దక్షిణ ‘రింగ్‌’కూ ఓకే!

CM Revanth Appeal to convert many state roads into national highways - Sakshi

రీజనల్‌ రింగురోడ్డు దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు 

సీఎం రేవంత్‌ విజ్ఞప్తి మేరకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశాలు 

భూసేకరణ, విధానపర ప్రక్రియల వేగవంతానికి కూడా ఓకే 

యుటిలిటీస్‌ తరలింపు భారాన్ని భరిస్తామన్న కేంద్ర మంత్రి 

గడ్కరీ నివాసంలో గంటన్నరపాటు భేటీ అయిన రాష్ట్ర బృందం 

పలు రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా మార్చాలని విజ్ఞప్తి 

సాక్షి, న్యూఢిల్లీ: రీజనల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం (చౌటుప్పల్‌–ఆమన్‌గల్‌–షాద్‌నగర్‌–సంగారెడ్డి– 182 కిలోమీటర్లు)ను జాతీ­య రహదారిగా గుర్తించేందుకు అడ్డంకులు తొల­గి­పోయాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగాన్ని కేంద్రం ఇప్పటికే జాతీయ రహదారిగా ప్రకటించింది. తాజాగా దక్షిణ భాగాన్ని కూడా గుర్తించేందుకు ప్రతిపాదనలు కోరాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బృందం విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.  

గంటన్నర పాటు భేటీ..: సీఎం రేవంత్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉన్నతాధికారులతో కూడిన బృందం మంగళవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి గడ్కరీని ఆయన అధికారిక నివాసంలో కలిసింది. సుమారు గంటన్నర పాటు భేటీ అయింది. ఈ సందర్భంగా తెలంగాణలో జాతీయ రహదారులను విస్తరించాల్సిన ఆవశ్యకతను గడ్కరీ దృష్టికి సీఎం రేవంత్‌ తీసుకెళ్లారు. ఆర్‌ఆర్‌ఆర్‌తోపాటు ఇతర రోడ్లకు అనుమతి ఇవ్వాలని.. పలు ముఖ్యమైన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్‌ చేయాలని కోరారు. ఇందుకు సంబంధించిన జాబితాను కేంద్రమంత్రికి అందజేశారు. 

యుటిలిటీస్‌ తరలింపుపై..: ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మించే మార్గంలో చౌటుప్పల్‌–భువనగిరి–తుప్రాన్‌–సంగారెడ్డి–కంది పరిధిలో యుటిలిటీస్‌ (విద్యుత్‌ స్తంభాలు, లైన్లు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల) తొలగింపు వ్యయం విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనపై ఈ భేటీలో చర్చించారు. యుటిలిటీస్‌ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పదినెలల క్రితం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పేర్కొన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. కాంగ్రెస్‌ సర్కారు వచ్చాక యుటిలిటీస్‌ తరలింపు వ్యయాన్ని రాష్ట్రం భరించేందుకు సిద్ధమంటూ ఎన్‌హెచ్‌ఏఐకు లేఖ పంపింది.

సీఎం రేవంత్‌ ఈ అంశాన్ని కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించగా.. ఆయన ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను ఆరా తీశారు. యుటిలిటీస్‌ తరలింపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని మెలిక పెట్టినదెవరని అధికారులపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం యుటిలిటీస్‌ తరలింపు వ్యయాన్ని భరిస్తే భవిష్యత్‌లో టోల్‌ ఆదాయంలో సగం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో యుటిలిటీస్‌ తరలింపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని రాష్ట్ర బృందానికి గడ్కరీ వివరించారు. 

రెండు రోడ్లను విస్తరించండి.. 
హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా.. హైదరాబాద్‌–కల్వకుర్తి మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించాలని కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం రేవంత్‌ కోరారు. ఇక నల్లగొండ జిల్లాలో ట్రాన్స్‌పోర్టు ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు చేయాలని గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీటిని సానుకూలంగా పరిశీలిస్తామని గడ్కరీ రాష్ట్ర బృందానికి హామీ ఇచ్చారు. ఇక సీఆర్‌ఐఎఫ్‌ (కన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ రూరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌) నిధుల మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. 
 
జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్‌ చేయాలని సీఎం కోరిన రోడ్లు ఇవీ.. 
1. మరికల్‌–నారాయణపేట్‌–రామసముద్ర: 63 కి.మీ. 
2. పెద్దపల్లి–కాటారం: 66 కి.మీ 
3. పుల్లూర్‌–అలంపూర్‌–జటప్రోలు–పెంట్లవెల్లి–కొల్లాపూర్‌–లింగాల్‌–అచ్చంపేట–డిండి–దేవరకొండ–మల్లేపల్లి–నల్గొండ: 225 కి.మీ. 
4. వనపర్తి–కొత్తకోట–గద్వాల–మంత్రాలయం: 110 కి.మీ. 
5. మన్నెగూడ–వికారాబాద్‌–తాండూర్‌–జహీరాబాద్‌–బీదర్‌: 134 కి.మీ. 
6. కరీంనగర్‌–సిరిసిల్ల–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం: 165 కి.మీ. 
7. ఎర్రవెల్లి క్రాస్‌రోడ్‌–గద్వాల–రాయచూర్‌: 67 కి.మీ. 
8. జగిత్యాల–పెద్దపల్లి–కాల్వశ్రీరాంపూర్‌–కిష్టంపేట–కల్వపల్లి–మోరంచపల్లి–రామప్ప దేవాలయం–జంగాలపల్లి: 164 కి.మీ 
9. సారపాక–ఏటూరునాగారం: 93 కి.మీ 
10. దుద్దెడ–కొమురవెల్లి–యాదగిరిగుట్ట–రాయగిరి క్రాస్‌రోడ్‌: 63 కి.మీ. 
11. జగ్గయ్యపేట–వైరా–కొత్తగూడెం: 100 కి.మీ. 
12. సిరిసిల్ల–వేములవాడ–కోరుట్ల: 65 కి.మీ 
13. భూత్పూర్‌–నాగర్‌కర్నూల్‌–మన్ననూర్‌–మద్దిమడుగు(తెలంగాణ)–గంగలకుంట –సిరిగిరిపాడు: 166 కి.మీ. 
14. కరీంనగర్‌–రాయపట్నం: 60 కి.మీ.   

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top