
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కారు తలపెట్టిన మరో రెండు గ్యారంటీ హామీల ప్రారంభోత్సవ వేదిక మారింది. ప్రభుత్వం రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర సచివాలయంలోనే ప్రారంభించనుంది. నిజానికి మంగళవారం సాయంత్రం చేవెళ్లలో నిర్వహించే బహిరంగ సభలో ఈ పథకాలను ప్రారంభించాల్సి ఉంది.
కానీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం సాయంత్రం షెడ్యూల్ విడుదలవడం, వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి రావడంతో.. వేదికను మారుస్తూ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం సచివాలయంలో ఈ రెండు గ్యారంటీ పథకాలను ప్రారంభించిన అనంతరం చేవెళ్లలో యధావిధిగా కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు సభ కోసం టీపీసీసీ విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేసింది.