
దాదాపు రూ.3 కోట్ల లావాదేవీలు నెరపిన నౌహీరా షేక్
ఎట్టకేలకు విషయం గుర్తించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
సహకరించిన సబ్‌రిజిస్ట్రార్లపై చర్యలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో వివిధ స్కీమ్‌ల ముసుగులో రూ.6,000 కోట్ల స్కామ్‌కు పాల్పడిన నౌహీరా షేక్ మరో కుంభకోణానికి తెరలేపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసిన ఆస్తుల్ని వివిధ మార్గాల్లో నకిలీ పత్రాల సాయంతో విక్రయించారు. హైదరాబాద్‌లోని కొన్ని ఆస్తుల్ని అమ్మేయగా... ముంబైలో విక్రయానికి సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ విషయం గుర్తించిన ఈడీ అధికారులు ఆ ప్రయత్నాలు అడ్డుకోవడంతోపాటు ఈ దందాలో నౌహీరాషేక్‌కు సహకరించిన సబ్‌రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
స్కీముల పేరుతో రూ.వేల కోట్ల మోసాలు
హైదరాబాద్ కేంద్రంగా గోల్డ్ సహా వివిధ రకాలైన స్కీమ్‌ల పేరు చెప్పిన నౌహీరా షేక్ దేశవ్యాప్తంగా అనేకమంది నుంచి డిపాజిట్లు సేకరించింది. గరిష్టంగా 36 శాతం వడ్డీ చెల్లిస్తానంటూ నమ్మించి దాదాపు రూ.5 వేల కోట్ల మేర డిపాజిట్లు సేకరించి మోసం చేసింది. సీసీఎస్ పోలీసుల కేసు ఆధారంగా ముందుకెళ్లిన ఈడీ అధికారులు భారీగా ఆస్తులు సీజ్ చేశారు.
అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తుల విక్రయం
అటాచ్ చేసిన ఆస్తులను కోర్టు అనుమతితో వేలం వేయడం ద్వారా ఈడీ నగదుగా మారుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తుల్ని విక్రయించడం ద్వారా ఈడీ అధికారులు రూ.93 కోట్లు సమీకరించారు. అయితే ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఫ్లాట్లను విక్రయించడానికి నౌహీరా షేక్ పథకం వేసింది. హైదరాబాద్‌లో ఉన్న కొన్నింటిని అమ్మేసి సొమ్ము చేసుకుంది. వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలు కూడా పూర్తయ్యాయి. ఈడీ అటాచ్ చేసిన వాటిలో ముంబైలో ఉన్న రూ.12 కోట్ల విలువ చేసే మూడు ఫ్లాట్లు కూడా ఉన్నాయి. వీటిపై కొందరితో సేల్ అగ్రిమెంట్లు చేసుకున్న నౌహీరా షేక్ రూ.3 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకుంది. ఓ ఫ్లాట్ ఖరీదు చేసిన యజమానిని విచారించిన ఈడీ వాంగ్మూలం సైతం నమోదు చేసింది.
సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లిన వ్యవహారం
నౌహీరా షేక్ వేసిన కొన్ని పిటిషన్లు సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయి. ఈ నెల 10 తేదీన వీటి విచారణ జరిగింది. ఈ సందర్భంలో ఈడీ అధికారులు అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తుల విక్రయం విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసు కువెళ్లారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన న్యా యస్థానం ఆయా ఆస్తుల్ని ఈడీకి రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా నౌహీరా షేక్‌ను ఆదేశించింది. అలా చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. మరోపక్క ఈడీ అధికారులు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఆస్తులనూ నౌహీరా షేక్ విక్రయించినట్టు గుర్తించారు. వీటి రిజిస్ట్రేషన్‌కు సహకరించిన సబ్‌రిజిస్ట్రార్ల వ్యవహారం ఆరా తీస్తోంది.