అంబేద్కర్‌ జయంతి వారోత్సవాల ముగింపు వేడుకలు | Closing Ceremony of Ambedkar Jayanti Celebrations under BJP Leadership | Sakshi
Sakshi News home page

అంబేద్కర్‌ జయంతి వారోత్సవాల ముగింపు వేడుకలు

Apr 26 2026 5:39 PM | Updated on Apr 26 2026 6:00 PM

Closing Ceremony of Ambedkar Jayanti Celebrations under BJP Leadership

హైదరాబాద్‌: బీజేపీ ఆధ్వర్యంలో నగరంలోని సోమాజిగూడలో జరిగిన అంబేద్కర్‌ జయంతి వారోత్సవాల ముగింపు వేడుకల్లో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ వేడుకలకు  భారీ ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. దీనిలో భాగంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ‘అంబేద్కర్ జయంతిని గల్లీ నుండి ఢిల్లీ వరకు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అంబేద్కర్ దేశ ప్రజలకి ఆశా జ్యోతి.. అందుకే దేశ వ్యాప్తంగా వారోత్సవాలు జరగుతున్నాయి. 

రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా అంబేద్కర్ జయంతిని తూతూ మంత్రంగా జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని వారం రోజుల పాటు ప్రధాని మోదీ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితినే అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహిస్తుంది. మనం సుఖ సంతోషాలతో జీవిస్తున్నాం అంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్షనే. అంబేద్కర్ చరిత్రని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. అడుగడుగునా అంబేద్కర్ ని అవమానించిన పార్టీ కాంగ్రెస్. డూప్లికేట్ గాంధీ కుటుంబ చరిత్రనే ప్రజలకి తెలియాలని కాంగ్రెస్ కుట్ర చేసింది.

దేశ విభజన, 370 ఆర్టికల్ ని వ్యతిరేకించిన వ్యక్తి అంబేద్కర్. నెహ్రూ ఆగడాలు, అరాచకాలు తట్టుకోలేక అంబేద్కర్ రాజీనామా చేసి బయటికి వచ్చారు. అంబేద్కర్ కి భారతరత్న ఇవ్వడానికి కాంగ్రెస్ ఒప్పుకోలేదు. అంబేద్కర్ రాజకీయ చరిత్ర లేకుండా చేసింది కాంగ్రెస్. అప్పట్లో జనసంఘ్ పార్టీ అంబేద్కర్‌కి ఎంఎల్సీ ఇచ్చి గౌరవించింది. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ స్మృతి వనం కట్టలేదు’ అని విమర్శించారు. 

కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘అంబేద్కర్ ఆలోచన విధానాలతో మోదీ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. అంబేద్కర్ ఆలోచన విధానాలకి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వెన్ను పోటు పొడిచిందో ప్రజలోకి తీసుకెళ్లాలి. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ ఏ విధంగా అడ్డుకుందో అందరికీ తెలుసు. అసెంబ్లీ, పార్లమెంట్‌లకు గిరిజనులు, దళితులు, మహిళలని వెళ్ళకుండా కాంగ్రెస్ అడ్డుకుంది. సీట్లు పెంపు ద్వారా అందరూ లబ్ది పొందేవారు. దక్షిణ భారతదేశంకి అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి, స్టాలిన్, రాహుల్ గాంధీ మాట్లాడారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఒకే నిష్పత్తిలో సమాంతరంగా సీట్లు పెంచాలని మోదీ నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి, స్టాలిన్, రాహుల్ గాంధీ వల్ల దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరిగింది. కాంగ్రెస్ 50 ఏళ్ళు పాలించినపుడు ఏ రోజు కూడా బీసీలు గుర్తుకు రాలేదు’ అని మండిపడ్డారు.

‘వచ్చే నెల పదోవ తేదీన తెలంగాణకు ప్రధాని మోదీ వస్తున్నారు. మూడోసారి ప్రధాని అయిన తరువాత మొదటి సారి హైదరాబాద్‌కి మోదీ వస్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు జాతికి అంకితం చేస్తారు. వచ్చే నెల 10 వ తేదీ న పెరెడ్ గ్రౌండ్ లో నాలుగు గంటలకు ప్రధాని బహిరంగ సభలో పాల్గొంటారు’అని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement