సాయం పేరుతో సైబర్‌ మోసం | Cyber ​​fraud in the name of help | Sakshi
Sakshi News home page

సాయం పేరుతో సైబర్‌ మోసం

Jun 26 2026 4:00 AM | Updated on Jun 26 2026 4:00 AM

Cyber ​​fraud in the name of help

సెరిబ్రల్‌ పాల్సీతో బాధపడుతున్న బాలుడు

ఇన్‌స్ట్రాగామ్‌లో ‘హెచ్‌వైసీ’ప్రకటన చూసిన తల్లి

ఆర్థిక సాయం కోసం ప్రయత్నించగా టోకరా

109 లావాదేవీల ద్వారా రూ.12.44 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

సాక్షి, హైదరాబాద్‌: జన్మత: వచ్చిన వ్యాధితో బాధపడుతున్న కుమారుడికి వైద్యం చేయించడానికి ఆర్థిక సాయం కోసం ప్రయత్నించిన ఓ తల్లి సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కింది. హైదరాబాదీ సల్మాన్‌ఖాన్‌కు చెందిన హైదరాబాద్‌ యూత్‌ కరేజ్‌ (హెచ్‌వైసీ) సంస్థ ప్రతినిధులుగా చెప్పుకున్న సైబర్‌ నేరగాళ్లు 109 లావాదేవీల్లో రూ.12,44,309 స్వాహా చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఇందిరానగర్‌కు చెందిన బాధితురాలి (27) పెద్ద కుమారుడు సెరిబ్రల్‌ పాల్సీ వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యం చేయించడానికి ఆర్థికసాయం కోసం బాధితురాలు కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 9న ఇన్‌స్ట్రాగామ్‌ చూస్తుండగా కనిపించిన ఓ రీల్‌ ఆమెను ఆకర్షించింది. అందులో పేర్కొన్న ఫోన్‌ నంబర్‌లో బాధితురాలు సంప్రదించారు. అవతలి వ్యక్తులు తాము సల్మాన్‌ఖాన్‌ నిర్వహిస్తున్న హెచ్‌వైసీ ఫౌండేషన్‌ ప్రతినిధులమని పరిచయం చేసుకున్నారు. బాధితురాలు తన అవసరాన్ని చెప్పగా.. సాయం చేయడానికి అంగీకరించినట్టు నమ్మించిన వారు తొలుత రూ.లక్ష ఆన్‌లైన్‌ ద్వారా, ఆపై మరో రూ.80 లక్షలు నేరుగా అందిస్తామని నమ్మబలికారు. 

జీఎస్టీ/ప్రాసెసింగ్‌ చార్జీలు అని చెప్పి....
రూ.లక్ష బదిలీ చేయడానికి జీఎస్టీ/ప్రాసెసింగ్‌ చార్జీలుగా రూ.1,900 చెల్లించాలన్నారు. నిజమని నమ్మిన బాధితురాలు అంగీకరించగా.. ‘ప్రతి దశలోనూ మీరు చెల్లించే మొత్తాన్ని రెట్టింపు చేసి మీ ఖాతాలో జమ చేస్తాం’అంటూ సైబర్‌ నేరగాళ్లు చెప్పారు. దీనికి అంగీకరించిన బాధితురాలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఐడీలతోపాటు పంపిన క్యూఆర్‌ కోడ్‌లకు రెండు వారాల పాటు నగదు బదిలీ చేశారు. 

అయినా, ఆమె ఖాతాలోకి కనీసం ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. అలా ఎందుకని ప్రశ్నించిన ప్రతిసారీ సైబర్‌ నేరగాళ్లు కొత్త కారణం చెబుతూ మరిన్ని చెల్లింపులు జరపాలని కోరారు. ఆపై మాట్లాడిన ఓ వ్యక్తి తాను ఎస్‌బీఐ బ్యాంక్‌ అసిస్టెంట్‌ అని పరిచయం చేసుకున్నాడు. కేవైసీ పెండింగ్‌లో ఉందని, ఏటీఎం పిన్‌లాక్‌ అయిందని, మరికొన్ని బ్యాంకింగ్‌ ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉండటంతోనే నగదు జమ ఆలస్యం అవుతోందని చెప్పాడు. 

బ్యాలెన్స్‌ చూపిస్తూ నకిలీ సందేశాలు పంపి....
కొద్ది రోజులకు బాధితురాలికి మరో నంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. బ్యాంకు నుంచి మాట్లాడుతున్నానని చెప్పి ఆ వ్యక్తి బాధితురాలి వ్యక్తిగత వివరాలు అడిగాడు. ఆపై ఆమె ఖాతాలో రూ.80 లక్షలు అందుబాటులో ఉన్నాయని చెబుతూ.. ఆ బ్యాలెన్స్‌ చూపిస్తూ నకిలీ సందేశాలు, స్క్రీన్‌షాట్లు కూడా పంపించాడు. బాధితురాలు తన మొబైల్‌ బ్యాంకింగ్‌ ఖాతాలో పరిశీలించగా ఆ మొత్తం కనిపించలేదు. దీనిపై అతడికి ఫోన్‌ చేసి ప్రశ్నించగా సేవింగ్స్‌ ఖాతాను కరెంట్‌ ఖాతాగా మార్చామని, బ్యాంకింగ్‌ విధానాల కారణంగా మొబైల్‌ బ్యాంకింగ్‌లో మొత్తం కనిపించడం లేదని నమ్మించారు. 

ఆ తర్వాత ఆదాయపు పన్ను పేరుతో మరికొంత డబ్బు చెల్లించాలని చెప్పి మరికొంత కాజేశారు. ఆపై మరోసారి బ్యాంకు అధికారిగా కాల్‌ చేసిన సైబర్‌ నేరగాడు నగదు విడుదల కావాలంటే ఒక లేఖపై సంతకం చేయాల్సి ఉందని, అందుకోసం రూ.1.55 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. ఇలా మొత్తమ్మీద బాధితురాలి నుంచి రూ.12,44,309 కాజేశారు. తమకు చెల్లించిన ప్రతి పైసా రెట్టింపై తిరిగి ఖాతాలోకి వస్తుందని నమ్మబలికాడు. ఆ తర్వాత కొత్త కథ మొదలెట్టిన సైబర్‌ నేరగాళ్లు నగదును యూనియన్‌ బ్యాంకు అధికారులు నేరుగా ఇంటికి తీసుకొచ్చి అందిస్తారని చెప్పారు. 

ఆధారాలు అంటూ బ్యాంకు ప్రాంగణం, నగదు కట్టల ఫొటోలు వాట్సాప్‌ ద్వారా పంపారు. వారి మాటలు నమ్మిన బాధితురాలు తన ఇంటి లొకేషన్‌ కూడా షేర్‌ చేశారు. ఆ వెంటనే నగదుతో బయలుదేరినట్టు సృష్టించిన వీడియోలను సైబర్‌ నేరగాళ్లు పంపారు. ఆపై వారి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ కావడంతో తాను మోసపోయినట్టు భావించిన బాధితురాలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement