కర్షకుడా... కదలిరా!  | Sakshi
Sakshi News home page

కర్షకుడా... కదలిరా! 

Published Wed, Nov 17 2021 3:39 AM

Congress Concerns Over Grain Purchase On Thursday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలం టూ ఆందోళన చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. టీపీసీసీ ఆధ్వర్యంలోగురువారం ఇక్కడి పబ్లిక్‌గార్డెన్స్‌ నుంచి బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ వరకు ‘కర్షకుడా.. కదలిరా’ పేరుతో రైతులతో ప్రదర్శన నిర్వహించ నుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్‌ ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయిం చారు. సమావేశంలో భాగంగా పార్టీ సభ్యత్వంతో పాటు రైతుల సమస్యలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారుపై చర్చించారు. వడ్లను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రదర్శన నిర్వహించి వ్యవసాయ శాఖ అధికారులకు వినతిపత్రం ఇవ్వనున్నారు.

అదే విధంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున నామినేషన్‌ దాఖలు చేసిన సిద్దిపేట మాజీ కలెక్టర్‌ పి.వెంకట్రామిరెడ్డి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలంటూ మండలి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిని కోరాలని కూడా కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం ఉదయం 10 గంటలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిల నేతృత్వంలో ఎన్నికల అధికారిని కలసి ఫిర్యాదు చేయనున్నారు.

వెంకట్రామిరెడ్డిపై ఉన్న అవినీతి, భూకబ్జాల ఆరోపణల నేపథ్యంలో ఆయన నామినేషన్‌ను తిరస్క రించాలని కాంగ్రెస్‌ కోరనుంది. దీంతోపాటు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, 30 లక్షలకు తగ్గకుండా ఈసారి సభ్యత్వాన్ని పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. సమావేశానికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి, పీఏసీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ, నేతలు హర్కర వేణుగోపాల్, దీపక్‌ జాన్‌ తదితరులు హాజరయ్యారు.

Advertisement
Advertisement