
వీణవంక(హుజూరాబాద్): కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కుంభం నాగరాజు రూ.20 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి చిక్కాడు. దీంతో గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇంటినంబర్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంది.
తర్వాత తమ పనికోసం పంచాయతీ కార్యదర్శి నాగరాజును సంప్రదించింది. అయితే నాగరాజు నెల రోజులుగా వారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా స్పందించకుండా, రూ.20 వేలు ఇస్తేనే ఇంటి నంబర్ మంజూరు చేస్తానని చెప్పాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలో పంచాయతీ కార్యాలయంలో వారు కార్యదర్శికి రూ.20 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
టపాసులు పేల్చి సంబరాలు
జీపీ కార్యదర్శి నాగరాజును ఏసీబీ అధికారులు పట్టుకున్నారనే విషయం తెలియడంతో గ్రామస్తులు పెద్దఎత్తున జీపీ వద్దకు చేరుకున్నారు. డీఎస్పీ విజయ్‌కుమార్.. నాగరాజు అరెస్టు వివరాలు వెల్లడిస్తుండగానే గ్రామస్తులు చప్పట్లతో అవినీతి అధికారి పీడ పోయిందని నినాదాలు చేశారు. ఆనంతరం టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. నాగరాజు అంతకు ముందు లంచాలకోసం పలువురిని వేధించాడని వారు తెలిపారు.