతులు ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకట్లను పారదోలి సంతోషాలను పంచుతుంది. అయితే అలాంటి దీపావళికి ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో వ్యవహరించాలి. మన ఆనందం మరొకరికి బాధ కలిగించొద్దని, వ్యక్తిగత బాధ్యత, శ్రద్ధ, జాగ్రత్తలతో పాటు, పర్యావరణ స్పృహ, సామాజిక బాధ్యతను గుర్తించాలని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా టపాసులు కాల్చే క్రమంలో చుట్టుపక్కల వారికి హాని కలుగకుండా జాగురూకతతో మెలగాలి.
భారీ శబ్దాలతో చిన్నపిల్లలు, వృద్ధులు, హార్ట్ పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుంది. పశువులు, పెంపుడు జంతువులు, పక్షులకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తెరగాలి. వీటితో పాటు టపాసుల నుంచి వచ్చే పొగ, స్పార్క్స్ వల్ల కళ్లకు, ఊపిరితిత్తులకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంది. అగ్ని ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉందని గ్రహించి తదనుగుణంగా వ్యవహరించి సహజమైన, సంప్రదాయ వెలుగులతో పండుగను ఆస్వాదించాలని పర్యావరణ వేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
మన జీవితాల్లో వెలుగులు పంచే దీపావళి మరొకరి జీవితాల్లో చీకట్లు నింపకుండా జాగురూకతతో వ్యవహరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నేడు దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటనున్నాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా పండుగల్లోనూ అధునాత పోకడలు సంతరించుకుంటున్నాయి.

ఈ దీపావళికి ముఖ్యంగా యువత పర్యావరణ సంరక్షణ, జంతు సంక్షేమం వంటి అంశాలను గౌరవిస్తూ.. నవ సమాజ నిర్మాణానికి నాంది పలుకుతున్నారు. సంబంధిత అధికారులు సైతం పండుగ నియమావళి, సూచనలపై ముందస్తుగానే ప్రచారం చేశారు. పండుగ ఉత్సాహం, సంతోషం బాధ్యతతో కూడిన సమతుల్యాన్ని పాటించాలని నగర పోలీసు శాఖ, పర్యావరణ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
జంతు సంరక్షణ, పర్యావరణ బాధ్యత..
భారీ శబ్దాల వల్ల జంతువులు భయపడి జనాలపై దాడికి దిగే ప్రమాదం ఉంది. ఒక్కోసారి మనం కాలి్చన టపాసుల కారణంగా అవి గాయపడే ప్రమాదం ఉంది. వీటిని గుర్తించాలి. ముందుగా ఇళ్లలోని పెంపుడు జంతువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి. దీంతో పాటు వీధుల్లోని జంతువులకు హాని కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తించాలి.
మన చుట్టూ ఉండే ప్రదేశాల పట్ల కూడా బాధ్యతతో మెలగాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మనతో పాటు ఇతర పౌరులూ ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. కొద్దిసేపు ఆనందాన్ని ఇచ్చే స్మోక్ క్రాకర్స్ దీర్ఘకాలం పాటు మనకు హాని కలిగిస్తాయని గ్రహించాలి. ప్రభుత్వం సూచించిన గ్రీన్, ఎకో ఫ్రెండ్లీ క్రాకర్లను మాత్రమే వినియోగించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలి.
ప్రజల్లో కొత్త చైతన్యం..
నగరంలోని పలు హౌసింగ్ సొసైటీలు, యువజన సంఘాలు ‘గ్రీన్ దీపావళి’ కార్యక్రమాలను చేపట్టాయి. క్రాకర్ ఫ్రీ జోన్‌లను ఏర్పరచి, పర్యావరణ స్నేహపూర్వక పండుగకు ఆయా కమ్యూనిటీలు ప్రోత్సహిస్తున్నాయి. కేవలం విద్యుత్ కాంతులు, లేదా సంప్రదాయంగా వస్తున్న నూనె దీపాలు, కొవ్వుతులను వినియోగించి పండుగను జరుపుకోవాలని, పిల్లల్లోనూ ఆ దిశగా చైతన్యం తీసుకురావాలని, ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగను చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి.
నిబంధనలు ఇవే..
సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు టపాసుల అమ్మకాలు, వినియోగానికి ప్రత్యేక నియమాలు అమలు చేస్తున్నాయి. అనుమతులు లేని చోట టపాసులు నిల్వ చేయడం, అమ్మకం చట్టరీత్యా నేరం. భారీ శబ్దాలు చేసే, అధికంగా పొగను విడుదల చేసే టపాసులకు పరిమితులు పెట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రాత్రి 10 గంటల తర్వాత టపాసులు పేల్చకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అపార్ట్‌మెంట్‌లలో, బహిరంగ ప్రదేశాల్లో టపాసులు పేల్చేటప్పుడు ఇతరుల ప్రైవసీ, వృద్ధులు, చిన్నపిల్లలు, రోగులను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అగ్నిమాపక సూచనలు..
నగరంలోని అగ్నిమాపక శాఖ, వైద్యులు పౌరులకు పలు సూచనలు జారీ చేశారు. టపాసులు వాడేటప్పుడు పిల్లల పక్కన పెద్దవారు తప్పనిసరిగా ఉండాలి. వదులుగా ఉండే దుస్తులు, పొడవైన దుపట్టాలు ధరించడం ప్రమాదకరం. ఇళ్లల్లో దీపాల వద్ద కర్టెన్లు, పేపర్ అలంకరణల విషయంలో జాగ్రత్త పాటించాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్, నీటి బకెట్, ఫైర్ కంట్రోలర్స్ వంటి భద్రతా సామగ్రి ఇళ్లల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో సిద్ధంగా ఉంచుకోవాలి. ఏదైనా ప్రమాదవ శాత్తూ గాయాలైతే తక్షణ వైద్య సహాయం పొందలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
పొగతో కళ్లకు ప్రమాదం..
క్రాకర్స్ కాల్చే సమయంలో వచ్చే ప్రమాదకరమైన పొగ వల్ల కళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఆ పొగ నేరుగా కంటికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కంటికి వీలైనంత దూరంగా కాల్చాలి. కొన్ని రకాల క్రాకర్స్ నుంచి వెలువడే నిప్పు రవ్వలు కంట్లో పడే ప్రమాదం ఉంటుంది. వీటితో పాటు క్రాకర్స్ నుంచి వెలువడే కాంతి కూడా కంటిలోని నల్లగుడ్డుని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకే అదే పనిగా ఆ వెలుగును చూడకుండా ఉంటే మంచిది.
ఏవైనా జరిగి కళ్లు మండుతున్నట్లు అనిపిస్తే వెంటనే వాటిని నలపకుండా స్వచ్ఛమైన చల్లటి నీటితో కడుక్కోవాలి. కొద్ది సేపటి తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటే వైద్యులను సంప్రదించాలి. కళ్లలో దురద వస్తే వైద్యుల సూచన మేరకు చుక్కల మందు స్వేస్తే సరిపోతుంది. కొందరు ఏడాది పిల్లలతో కూడా క్రాకర్స్ కాల్పిస్తుంటారు.. ఇది ప్రమాదకరమైన చర్యగా గుర్తించాలి. వీలైతే సన్‌గ్లాస్, సాధారణ కళ్ల జోడు పెట్టుకుంటే మంచిది. – పి.సత్యవాణి, ప్రొఫెసర్, సరోజినీదేవి నేత్రాలయం, మెహిదీపట్నం