Priya Sisters: ఆదాయం కన్నా.. అభిరుచిగానే మిన్న! | Classical Singers Priya Sisters On Music Career | Sakshi
Sakshi News home page

Priya Sisters: ఆదాయం కన్నా.. అభిరుచిగానే మిన్న!

Jul 5 2024 7:33 AM | Updated on Jul 5 2024 7:33 AM

Classical Singers Priya Sisters On Music Career

మ్యూజిక్‌ కెరీర్‌పై శాస్త్రీయ గాయనీమణులు ప్రియా సిస్టర్స్‌

సాక్షి, సిటీబ్యూరో: ‘సంగీతంలో రాణించాలని అనుకోవడం మంచిదే. అయితే అదే సమయంలో చదువును ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు’ అంటున్నారు ప్రియా సిస్టర్స్‌. ఉన్నత చదువులు చదివి ఆ తర్వాత శాస్త్రీయ సంగీతంలో లబ్ధప్రతిష్టులుగా పేరొందిన అచ్చతెలుగు అక్కా చెల్లెళ్లు హరిప్రియ, షణ్ముఖ ప్రియలు వేల సంఖ్యలో కచేరీలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంలో పుట్టి అద్భుతమైన గానామృతాన్ని పంచుతూ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు మహిళ ప్రతిభను చాటారు. శ్రీ వాసవీ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో నగరంలోని రవీంద్రభారతిలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో సంభాషించారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే...

జన్మ ధన్యమైన సందర్భాలెన్నో... 
‘జీవనసాఫల్య పురస్కారం అందుకుంటున్న సందర్భంగా మా జీవితం ధన్యమైంది అనకున్న సందర్భాలను మననం చేసుకోవాలంటే ఎన్నో ఉన్నాయి.. పుట్టపర్తి సాయిబాబా గారి ముందు కచేరీ నిర్వహించడమే కల సాకారం అవడం అనుకుంటే, కచేరీ ముగిశాక మరోసారి ఓ కీర్తన ఆలపించమంటూ ప్రత్యేకంగా అడగడం... అలాగే శాస్త్రీయ సంగీతంలో వశిష్టుడు అని చెప్పదగ్గ స్వర్గీయ సుబ్బుడు (పి.వి.సుబ్రహ్మణ్యం)... మా సిస్టర్స్‌ని అనేక రకాలుగా ప్రశంసిస్తూ.. ట్రాన్సిస్టర్స్‌ అంటూ గొప్పగా అభివరి్ణంచడం... కంచి పరమాచార్య గారిని వ్యక్తిగతంగా కలిసి ఆయన ముందు పాడడం, ఆయన  ప్రసాదం ఇవ్వడం...ఇలాంటివెన్నో ఉన్నాయి. ఇంకా జన్మ ధన్యం కావాల్సిన సందర్భాలు ఎన్నో రానున్నాయనే అనుకుంటాం’.

సినిమా తాపత్రయం లేదు... 
శాస్త్రీయ సంగీతానికి తనదైన ప్రత్యేకత ఉంది. దానికే పరిమితమైన మేం సినిమా సంగీతంతో మమేకం కాలేదు.. కాలేం కూడా. మూడు నాలుగు సినిమాల్లో పాటలు పాడామంటే ఆయా సినిమాల రూపకర్తలకు ఆ పాటకు మా గాత్రం నప్పుతుందని మమ్మల్ని సంప్రదించడం వల్లే తప్ప సినిమా అవకాశాల గురించి మేం ఎప్పుడూ ఆలోచించలేదు. ఇక సినిమా నటన గురించి అంటే... చాలాకాలం క్రితం కె.బాలచందర్‌ గారు నన్ను (హరిప్రియ) సింధుబైరవి సీక్వెల్‌ సినిమా తీస్తున్న సందర్భంలో ఓ పాత్రకు అడిగారు. అయితే ఎందుకో అది కుదరలేదు.

పాపులారిటీ సరే... లాంగ్విటీ కూడా అవసరమే... 
సాంకేతిక విప్లవం పుణ్యమాని పాపులారిటీ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు. అయితే షార్ట్‌ టర్మ్‌ పాపులారిటీ కన్నా దీర్ఘకాలం పాటు నిరూపించుకునే స్థిరత్వం ముఖ్యం. ప్రస్తుతం యువ కళాకారులకు శిక్షణ ఇస్తున్నాం. 2, 3 ఏళ్లలో అకాడమీని స్థాపించాలని అనుకుంటున్నాం. మా పిల్లల్లో ఎవరూ మా వారసులుగా రావాలని అనుకోవడం లేదు. మేం ఒత్తిడి చేయడం లేదు. మా చివరి శ్వాస వరకూ కచేరీలు ఇస్తూనే ఉండాలి.. భావి తరాలకు శాస్త్రీయ సంగీతం పంచాలని తప్ప...వేరే కలలు, లక్ష్యాలు అంటూ ఏమీ లేవు.

నా మనసు పాటనే ఎంచుకుంది..
నేను (హరిప్రియ) చిన్న వయసులో క్రికెటర్‌గా జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా ఆడాననేది నిజమే. అలాగే మరోవైపు శాస్త్రీయ సంగీతంలోనూ రాణిస్తున్న ఆ సమయంలో ఏ రంగం ఎంచుకోవాలి? అనే ప్రశ్న వేసుకున్నప్పుడు నా మనసు పాట వైపే మొగ్గింది. నేడు మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరగడం చూస్తున్నా...అది ఆనందాన్నిస్తోంది. నా చిన్నప్పుడు ఇలాంటి పరిస్థితే ఉన్నా సంగీతాన్నే కెరీర్‌గా ఎంచుకునేదాన్ని తప్ప క్రికెట్‌ను కాదనేది నిజం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement