తొలి డోసు తీసుకున్నారా.. రెండో డోసుకు గ్యాప్‌ ఎంత ఉండాలో తెలుసా?

Covid:Doctors Say Two Months Gap Second Dose Vaccination-sakshi - Sakshi

కోవిషీల్డ్‌ డోసుల మధ్య గ్యాప్‌ ఉండాలంటున్న నిపుణులు 

6 నుంచి 8 వారాల తర్వాత కూడా వేసుకోవచ్చు.. 

కెనెడాలో నాలుగు నెలల గ్యాప్‌..     

సాక్షి, హైదరాబాద్‌: ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. మరో వైపు వ్యాక్సిన్ల కార్యక్రమం మందగిస్తోంది.. 16 కోట్ల కంటే ఎక్కువ మందికి టీకాలు ఇచ్చినా.. వీరిలో రెండో డోసు చాలా తక్కువ మంది తీసుకున్నారు. పలు కారణాల వల్ల రెండో డోస్‌ తీసుకునే వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో రెండు టీకాల మధ్య అంతరం ఎంత ఉండాలన్న దానిపై చర్చా సారాంశమే ఈ కథనం.. 
దేశంలో ప్రస్తుతం రెండు టీకాలు ఉపయోగిస్తున్నాం. కోవాగ్జిన్, కోవిషీల్డ్‌. కోవాగ్జిన్‌ టీకాల మధ్య అంతరంపై పెద్దగా అభ్యంతరాలు, సమస్యలు లేకపోయినా కోవిషీల్డ్‌ విషయంలో మాత్రం తరచూ మార్పులు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా జనవరి 16న టీకా కార్యక్రమం మొదలు కాగా.. అప్పట్లో 2 కోవిషీల్డ్‌ టీకాల మధ్య అంతరం గరిష్టంగా 4 వారాలు మాత్రమే ఉండేది. అయితే గత నెల రెండో వారంలో ఈ అంతరాన్ని మరింత పెంచారు. తొలి డోసు తీసుకున్న తర్వాత 6 నుంచి 8 వారాల అంతరంతో రెండో డోసు తీసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ ఉత్పత్తి కొరత ఇందుకు కారణమని అప్పట్లో కొంతమంది ఆరోపించినా.. నిపుణులు మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి ఓకే చెబుతున్నారు.  
సాధారణంగా ఏ టీకా వేసుకున్నా శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యేందుకు 3 వారాల సమయం పడుతుంది. అవి పూర్తిస్థాయిలో పనిచేసేందుకు 8 వారాల సమయం అవసరమని వైరాలజిస్టులు చెబుతారు. రెండు దోసుల మధ్య అంతరం గరిష్టంగా ఎంత ఉండాలన్నది ఎక్కడా స్పష్టంగా చెప్పలేదని, రెండో డోసు ఎప్పుడైనా ఇవ్వొచ్చని చెబుతుంటే.. 3 వారాల కంటే ముందే ఇవ్వడం సరికాదని దేశంలోనే ప్రముఖ వైరాలజిస్ట్‌ గగన్‌దీప్‌ కాంగ్‌ అంటున్నారు. 
ఇలా అయితేనే మంచిది 
కరోనా మహమ్మారితో ప్రపంచం అనేక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 2 టీకాల డోసుల మధ్య అంతరం పెంచడం మేలన్నది నిపుణుల అంచనా. ఒక డోసు తీసుకున్న వారికి వ్యాధి నుంచి గణనీయమైన స్థాయిలో రక్షణ లభిస్తుంటుందని, రెండో డోసు కారణంగా ఇది మరికొంత పెరుగుతుందని వివరిస్తున్నారు. ఈ కారణంగా వీలైనంత ఎక్కువ మందికి తొలి డోసు ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. టీకా ఉత్పత్తి సామర్థ్యం గాడినపడేంత వరకు ఈ పద్ధతి పాటిస్తే కేసులు, మరణాల సంఖ్య తగ్గించవచ్చని అంచనా. 

పలు దేశాల్లో పెరిగిన అంతరం 
టీకాల మధ్య అంతరాన్ని పలు దేశాలు ఇప్పటికే పొడిగించాయి. కెనెడాలో ఇప్పుడు అక్కడ తొలి డోసు తీసుకున్న 4 నెలలకు గానీ రెండో డోసు ఇవ్వట్లేదు. కోవిషీల్డ్‌ డోసుల మధ్య అంతరం పెరిగితే మెరుగైన ఫలితాలు ఉంటాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయని గగన్‌దీప్‌ కాంగ్‌ అంటున్నారు. బ్రిటన్‌ లో ఒక డోసు తీసుకున్న తర్వాత కేసులు, మరణాలు గణనీయంగా తగ్గిపోయాయని, కనీసం 12 వారాల గడువు ఉన్నా కూడా సమస్యలేవీ ఎదురు కాలేదని వివరించారు. ఈ నేపథ్యంలో అక్కడ డోసుల మధ్య అంతరాన్ని 12 వారాలకు పెంచారని తెలిపారు. భారత్‌లోనూ 8 నుంచి 12 వారాల అంతరంతో రెండు డోసుల కోవిషీల్డ్‌ ఇవ్వడం మేలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ నిడివికి ఓకే చెప్పిందని గుర్తు చేశారు. కోవాగ్జిన్‌ నిర్వీర్యం చేసిన వైరస్‌తో తయారైంది కాబట్టి 2 డోసుల మధ్య అంతరం తక్కువ ఉండటం మేలని, రెండు కంటే ఎక్కువ డోసులు తీసుకోవాల్సి రావొచ్చని గగన్‌దీప్‌ కాంగ్‌ అభిప్రాయపడ్డారు.

( చదవండి: కోవిన్ యాప్‌: కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ ఎలా పనిచేస్తుంది?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top