మొదలైన ఎండలు.. జ్వరాలు.. కరోనా!

Climate Change: Fever.. Corona Virus.. Disease Attack - Sakshi

అధిక ఎండలతో పెరుగుతున్న జ్వరాలు

గొంతునొప్పి, జలుబుతో ఆసుపత్రులకు రోగులు

మళ్లీ విస్తరిస్తున్న కోవిడ్‌ మహమ్మారి

వారంలో 14 జిల్లాల్లో పెరిగిన కేసులు

3 నెలల తర్వాత ఒక్కరోజులో 3 మరణాలు

జాగ్రత్తలు పాటించడంలో జనాల నిర్లక్ష్యం

సాక్షి, హైదరాబాద్‌: ఒకవైపు ఎండలు.. మరోవైపు జ్వరాలు.. ఇంకోవైపు కరోనా కేసుల పెరుగుదలతో రాష్ట్రంలో మళ్లీ అలజడి మొదలవుతోంది. చలికాలం నుంచి ఎండాకాలానికి వాతావరణం మారడంతో ఒక్కసారిగా గొంతు నొప్పి, జలుబు, జ్వరాల వంటి కేసులు నమోదవుతున్నాయి. వైరస్‌ విస్తరించడానికి ఈ పరిస్థితి అనుకూలం కావడంతో కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతోందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎండాకాలం కావడం వల్ల సాధారణంగా శరీరం వేడెక్కుతుంది. దానికి తగ్గట్లు జాగ్రత్తలు తీసుకోకపోతే వైరల్‌ జ్వరాలు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. గణనీయమైన సంఖ్యలో జ్వరం కేసులు నమోదు కాకపోయినా, గతం కంటే కాస్తంత పెరిగాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గొంతు నొప్పి, జలుబు, జ్వరంతో రోగులు ఆసుపత్రులకు వస్తున్నారని వెల్లడిస్తున్నారు.

కరోనా కేసుల్లో పెరుగుదల.. 
సరిగ్గా గతేడాది మార్చి నెలలో కరోనా కేసులు రాష్ట్రంలో మొదలయ్యాయి. కీలకమైన ఎండాకాలం సీజన్‌లోనూ కేసులు పెరిగాయి. ఇప్పుడూ తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లో కరోనా రెండోసారి విజృంభించడంతో, మన దగ్గర ఆ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు బ్రిటన్, సౌదీ అరేబియా, దుబాయ్‌ తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో కొందరిలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి.

కాలేజీలు, స్కూళ్లు తెరవడం, అన్ని రకాల వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు మొదలు కావడంతో కేసులు పెరుగుతున్నాయి. అంతేగాకుండా ఇక కరోనా లేదన్న భావనతో అనేకమంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా మాస్క్‌లు ధరించేవారి సంఖ్య తగ్గిపోయింది. భౌతికదూరం కనుమరుగైంది. చేతి శుభ్రత పాటించడంపై అశ్రద్ధ కనిపిస్తోంది. గత వారంతో పోలిస్తే రాష్ట్రంలో 14 జిల్లాల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ నెల 4వ తేదీన 27 కేసులు నమోదు కాగా, 10వ తేదీన 35 కేసులు రికార్డయ్యాయి. ఎండల తీవ్రత, జ్వరాల వల్ల కేసులు ఇంకా పెరుగుతాయని వైద్యులు వెల్లడిస్తున్నారు.

ఇటీవల కరీంనగర్‌ జిల్లాలో ఒక వ్యక్తి అంత్యక్రియల్లో పాల్గొన్న 33 మందికి కరోనా వచ్చింది. హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్‌ సంస్థలో 150 మందికి పరీక్షలు చేస్తే, 21 మందికి ఒకేరోజు కరోనా నిర్ధారణ అయింది. ఆదిలాబాద్‌ జిల్లాలో ఒక హాస్టల్‌లో పరీక్షలు చేస్తే ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. బయటకు వచ్చే కేసులు కొన్ని కాగా, వెలుగు చూడని కేసులెన్నో ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

యాంటిజెన్‌ కిట్లు పెద్ద ఎత్తున అందుబాటులోకి రావడంతో అనుమతి లేని డయాగ్నస్టిక్‌ సెంటర్లలోనూ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో అవి లెక్కలోకి రావడం లేదంటున్నారు. అంతేకాదు ప్రతీరోజూ విడుదల చేసే కరోనా బులెటిన్‌లో ఒక్కోసారి మరణాలు ఉండేవి కావు. ఒక్కోరోజు ఒకటి, అప్పుడప్పుడు రెండు నమోదయ్యేవి. తాజాగా గురువారం విడుదల చేసిన బులెటిన్‌లో ఏకంగా ముగ్గురు కరోనాతో మరణించినట్లు పేర్కొన్నారు. మూడు నెలల తర్వాత ఒకేరోజు మూడు కరోనా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి.

వాతావరణ మార్పులతో అనారోగ్యం.. 
చలికాలం నుంచి వేసవిలోకి ప్రవేశించడంతో వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. దీంతో శరీరంలోనూ గణనీయంగా మార్పులొస్తాయి. గొంతునొప్పి, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు సంభవిస్తాయి. ఈ నేపథ్యంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా కాలం కావడం వల్ల అందుకు సంబంధించిన జాగ్రత్తలు పాటించాలి. మాస్క్‌లు, భౌతిక దూరం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. అవకాశమున్నంత మేరకు ఎండల్లో బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. ఏమాత్రం అనుమానమొచ్చినా, కరోనా లక్షణాలున్నా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.. 
- డాక్టర్‌ హెప్సిబా, మెడికల్‌ ఆఫీసర్, హైదరాబాద్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top