షీ టీమ్స్ 116 డికాయ్ ఆపరేషన్లు.. పోకిరీల ఆటకట్టు
బాలికలు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే అంతే
36 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న షీ టీమ్స్
హైదరాబాద్: మహిళలు, అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే పురుషుల తాట తీస్తున్నాయి షీటీమ్స్. సైబరాబాద్ షీ టీమ్స్ 116 డికాయ్ ఆపరేషన్స్ నిర్వహించి పోకిరీల ఆటలు కట్టించాయి. ఈ నెల 11 నుంచి 17 వరకు నిర్వహించిన ఆపరేషన్ వివరాలను డీసీపీ కె.సృజన తెలిపారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. బాలికలు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 36 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పలు చిన్న కేసులు కూడా నమోదయ్యాయి. కొందరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. షీ టీమ్స్‌కు మహిళా బాధితుల నుంచి 18 ఫిర్యాదులు అందాయి.
సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ) ఒక పీటా కేసులో ఒక బాధితురాలిని రక్షించింది. కో నిందితుడిని అదుపులోకి తీసుకుంది. కుటుంబ కౌన్సెలింగ్ సెంటర్లు / సీడీఈడబ్ల్యూ సెంటర్లలో భార్యాభర్తల వివాదాల్లో 41 కుటుంబాలను మళ్లీ కలిపే ప్రయత్నాలు చేశారు.
అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఏహెచ్‌టీయూ, షీ టీమ్స్ సైబరాబాద్ పరిధిలో పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. సుమారు 1,846 మంది ఇందులో పాల్గొన్నారు. వారికి మానవ అక్రమ రవాణా, పిల్లల అక్రమ రవాణా, ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, బాల్య వివాహాలు, బాల హక్కులు, బాల కార్మికులు, భిక్షాటనం, సైబర్ బుల్లీయింగ్, సైబర్ మోసాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మహిళల హెల్ప్ లైన్ 181, బాలల హెల్ప్ లైన్ 1098, డయల్ 100 ప్రాధాన్యం, క్రైమ్స్ 1930 వంటి అంశాలపై కూడా వివరించారు.
మహిళల భద్రత చర్యలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం “గివ్ టు గెయిన్” కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ షీ టీమ్స్, ఎస్‌సీఎస్‌సీ మహిళల భద్రత ఫోరం సహకారంతో హైదరాబాద్ మాదాపూర్‌లోని సేల్స్‌ఫోర్స్, జేఎల్‌ఎల్ ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ కార్యాలయాల్లో మహిళల భద్రత అవగాహన సెషన్స్ నిర్వహించారు. ప్రతి సెషన్‌లో సుమారు 70-80 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాలను పోలీస్ ఇన్‌స్పెక్టర్ హనుమాన్, సబ్ ఇన్స్పెక్టర్ అంబికా, షీ టీమ్స్ సిబ్బంది, ఎస్‌సీఎస్‌సీ సభ్యులు నిర్వహించారు. వాస్తవ ఘటనల ఆధారంగా భద్రతపై సూచనలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఫిర్యాదు విధానాలపై అవగాహన కల్పించారు.


