ఏకంగా 200కు పైగా ఏటీఎం మెషీన్లు హ్యాక్‌!!

City Police Nabbed Three ATM Gangs In Past Two Years     - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగర పోలీసులు గడచిన రెండేళ్లలో మూడు ‘ఏటీఎం గ్యాంగు’ల్ని పట్టుకున్నారు. హరియాణా– రాజస్థాన్‌ ప్రాంతాలకు చెందిన వీరంతా డబ్బు డ్రా చేసిన సమయంలో మెషీన్‌ను ఆపేసి కథ నడిపారు. ఢిల్లీకి చెందిన ఓ గ్యాంగ్‌ మాత్రం వీటిని తలదన్నేలా వ్యవహరించింది. ఏకంగా 200కు పైగా ఏటీఎం మెషీన్లను హ్యాక్‌ చేసి పని కానిచ్చింది. అయిదుగురిని పట్టుకున్న ఘజియాబాద్‌ పోలీసులు ఈ ముఠాకు సాంకేతిక సహకారం హైదరాబాద్‌కు చెందిన కమల్‌ అందించినట్లు గుర్తించారు. దీంతో ఇతడి కోసం గాలిస్తూ ఓ ప్రత్యేక బృందాన్ని సిటీకి పంపారు.  

నలుగురు సభ్యులతో ముఠా.. 
ఉత్తరప్రదేశ్‌లోని బాండ జిల్లాకు చెందిన షానవాజ్‌ అలీ బ్యాచులర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (బీసీఏ) పూర్తి చేసి ఢిల్లీలో స్థిరపడ్డాడు. ఇతడికి 2015లో పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి చెందిన జమీర్‌ షేక్‌తో పరిచయమైంది.  అప్పట్లో నలుగురు సభ్యులతో ఓ ముఠాను కలిగి ఉన్న జమీర్‌ ఉత్తరాఖండ్‌తో పాటు యూపీ, గుజరాత్, మహారాష్ట్రల్లో ఏటీఎంలను హ్యాక్‌ చేయడం ద్వారా తెరిచి అందులోని డబ్బు కాజేశారు. షానవాజ్‌ అయిదో మెంబర్‌ అయ్యాడు. అప్పట్లో హ్యాకింగ్‌కు అవసరమైన కోడ్‌ను వీరికి జార్ఖండ్‌లోని జామ్‌తారకు చెందిన వారు అందించారు. ఉత్తరాఖండ్‌లో వరుసపెట్టి నేరాలు చేసిన ఈ ముఠాను ఆ ఏడాది సెప్టెంబర్‌లో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పట్టుకుంది.  ఈ కేసులో బెయిల్‌ పొంది బయటకు వచ్చిన షానవాజ్‌ తానే గ్యాంగ్‌ ఏర్పాటు చేశాడు. ఇందులో ముంబైకి చెందిన జమీర్‌ షేక్‌ (కోడింగ్‌ డిప్లొమా చదివాడు), సాగిర్, మహ్మద్‌ ఉమర్, మెహ్‌రాజ్‌ (బీసీఏ గ్రాడ్యుయేట్‌) సభ్యులుగా ఉన్నారు. 

సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఏర్పాటు 
ఈ ముఠా కొత్త ఏటీఎంనూ హ్యాక్‌ చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి హైదరాబాద్‌ వాసి కమల్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇతగాడు ఢిల్లీ వెళ్లిన సందర్భంలో అక్కడి ఓ పబ్‌లో వీరికి పరిచయమయ్యాడు.  కమల్‌ డార్క్‌ నెట్‌ నుంచి ఏటీఎం మెషీన్ల హ్యాకింగ్‌ మాల్‌వేర్‌ సమకూర్చుకున్నాడు. దీన్ని యూఎస్‌బీ డ్రైవ్‌లో వేసి షానవాజ్‌కు అందించాడు. ఈ డ్రైవ్‌ను మిషన్‌కు అనుసంధానించే ముఠా అందులోకి మాల్‌వేర్‌ పంపేది. దీని ప్రభావంతో ఆ మెషీన్‌ ప్రధాన సర్వర్‌తో సంబంధాలు కోల్పోయేది. అదే సమయంలో ఈ మాల్‌ వేర్‌ ఓ కోడ్‌ను సృష్టించి కమల్‌ పొందుపరిచిన మెయిల్‌ ఐడీకి చేరవేసేది. హైదరాబాద్‌లోనే ఉండి దాన్ని అధ్యయనం చేసే ఇతగాడు పాస్‌వర్డ్‌గా మార్చి షానవాజ్‌ గ్యాంగ్‌కు ఫోన్‌లో చెప్పేవాడు. దీన్ని ఎంటర్‌ చేయడం ద్వారా ముఠా మెషీనన్‌ రీబూట్‌ అయ్యేలా చేస్తారు. ఆ సమయంలో డబ్బు డ్రా చేయడంతో అది ఖాతాదారుడి లెక్కల్లోకి రాదు. ఈ పంథాలో షానవాజ్‌ గ్యాంగ్‌ ఢిల్లీ, యూపీ, ఘజియాబాద్‌ల్లో కొన్నాళ్లుగా 200 ఏటీఎంలను కొల్లగొట్టింది. ఇలా కాజేసినదాంట్లో కమల్‌కు 5% ముట్టేది. వీరి కోసం ఘజియాబాద్‌ పోలీసులు 5 నెలల క్రితం స్వాట్‌ టీమ్‌ను రంగంలోకి దింపారు. 

హైదరాబాద్‌లో ఉన్నాడని.. 
మూడు నెలల క్రితం నోయిడాలో వీరికి చిక్కిన షానవాజ్‌ లంచం ఎర చూపి తిప్పించుకున్నాడు. రూ.20 లక్షల నగదుతో పాటు ఎస్‌యూవీ వాహనాన్ని స్వాట్‌ టీమ్‌కు ఇచ్చాడు. ఆ తర్వాత తన ముఠాతో కలిసి కొన్ని నేరాలు చేశాడు.  గత నెల ఆఖరి వారంలో ఘజియాబాద్‌ సైబర్‌ సెల్‌ పోలీసులు షానవాజ్‌ సహా అయిదుగురిని పట్టుకున్నారు. వీరి విచారణలోనే నోయిడా ఉదంతం బయటపడింది. దీంతో స్వాట్‌ టీమ్‌కు చెందిన ఇద్దరిని ఘజియాబాద్‌ పోలీసులు విధుల నుంచి తొలగించారు.  షానవాజ్‌ను లోతుగా విచారించిన సైబర్‌ సెల్‌ కమల్‌ వ్యవహారం గుర్తించింది. అతడు హైదరాబాద్‌లో ఉన్నాడని తేలడంతో ప్రత్యేక బృందాన్ని పంపింది. ఈ ముఠా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఈ పంథాలో ఏటీఎంల నుంచి డబ్బు డ్రా చేసినట్లు వెల్లడైంది.   

(చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్‌​ అన్‌లాక్‌ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top