
సాక్షి, హైదరాబాద్/ఆదిలాబాద్‌టౌన్/తానూరు /వాంకిడి/భిక్కనూరు/మద్నూర్/పాల్వం చరూరల్/ అశ్వారావుపేట/పెనుబల్లి: రాష్ట్రంలోని పలు ఆర్టీఏ చెక్‌పోస్టుల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ల్లో మెరుపు దాడులు చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం భోరజ్ సమీకృత చెక్‌పోస్టు, నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్‌తరోడా చెక్‌పోస్టు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని చెక్‌పోస్టుల్లో ఏసీబీ బృందాలు అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు తనిఖీలు చేపట్టాయి. భరోజ్ చెక్‌పోస్టులో లెక్కకు మించి ఉన్న రూ.1.26 లక్షలు, బెల్‌తరోడాలో రూ.3 వేలు, వాంకిడి చెక్‌పోస్టులో రూ.5,100 నగదు సీజ్ చేశారు.
డబ్బాల్లో లంచాలు
ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన డబ్బాల్లో డబ్బు వేసి వెళ్తున్నట్లు గుర్తించారు. భిక్కనూరు మండలంలోని జంగంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఉన్న ఆర్టీఏ చెక్‌పోస్టులో సోదాలు నిర్వహించి రికార్డుల్లో చూపని రూ.5 వేల నగదు, అక్కడే ఉన్న ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.46,300 నగదును గుర్తించారు. మొత్తం రూ.51,300ను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ దాడుల సమయంలో చెక్‌పోస్టులో ఏంవీఐ మహ్మద్ అప్రోజొద్దీన్ విధుల్లో ఉన్నారు.
మద్నూర్ మండలం సలాబత్‌పూర్ వద్ద జరిపిన దాడుల్లో రూ.36 వేల అక్రమ నగదు లభించినట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపారు. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం చెక్‌పోస్టుతో పాటు అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లో కూడా తనిఖీలు చేపట్టారు. పాల్వంచ చెక్ పోస్టులో రూ.26 వేలు, ముత్తగూడెం చెక్‌పోస్టులో రూ.6,660 అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు భారీగా ఫిర్యాదులు రావటంతో ఏసీబీ చీఫ్ చారుసిన్హా ఆకస్మిక తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల్లో ఆకస్మిక సోదాలు చేశారు. నల్లగొండ జిల్లా విష్ణుపురం చెక్‌పోస్ట్, కోదాడ, సలాబత్‌పూర్, పెందుర్తి, జహీరాబాద్ చెక్‌పోస్టుల్లో కూడా సోదాలు నిర్వహించారు. చెక్ పోస్టుల వద్ద వసూళ్లు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా లెక్కల్లో లేని రూ.4.18 లక్షల నగదు సీజ్ చేశారు. దీనిపై సంబంధిత ఆర్టీఏ అధికారులకు నోటీసులు ఇచ్చారు.