
సాక్షి, వరంగల్: సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ(మంగళవారం) మేడారంలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి ఆయన హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. దాదాపు 2.30 గంటలపాటు సీఎం మేడారంలో గడపనున్నారు. ఈ సందర్భంగా 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే సమ్మక్క–సారలమ్మ మహాజాతర నిర్వహణ కోసం చేపట్టిన పనులను పరిశీలిస్తారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఇతర అధికారులు, పూజారులతో మాట్లాడతారని అధికారులు తెలిపారు.
పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం
ఆదివాసీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది భక్తులు మంది దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీఎత్తున అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కోట్లాది భక్తులు వచ్చే జాతర ప్రాశస్త్యానికి తగ్గట్టు భారీఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతోపాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, గద్దెల దర్శనం, బంగారం (బెల్లం) సమర్పణ, జంపన్న వాగులో స్నానాలాచరించేందుకు అవసరమైన ఏ ర్పాట్లు చేయనున్నారు.
మేడారం అభివృద్ధి పనుల్లో గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు ఎటువంటి భంగం కలగొద్దనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ప్రతి నిర్మాణం.. ప్రతి కట్టడాన్ని పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా, మేడారం జాతర పూజారులు, ఆదివాసీ పెద్దల సూచనలతో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణాల్లో విలువైన గ్రానైట్, లైమ్‌స్టోన్‌ను వాడుతారు. ప్రముఖ స్థపతి, చరిత్రకారుడు ఈమని శివనాగిరెడ్డి సేవలను మేడారం అభివృద్ధి పనులకు ప్రభుత్వం వినియోగించుకుంటోంది.
ఏర్పాట్లను సీఎం పరిశీలించడం ఇదే తొలిసారి
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాతరను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇంతకాలం మేడారం జాతరకు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు చేసేవి. జాతర నిర్వహణపై సమీక్షకు సైతం గతంలో ముఖ్యమంత్రులు పెద్దగా శ్రద్ధ చూపిన సందర్భాలు లేవు. మేడారం జాతర ఏర్పాట్లపై తొలిసారిగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ పర్యటించనున్నారు. మేడారం పూజరులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై ముఖ్యమంత్రి మంగళవారం మేడారంలో సమీక్షిస్తారు. ఈ నెల 20న హైదరాబాద్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన సీఎం రేవంత్‌రెడ్డి.. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం మరోసారి రివ్యూ చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.
సీఎం టూర్ షెడ్యూల్ ఇలా...
సీఎం రేవంత్‌రెడ్డి మేడారం పర్యటన షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించాయి. ఉదయం 10.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న సీఎం.. మధ్యాహ్నం 12 గంటలకు మేడారం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.15 గంటల నుంచి 1.30 గంటల వరకు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకొని పూజారులతో ఇంటరాక్ట్ అవుతారు. తర్వాత పబ్లిక్ మీటింగ్‌లో ఆలయ పునరుద్ధరణ పనుల ప్లాన్‌ను డిజిటల్ లాంచ్ చేస్తారు. 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు మేడారం పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం తిరిగి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరుతారు. సీఎం పర్యటన సందర్భంగా మంత్రి సీతక్క, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.