ప్రజా‘వాణి’ వినాలి | CM Revanth Reddy order to Officials in review of Prajavani | Sakshi
Sakshi News home page

ప్రజా‘వాణి’ వినాలి

Apr 27 2026 1:49 AM | Updated on Apr 27 2026 5:32 AM

CM Revanth Reddy order to Officials in review of Prajavani

జనగణనలో భాగంగా ఆదివారం లోక్‌భవన్‌లో స్వీయ గణన ప్రక్రియను ప్రారంభిస్తున్న గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో స్వీయ గణనలో వివరాలు నమోదు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఫిర్యాదుల పరిష్కారంలో రాజీ వద్దు.. ఆలస్యమైతే అధికారులదే బాధ్యత

ప్రజావాణిపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం 

రాష్ట్ర, జిల్లా స్థాయి నుంచి రెవెన్యూ డివిజన్‌ స్థాయికి.. తర్వాత మండల స్థాయికి విస్తరించాలి  

ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని స్థాయిల అధికారులకు పూర్తి అధికారం 

గడువులోగా పరిష్కారం.. ట్రాకింగ్‌కు డిజిటల్‌ ప్లాట్‌ఫాం

సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రజలకు నమ్మకంగా ఉండేలా ప్రజావాణి సేవలు అందించాలి. ప్రతి ఫిర్యాదును నమోదు చేయాలి. సంబంధిత విభాగాలకు పంపించాలి. పరిష్కార పురోగతిని అర్జీదారునికి తెలియజేయాలి’అని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువు ఉండాలని, ఆలస్యం జరగకూడదని చెప్పారు. ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్‌ ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయాలన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ ఉండాలని సూచించారు. డ్యాష్‌బోర్డ్‌ ద్వారా పరిష్కార పురోగతి తెలుసుకునే వీలుండాలని, ఎక్కడైనా ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని చెప్పారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఎంఓ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 

ప్రస్తుతం రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఇకపై రెవెన్యూ డివిజన్‌ స్థాయికి, తర్వాత దశలో మండల స్థాయికి విస్తరించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు, జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని చెప్పారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని స్థాయిల్లో అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజు 2023 డిసెంబర్‌ 8న మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో రాష్ట్ర స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌ ప్రారంభించారు. నాటి నుంచి ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు అక్కడికక్కడే ప్రజల అర్జీలు, దరఖాస్తులను స్వీకరించి వేగవంతంగా వాటిని పరిష్కరించే చర్యలు చేపడుతున్నా రు. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతివారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు.  

పైఅధికారికి ఫిర్యాదు ఆటో ఎస్కలేషన్‌.. 
ప్రతిస్థాయిలో ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను నియమించాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ, ప్రతి శాఖలో ప్రత్యేక ప్రజావాణి విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు. ఒకస్థాయిలో పరిష్కారం కాకపోతే, పైస్థాయి అధికారికి అర్జీ అందేలా ఆటో ఎస్కలేషన్‌ వ్యవస్థను అమలు చేయాలని చెప్పారు. అవసరమైతే అప్పీల్‌ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్‌ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆలస్యమైతే అధికారులదే బాధ్యత అని చెప్పారు. ప్రజావాణి సేవలను వికేంద్రీకరించటంతో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పెండింగ్‌ అర్జీల సంఖ్య తగ్గుతుందని, కింది స్థాయిలోనే కొన్ని పరిష్కరించే వీలుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement