మాది పీపుల్స్‌ బడ్జెట్‌ | Deputy CM Bhatti Vikramarka addresses the media in Khammam | Sakshi
Sakshi News home page

మాది పీపుల్స్‌ బడ్జెట్‌

Mar 23 2026 1:13 AM | Updated on Mar 23 2026 1:13 AM

Deputy CM Bhatti Vikramarka addresses the media in Khammam

ప్రతి గడపకూ ‘ప్రభుత్వ’భరోసా 

కులమతాల తేడా లేకుండా అందరికీ ఇందిరమ్మ జీవిత బీమా... ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికీ వెయ్యి ఇళ్లు  

ఖమ్మంలో మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

ఖమ్మం మయూరి సెంటర్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో పొందుపరిచినవి కేవలం అంకెలు కావని.. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఒక నమ్మకమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. తమది పీపుల్స్‌ బడ్జెట్‌ అని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణలో పుట్టడం మా అదృష్టం’అని ప్రతి పౌరుడూ గర్వపడేలా తమ ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు. 

కులమతాలు, ప్రాంతాల భేదం లేకుండా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా పథకం వర్తింపజేస్తామని తెలిపారు. అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో ఈ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశామని.. జీవిత బీమా పథకం కింద రూ. 5 లక్షలు చెల్లిస్తామని వివరించారు. 

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు క్యాలెండర్‌ను ఏర్పాటు చేశామని.. నిర్మాణ దశను బట్టి వారానికోసారి బిల్లు చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈ ఏడాది అదనంగా నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మరో లక్ష ఇళ్లను మంజూరు చేయాలని యోచిస్తున్నామని భట్టి చెప్పారు. 

విద్యార్థులే రేపటి సంపద.. 
పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అని నమ్మే తమ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు వారంలో ఆరు రోజులపాటు పౌష్టికాహారం అందిస్తోందని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారంతోపాటు వారంలో రెండు రోజులు పాలు, రెండు రోజులు రాగి జావ అందిస్తామన్నారు. ఇంటర్‌ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.  

రైతు సంక్షేమానికి పెద్దపీట.. 
రాష్ట్రంలో 68,89,955 మంది పట్టాదారులకు రైతుభరోసా కింద రూ. 3,446.94 కోట్లు విడుదల చేశామని తెలిపారు. రాబోయే 45 రోజుల్లో మూడు విడతల్లో ఈ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమవుతాయని స్పష్టం చేశారు. సన్నధాన్యం సాగు చేసిన రైతులకు రెండు సీజన్లలో కలిపి బోనస్‌ అందించామన్నారు. 

ఈ సందర్భంగా తాజా బడ్జెట్‌లో వివిధ రంగాలకు చేసిన కేటాయింపుల గురించి భట్టి వివరించారు. సమావేశంలో ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement