హైదరాబాద్‌ నగరంలో మరో సమగ్ర సర్వే | comprehensive survey in Hyderabad for flood prevention | Sakshi
Sakshi News home page

వరద నివారణ కోసం హైదరాబాద్‌లో మరో సమగ్ర సర్వే

Apr 9 2025 7:57 PM | Updated on Apr 9 2025 8:08 PM

comprehensive survey in Hyderabad for flood prevention

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ నగరంలో వరద నివారణ చర్యల కోసం కిర్లోస్కర్, వాయెంట్స్‌ సొల్యూషన్స్, జేఎన్‌టీయూ, ఓయూల నిపుణులు వివిధ సర్వేలు చేసినా, వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో నగరంలో వానొస్తే.. సమస్యలు షరా మామూలుగానే కనిపి స్తున్నాయి. తాము చేపట్టిన చర్యలతో గతంలో కంటే తీవ్రత తగ్గిందని అధికారులు చెబుతున్నా.. ప్రజలు మాత్రం పెదవి విరుస్తున్నారు. రెయిన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్స్‌తోనూ ఆయా ప్రాంతాల్లో సమస్యలు తగ్గాయని అధికారులు అంటుండగా.. తగ్గలేదని ప్రజలు చెబుతున్నారు. శాటిలైట్‌ ఇమేజెస్‌తో నాలాల సర్వే జరపాలని కూడా భావించారు. తాజాగా గ్రేటర్‌ నగరంలోని నాలాలతోపాటు చెరువులకు సంబంధించి కూడా సమగ్ర సర్వే (comprehensive survey) నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.  

వివిధ అంశాల వారీగా.. 
‘ఇంటిగ్రేటెడ్‌ స్టార్మ్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌’ పేరిట నిర్వహించనున్న ఈ సర్వేలో వెల్లడయ్యే అంశాలతో శాశ్వత నివారణ చర్యటు చేపట్టనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. సర్వేలో భాగంగా నగర శివార్ల వరకు ఉన్న నాలాలు, దాదాపు 185 చెరువుల ప్రాంతాల్లోని పరిస్థితుల్ని పరిశీలిస్తారు. నగరంలో ఎంత మోస్తరు వర్షం వస్తే నాలాల్లో, చెరువుల్లో  చేరే వరద నీరెంత.. ఎక్కడి నుంచి వాననీరు నాలాల నుంచి ఎక్కడి వరకు ప్రవహిస్తోంది.. నాలాల డిశ్చార్జి సామర్థ్యమెంత..  వరదల వల్ల సదరు నాలా, చెరువుల ప్రదేశాల్లో తరచూ ముంపు బారిన పడే ప్రాంతాలేవీ? ఇలా వివిధ అంశాల వారీగా క్షేత్రస్థాయిలో సర్వే చేయనున్నారు.

సర్వే నివేదికకు అనుగుణంగా అవసరమైన పరిష్కార చర్యలు చేపడతారు. ఈ మేరకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించినట్లు పేర్కొన్నారు. అనుమతి వచ్చాక సర్వే చేయనున్నారు. సర్వేలో భాగంగా సమస్యల పరిష్కారానికి ఇప్పటికే చేసిన పనులెన్ని.. వాటివల్ల ఏ మేరకు సమస్య పరిష్కారమైంది.. ఇంకా చేయాల్సిందెంత..? వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  

హైడ్రా, ట్రాఫిక్‌ విభాగాల సమన్వయంతో.. 
మరోవైపు ప్రస్తుతం కురుస్తున్న, రాబోయే వర్షాకాలంలో వరద నీరు రోడ్లపై నిల్వకుండా చేసేందుకు హైడ్రా, ట్రాఫిక్‌ విభాగాల సమన్వయంతో పని చేసేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. నగరంలో రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలను ప్రధానంగా 141 ఉన్నట్లు గుర్తించారు. ఈ 141 ప్రాంతాల వద్ద వర్షాల సందర్భంగా ఎదురయ్యే నీటినిల్వ, ట్రాఫిక్‌ సమస్యల్ని సత్వరం పరిష్కరించేందుకు మూడు విభాగాలతో కమిటీలు ఏర్పాటు చేస్తారు.

చ‌ద‌వండి: 15 నిమిషాల్లోనే  స్థిరాస్తి రిజిస్ట్రేష‌న్‌ ప్రక్రియ పూర్తి 

కమిటీలో జీహెచ్‌ఎంసీతోపాటు హైడ్రా, ట్రాఫిక్‌ విభాగాల నుంచి సిబ్బంది  ఉంటారు. ప్రతి ప్రాంతం వద్ద జీహెచ్‌ఎంసీకి సంబంధించిన సిబ్బంది ఉంటారు. వారి నుంచి అందే సమాచారంతో మిగతా విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేసి నీటి నిల్వ, ట్రాఫిక్‌ ఇబ్బందులు వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకుంటారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ, హైడ్రా కమిషనర్లు సమావేశమైన సందర్భంగా తీసుకున్న నిర్ణయానికనుగుణంగా ఈ చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది. వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement