కంగారు అక్కర్లేదు.. కంట్రోల్‌ చేయొచ్చు

Director of Public Health Dr Srinivasa Rao Comments On Omicron Variant - Sakshi

‘ఒమిక్రాన్‌’ను ఎదుర్కొనేందుకు చర్యలు 

విదేశాల నుంచి వచ్చే వారికి టెస్టులు

రాష్ట్రంలో వ్యాపించకుండా వేగంగా వ్యాక్సినేషన్‌

ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్త వేరియంట్‌ వ్యాపించిన దేశాలను ప్రమాదకరమైన వాటిగా గుర్తించామని చెప్పారు.

ఆయా దేశాల నుంచి వచ్చే వారికి శంషాబాద్‌ విమానాశ్రయంలోనే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేసి పాజిటివ్‌గా తేలిన వారిని టిమ్స్‌ ఆసుపత్రికి తరలిస్తామని వివరించారు. అలాగే వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం సీసీఎంబీ వంటి లేబొరేటరీలకు పంపిస్తామన్నారు. సోమవారం యూరప్‌ నంచి 22 మంది, యూకే నుంచి 17, సింగపూర్‌ నుంచి ఇద్దరు ప్రయాణికులు హైదరాబాద్‌ చేరుకోగా వారెవరికీ కరోనా నిర్ధారణ కాలేదన్నారు. 

ఆందోళన  అక్కర్లేదు... 
విదేశాల్లో నమోదైన ఒమిక్రాన్‌ కేసుల్లో బాధితులకు స్వల్ప లక్షణాలే ఉంటున్నాయని, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, నీరసమే ప్రధాన లక్షణాలని డాక్టర్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ వైరస్‌ను ఆర్టీపీసీఆర్, యాంటిజెన్‌ టెస్టుల్లో కనుక్కోవచ్చన్నారు. ప్రస్తుత వైద్య చికిత్స పద్ధతులే దీనికీ వర్తిస్తాయన్నారు.

కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,300 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారన్నారు. 

వచ్చే నెలాఖరుకు అర్హులందరికీ రెండు డోసుల టీకా... 
రాష్ట్రవ్యాప్తంగా 7–10 రోజుల్లో కరోనా మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను నూరు శాతం పూర్తి చేస్తామని, వచ్చే నెలాఖరుకు అర్హులైన వారందరికీ రెండు డోస్‌ల వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని డాక్టర్‌ శ్రీనివాసరావు వివరించారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, వరంగల్, గద్వాల, నారాయణపేట జిల్లాలు రెండో డోస్‌ వ్యాక్సినేన్‌లో వెనుకబడి ఉన్నాయన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 25 లక్షల మందికి రెండో డోస్‌ టీకాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రెండో డోస్‌ వేసుకోకున్నా అటువంటి వారిలో కొందరికి వేసుకున్నట్లు సర్టిఫికెట్లు మొబైల్‌ఫోన్లకు వచ్చిన విషయంలో ముగ్గురు మెడికల్‌ ఆఫీసర్లను, కొందరు వైద్య సిబ్బందిని సస్పెండ్‌ చేశామన్నారు.  

ప్రైవేటు ఆసుపత్రులపై ఫిర్యాదులకు 9154170960
ప్రైవేటు ఆసుపత్రులపై ఫిర్యాదులకు 9154170960 నంబర్‌కు వాట్సాప్‌ చేయాలని శ్రీనివాసరావు సూచించారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు రూ. 500 మాత్రమే ప్రైవేట్‌ లేబరేటరీలు వసూలు చేయాలన్నారు. విమానాశ్రయంలో  అదే ధర వసూలు చేయాలన్నారు. అయితే 20 నిమిషాల్లోనే ఫలితం ఇచ్చేందుకు అంతకంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నాయన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top