
హైదరాబాద్ చర్లపల్లిలోని డ్రగ్స్ ఫ్యాక్టరీ
కెమికల్ ఫ్యాక్టరీ మాటున భారీగా నిషేధిత మెఫిడ్రోన్ డ్రగ్ తయారీ
హైదరాబాద్ చర్లపల్లిలోని ఫ్యాక్టరీపై మహారాష్ట్ర క్రైం బ్రాంచ్ పోలీసుల దాడి
5.968 కిలోల మెఫిడ్రోన్
35,500 లీటర్ల రసాయనాలు
950 కిలోల మిథైలిన్ డైక్లోరైడ్ పొడి, ఇతర పదార్థాలు స్వాదీనం
ఫ్యాక్టరీ నిర్వాహకుడు సహా మరొకరి అరెస్ట్.. వేర్వేరు చోట్ల 11 మందిని పట్టుకున్న మహారాష్ట్ర పోలీసులు
దేశవ్యాప్తంగా ఈ డ్రగ్స్ సరఫరా...
బంగ్లాదేశీ మహిళ అరెస్ట్‌తో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం శివారులో కొంతకాలంగా భారీ స్థాయిలో సాగుతున్న డ్రగ్స్ తయారీ రాకెట్ గుట్టురట్టయింది. రసాయన కర్మాగారం మాటున డ్రగ్ మాఫియా నడుపుతున్న డ్రగ్స్ ఫ్యాక్టరీపై మహారాష్ట్ర క్రైం బ్రాంచి పోలీసుశాఖ మెరుపుదాడి చేసింది. ఏకంగా రూ. 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ తయారీ ముడిపదార్థాలను స్వాధీనం చేసుకుంది.
చర్లపల్లి పారిశ్రామికవాడలోని నవోదయ కాలనీలో ఉన్న వాగ్దేవి ల్యాబ్స్ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం సోదాలు చేపట్టి 5.968 కిలోల నిషేధిత మెఫిడ్రోన్ (ఎండీ) మాదకద్రవ్యంతోపాటు 35,500 లీటర్ల ఇతర రసాయనాలు, 19 పెట్టెల్లోని 950 కిలోల మిౖథెలిన్ డైక్లోరైడ్ (ఎండీసీ) పొడి, ఎండీ తయారీకి వాడే ఇతర రసాయనాలను పట్టుకుంది. అలాగే వాగ్దేవి ల్యాబ్స్ నిర్వాహకుడు శ్రీనివాస్ విజయ్ వోలేటి, అతనితో కలిసి పనిచేస్తున్న తానాజీ పండరినాథ్ పటా్వరీలను అరెస్టు చేసింది.
ఈ మేరకు మహారాష్ట్రకు చెందిన మిరా–భయందర్, వసాయ్–విరార్ (ఎంబీవీవీ) పోలీసు కమిషనరేట్ సీపీ నికేత్ కౌషిక్ శనివారం స్థానిక మీడియాకు వెల్లడించారు. నెల రోజులుగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్‌లో చర్లపల్లిలో పట్టుబడిన ఇద్దరితో సహా మొత్తం 13 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
నిందితుల్లో ఒక బంగ్లాదేశీ యువతి సైతం ఉన్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 27 మొబైల్ ఫోన్లు, మూడు కార్లు, ఒక టూవీలర్ స్వా«దీనం చేసుకున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ నెట్‌వర్క్‌కు, అంతర్జాతీ యంగా డ్రగ్ నెట్‌వర్క్‌లకు సైతం హైదరాబాద్ శివారులో తయారయ్యే ఎండీ డ్రగ్ సరఫరా అవుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.
ముంబైలో లింకులతో..హైదరాబాద్‌లో వెలుగులోకి..
ఈ కేసును థానే జిల్లాలోని ఎంబీవీవీ పోలీసులు చిన్న లింక్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం మిరా రోడ్ ఈస్ట్‌లోని నివసించే బంగ్లాదేశీ యువతి ఫాతిమా మురాద్õÙక్ అలియాస్ మొల్లా (23) మెఫిడ్రోన్ (ఎండీ) డ్రగ్‌ను విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఆగస్టు 8న కాశీమిరా బస్టాప్ దగ్గర ఫాతిమాను అదుపులోకి తీసుకొని ఆమె నుంచి 105 గ్రాముల ఎండీ డ్రగ్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు.
ఈ డ్రగ్‌ను తాను హైదరాబాద్ నుంచి కొన్నట్లు నిందితురాలు పేర్కొనడంతో ఆమె ఇచ్చిన సమాచారం ప్రకారం డ్రగ్ నెట్‌వర్క్‌లోని మరో 10 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకున్న అక్కడి పోలీసులు.. హైదరాబాద్ శివారులోని చర్లపల్లి ప్రాంతంలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారవుతున్నట్లు నిర్ధారణకు వచ్చి ఆపరేషన్ చేపట్టారు.
కెమికల్ ఫ్యాక్టరీ ముసుగులో డ్రగ్స్ తయారీ దందా..
భారీగా డ్రగ్స్ తయారీ దందాకు తెరతీసిన శ్రీనివాస్ విజయ్ వోలేటికి రెండు కంపెనీలు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. వాటిల్లో వాగ్దేవి ల్యాబ్‌ను నవోదయ కాలనీలో 2020లో ప్రారంభించారు. కోవిడ్ సంబంధిత మందులు ఇందులో తయారవుతున్నాయి. అలాగే 2015లో నాచారంలో వాగ్దేవి ఇన్నోసైన్స్ పేరిట ఆర్ అండ్ డీ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే కెమికల్ ఫ్యాక్టరీ పేరిట బయటికి చూపుతూ లోపల డగ్స్ తయారీ దందాకు నిర్వాహకులు తెరతీసినట్లు తెలిసింది.
కట్టెల లోడ్ వాహనాల్లో..
కట్టెల లోడ్ వాహనాల్లో ముడి సరుకుతోపాటు తయారు చేసిన డ్రగ్స్‌ను శ్రీనివాస్ విజయ్ వోలేటి తరలించే వాడని సమాచారం. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం గోడౌన్ కోసమని చర్లపల్లి, నవోదయనగర్ ప్లాట్ యజమానిని సంప్రదించి అద్దెకు తీసుకొని వాగ్దేవి ల్యాబ్‌ను ప్రారంభించారు. కంపెనీలో ఎప్పుడూ ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు మినహా మరెవరు కనిపించే వారు కాదని.. ఉదయమంతా గేటు మూసేసి ఉండేదని చుట్టుపక్కల కంపెనీల వారు పేర్కొన్నారు.
రాత్రిళ్లు డ్రమ్ముల్లో రసాయనాలు, కట్టెల లోడ్‌ల వాహనాలు వచ్చేవని చెప్పారు. అప్పుడప్పుడూ ఘాటైన వాసనలు వచ్చినా రసాయన సంస్థలో ఇది మామూలే కదా అనుకునేవారమని చెప్పుకొచ్చారు. కాగా, స్థల యజమానికి ఏడాదిగా అద్దె కూడా చెల్లించట్లేదని తెలిసింది.