రాహులే ప్రధానిగా ఉంటే.. 48 గంటల్లో బీసీ రిజర్వేషన్లు! | CM Revanth Reddy in a meeting with BC community leaders | Sakshi
Sakshi News home page

రాహులే ప్రధానిగా ఉంటే.. 48 గంటల్లో బీసీ రిజర్వేషన్లు!

Jul 13 2025 5:20 AM | Updated on Jul 13 2025 5:20 AM

CM Revanth Reddy in a meeting with BC community leaders

కేంద్రం నుంచి సాధించుకుని వచ్చేవాడిని 

బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలి 

రాష్ట్ర బీజేపీ నేతలు ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలి 

బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే సామాజిక బహిష్కరణ విధించండి 

బీసీ సంఘం నేతలతో సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: ‘బీసీ రిజర్వేషన్లపై మాకు చిత్తశుద్ధి లేదని కొందరు విమర్శిస్తున్నారు. చిత్తశుద్ధి లేనిది బీజేపీకి. బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చి చట్టబద్ధత కల్పించాల్సింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఆర్‌ క్రిష్ణయ్య దీన్ని సాధించాలి. మోదీ స్థానంలో రాహుల్‌గాంధీ ప్రధానిగా ఉండి ఉంటే 48 గంటల్లో నేను బీసీ రిజర్వేషన్లను సాధించుకు వచ్చేవాడిని. ప్రధాని మోదీని తెలంగాణకు చెందిన బీజేపీ మంత్రులు ప్రశ్నించాలి. 

బీజేపీ నాయకులు నిబద్ధతను చూపించాలి’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన కోసం పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురావాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించినందుకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్, ఇతర నాయకులు శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి ధన్యావాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌గౌడ్, మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రిజర్వేషన్ల విషయంలో తనను ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని అన్నారు. బీసీల వందేళ్ల ఆకాంక్షను కాంగ్రెస్‌ పార్టీ నెరవేర్చిందని తెలిపారు. ‘కులగణన చేస్తామని భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ ప్రకటించారు. ఆయన మాట మాకు శిలాశాసనం. నాయకుడు మాట ఇస్తే దాన్ని నేరవేర్చాల్సిన బాధ్యత నాది, మా పీసీసీ అధ్యక్షుడిది . ఏడాదిలో పక్కాగా కులగణన పూర్తి చేశాం. రాహుల్‌ గాం«దీ, మల్లికార్జున ఖర్గే తెలంగాణ మోడల్‌లో కులగణన చేయాలని దేశమంతా చెబుతున్నారు. 

కులగణనకు వ్యతిరేకమని బీజేపీ గతంలో సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని జంతర్‌ మంతర్‌లో నిర్వహించిన ధర్నాకు 16 పార్టీలు మద్దతు ఇచ్చాయి. మనం తీసుకువచ్చిన ఒత్తిడికి లొంగే కేంద్రం 2026లో జరిగే జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించింది. తెలంగాణ నిర్ణయం దేశాన్ని ప్రభావితం చేసింది’అని సీఎం పేర్కొన్నారు.  

బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తే సామాజిక బహిష్కరణ 
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకించేవారికి సామాజిక బహిష్కరణ శిక్ష విధించాలని సీఎం పిలుపునిచ్చారు. ‘రిజర్వేషన్ల కోసం ఇంకా ఏం చేయాలన్నా నేను సిద్ధం. అర్ధరాత్రి కూడా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తా. నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ విధించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసమే ఇంతకాలం ఈ ఎన్నికలు వాయిదా వేశాం. 

50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచొద్దని గత కేసీఆర్‌ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టం చేసింది. ఈ చట్టం చేసినప్పుడు మంత్రులుగా బీసీలైన గంగుల కమలాకర్, శ్రీనివాస్‌ గౌడ్, శ్రీనివాస్‌ యాదవ్‌ ఉన్నారు. కేసీఆర్‌ ఇప్పుడు వాళ్లను మాపైకి ఉసిగొల్పుతున్నారు. ఆ చట్టంలో పేర్కొన్న 50 శాతం నిబంధనను సవరిస్తూ మేం ఇప్పుడు ఆర్డినెన్స్‌ తీసుకువచ్చాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తాపత్రయం పడుతున్నది నేను. నాకు తోడుగా ఉండండి. రక్షణ కవచంలా ఉండి రిజర్వేషన్లను కాపాడుకోవాలి. 

రిజర్వేషన్లపై ఎవరైనా కోర్టుకు వెళ్తే వాదించడానికి ఢిల్లీ నుంచి ఉద్ధండులైన న్యాయవాదులను నియమిస్తా. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాగితం పెట్టిన వాళ్లని, కాగితం పెట్టించిన వాళ్లను సామాజిక బహిష్కరణ చేస్తామని ప్రకటించండి. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ ఎంపీలతో పాటు ఇండియా కూటమి ఎంపీలకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తాం. అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు అయితేనే నిజమైన విజయం. 2029 ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లే ప్రధాన జెండా కావాలి’అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement