Chikoti Praveen On Thailand Gambling Issue - Sakshi
Sakshi News home page

నేను నిర్దోషిని.. దేవ్, సీతలు పిలిచారనే వెళ్లా.. థాయ్‌ పేకాట వ్యవహారంపై చికోటి స్పందన

May 3 2023 7:03 AM | Updated on May 3 2023 8:29 AM

Chikoti Praveen On Thailand Gambling Issue - Sakshi

దేవ్, సీతల నుంచి ఆహ్వానం అందితేనే థాయ్‌లాండ్‌కు.. 

సాక్షి, హైదరాబాద్‌: చీకోటి ప్రవీణ్‌ సహా 84 మంది భారతీయుల అరెస్టుకు కారణమైన థాయ్‌లాండ్‌లోని అక్రమ క్యాసినోలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై అక్కడి పోలీసులు స్పష్టత ఇచ్చారు. గత నెల 27 నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు రూ.50 కోట్ల టర్నోవర్‌ జరిగినట్లు తేల్చారు. ఈ మేరకు చోన్బూరీ ప్రావిన్స్‌ పోలీసు చీఫ్‌ కంపోన్‌ లీలప్రపపోన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఏడు అంతస్తుల్లో విస్తరించిన ఆసియా హోటల్లో మొత్తం 300 గదులు ఉన్నాయి. గత నెల 27న కొన్ని రూముల్లోకి దిగిన 84 మంది ఆ హోటల్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో వెలసిన అక్రమ జూదగృహంలో పేకాట, స్నూకర్‌ ఆడుతున్నారు. గేమింగ్‌ చిప్స్‌తో  లావాదేవీలు జరుగుతుండగా ఆ వివరాలను 40 గేమింగ్‌ క్రెడిట్‌ పుస్తకాల్లో నమోదు చేస్తున్నారు. నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల లావాదేవీలు వాటిలో నమోదైనట్లు చోన్బూరీ పోలీసులు గుర్తించారు.  

చికోటి స్పందన.. థాయిలాండ్‌ వ్యవహారంపై చికోటి ప్రవీణ్‌ మంగళవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు దేవ్, సీత అనే వ్యక్తుల నుంచి ఫోకర్‌ టోర్నమెంట్‌ ఉందని ఆహ్వానం అందితేనే థాయ్‌లాండ్‌ వచ్చానని పేర్కొన్నారు. ఇక్కడ గ్యాంబ్లింగ్‌ నిషేధం అనే విషయం తనకు తెలియదని, ఆ అక్రమ క్యాసినో నిర్వాహకుడిని తాను కాదన్నారు. తన నిర్దోషిత్వాన్ని థాయ్‌ పోలీసుల ఎదుట నిరూపించుకున్నట్లు చెప్పారు. సదరు హాల్లోకి తాను అడుగు పెట్టిన పది నిమిషాలకే పోలీసులు దాడి చేశారన్నారు. 

హైదరాబాద్‌లో స్ట్రీమ్‌ అయ్యేలా: అక్రమంగా నడుస్తున్న ఈ పేకాట శిబిరంపై అక్కడి పోలీసులకు అదే హోటల్‌లో బస చేసిన ఓ గోవా వాసి ద్వారా సమాచారం అందింది. హోటల్‌పై దాడి చేసిన పోలీసులు అందులో నాలుగు పేకాట టేబుళ్లు, మూడు పోకర్‌ టేబుళ్లు ఉన్నట్లు గుర్తించారు. 16 మంది మహిళల సహా 84 మంది భారతీయులు, థాయ్‌లాండ్‌కు చెందిన నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలను పట్టుకున్నారు. వీరిలో చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి సహా అనేక మంది తెలుగు వాళ్లు ఉన్నారు. వీరందరికీ థాయ్‌లాండ్‌ కోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. పూచీకత్తుగా 4,500 బాట్స్‌ (దాదాపు రూ.11వేలు) చెల్లించాలని ఆదేశించింది.

ఈ తతంగమంతా పూర్తి చేసుకుని, పాస్‌పోర్టులు పొందిన తర్వాత భారతీయులంతా తిరిగి రానున్నారు. అయితే... ఆ పేకాట శిబిరంలో 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు వాటిని ఇంటర్‌నెట్‌తో అనుసంధానించారు. ఆ లైవ్‌ ఫీడ్‌ హైదరాబాద్‌లో స్ట్రీమ్‌ అయ్యేలా ఏర్పాటుచేసినట్లు చోన్బూరీ పోలీసులు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి అక్రమ ఈవెంట్లు భారీ పెట్టుబడితో ముడిపడి ఉంటాయి. ఈ నేపథ్యంలోనే నిర్వాహకులు నగదు కోసం ఫైనాన్షియర్లను ఆశ్రయిస్తుంటారు. అలాంటి ఫైనాన్షియర్‌ కోసమే ఈ క్యాసినో లైవ్‌ స్ట్రీమింగ్‌ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఆ హామీ మాకెందుకు ఇవ్వరు?: కేటీఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement