Coronavirus: నిర్ధారణ పరీక్షకు ‘డ్రైస్వాబ్‌’

Coronavirus: CCMB Dry Swab Test Cheaper Compare To RT PCR Test - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ వ్యాధి నిర్ధారణను వేగవంతం చేసే డ్రైస్వాబ్‌ కిట్ల వాణిజ్య ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. సెంటర్‌ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యు లర్‌ బయాలజీ (సీసీఎంబీ) అభివృద్ధి చేసిన ఈ డ్రైస్వాబ్‌ కిట్ల ద్వారా ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు వేగంగా, చౌకగా జరుగుతాయి. భారత వైద్య పరిశోధన సమాఖ్య కూడా ఈ డ్రైస్వాబ్‌ కిట్ల వినియోగానికి అనుమతిచ్చిన నేపథ్యంలో వాటిని వాణిజ్యస్థాయిలో తయారు చేసేందుకు మెరిల్‌ డయాగ్నస్టిక్స్‌ ముందుకొచ్చింది. దేశం మొత్తమ్మీద డ్రైస్వాబ్‌ ఆధారిత పరీక్షలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు సీసీఎంబీ–మెరిల్‌ డయాగ్నస్టిక్స్‌ ఒప్పందం దోహదపడుతుంది.

సాధారణ ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షల్లో ఆర్‌ఎన్‌ఏను వేరు చేసేందుకు చాలా సమయం పడు తుండగా.. డ్రైస్వాబ్‌ కిట్ల ద్వారా తక్కువ సమయంలోనే ఈ పని చేయొచ్చు. దేశంలో కోవిడ్‌ పరీక్షలు పెద్ద సంఖ్యలో చేపట్టేందుకు ఈ కిట్లు ఉపయోగపడతాయని మెరిల్‌ డయాగ్నస్టిక్స్‌ ఉపాధ్యక్షుడు సంజీవ్‌ భట్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెలా దాదాపు రెండు కోట్ల డ్రైస్వాబ్‌ కిట్లను తయారు చేయగలమని, ఒక్కో పరీక్షకు అయ్యే ఖర్చు రూ.45–60 మధ్య ఉంటుందన్నారు.

దేశంలో ప్రస్తుతం జరుగుతున్న రోజువారీ పరీక్షలకు రెండు మూడు రెట్లు ఎక్కువ పరీక్షలు చేసేందుకు ఈ కిట్లు ఉపయోగపడతాయని సీసీఎంబీ నూతన డైరెక్టర్‌ డాక్టర్‌ నందికూరి వినయ్‌ కుమార్‌ తెలపగా..  పరీక్షలకయ్యే సమయం, ఖర్చు దాదాపు సగం వరకూ తగ్గుతాయని సంస్థ గౌరవ సలహాదారు డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు.  

ఏమిటీ డ్రైస్వాబ్స్‌ టెక్నాలజీ? 
కోవిడ్‌ వ్యాధి నిర్ధారణకు ముక్కు లేదా నోటి లోపల ఉండే ద్రవాలను పొడవాటి పుల్లల్లాంటి వాటితో సేకరిస్తారు. వీటినే స్వాబ్స్‌ అంటారు. ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు జరిగే కేంద్రాలకు ఈ నమూనాలను తీసుకెళ్లాలంటే వాటిని వైరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీడియం (వీటీఎం) ద్రావణంలో ఉంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. స్వాబ్స్‌లోని జీవ పదార్థా న్ని జాగ్రత్త పరిచేందుకు కొన్ని రీఏజెంట్లను కూడా వాడతారు.

ఇవేవీ లేకుండా పొడిగా ఉండే స్వాబ్స్‌నే నేరుగా పరీక్షలు జరిగే కేంద్రా లకు తరలించేందుకు వీలుగా సీసీఎంబీ అభివృద్ధి చేసిన కొత్త టెక్నాలజీనే డ్రైస్వాబ్స్‌ టెక్నాలజీ! సాధారణ ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ ద్వారా ఫలితాలకు ఒకట్రెండు రోజుల సమయం పడితే.. డ్రైస్వాబ్స్‌ టెక్నాలజీతో మూడు గంటల్లోనే ఫలితాలు తెలుసుకోవచ్చు.
చదవండి: విదేశీ టీకాలకు నో ట్రయల్స్‌!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top