మాయమవుతున్న రూ.కోట్ల విలువైన పీడీఎస్‌ బియ్యం 

Chairman of Civil Supplies Corporation random inspection - Sakshi

ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో ఇష్టారాజ్యం 

మెదక్‌లో రూ.3 కోట్ల విలువైన 18 లారీల బియ్యం గాయబ్‌ 

పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ ఆకస్మిక తనిఖీలో వెల్లడి 

విజిలెన్స్‌ తనిఖీల్లోనూ బహిర్గతమవుతున్న వైనం 

ఎఫ్‌సీఐ గోదాముల నుంచే మొదలవుతున్న అక్రమాలు 

కాంట్రాక్టర్లు, మిల్లర్లు కుమ్మక్కు..దారి మళ్లుతున్న లారీలు 

సాక్షి, హైదరాబాద్‌/మెదక్‌: ‘మెదక్‌లోని పౌరసరఫరాల సంస్థ మండల స్థాయి స్టాక్‌ (ఎంఎల్‌ఎస్‌) పాయింట్‌కు ఎఫ్‌సీఐ నుంచి వచ్చిన బియ్యంలో 362 టన్నుల మేర తేడా వచ్చింది. అంటే రూ.3 కోట్ల విలువైన 18 లారీల బియ్యం లెక్క దొరకడం లేదు. వీటితో పాటు 700 బేల్స్‌ గన్నీ బ్యాగులు లేవు. 320 టన్నుల ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్స్‌ (ఎఫ్‌ఆర్‌కే) చెడిపోయాయి.

మొత్తంగా ఈ మెదక్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో జరిగిన అక్రమాల విలువ సుమారు రూ.6 కోట్లు. ఆకస్మిక తనిఖీలో ఈ విషయాలు బహిర్గతమయ్యాయి..’పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ సోమవారం రాష్ట్ర స్థాయి అధికారుల వాట్సాప్‌ గ్రూప్‌లో స్వయంగా పోస్ట్‌ చేసిన వివరాలు ఇవి. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో వ్యక్తిగతంగా తనిఖీలు నిర్వహించి శుక్రవారంలోగా నివేదిక ఇవ్వాలని ఆయన ఆ మెసేజ్‌లో స్పష్టం చేశారు.  

నిఘా కరువు..రికార్డుల్లేవు 
రైస్‌ మిల్లుల నుంచి సీఎంఆర్‌ కింద బియ్యం ఎఫ్‌సీఐ గోడౌన్‌లకు చేరతాయి. ఇక్కడి నుంచి ప్రజా పంపిణీ పథకం (పీడీఎస్‌) కింద ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు వెళతాయి. అక్కడి నుంచే జిల్లాల్లోని అన్ని రేషన్‌ దుకాణాలకు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు సరఫరా అవుతాయి. అయితే ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద సరైన నిఘా, రికార్డుల వ్యవస్థ ఉండటం లేదు. రాష్ట్రంలో 171 ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు ఉండగా, చాలాచోట్ల అధికారులు లేరు.

ఔట్‌ సోర్సింగ్‌ కింద నియామకమైన డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (డీఈవో)ల పర్యవేక్షణలో నడుస్తున్నాయి. సెపె్టంబర్‌ 8న సంస్థ చైర్మన్‌ మంచిర్యాల ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను తనిఖీ చేసినప్పుడు రెండేళ్లుగా అక్కడ స్టాక్‌ పాయింట్‌ ఇన్‌చార్జి లేడని, కేవలం డీఈవో ద్వారానే కోట్ల రూపాయల విలువైన బియ్యం పంపిణీ, సరఫరా ప్రక్రియ కొనసాగుతోందని తేలింది. అక్కడున్న 1,520 బ్యాగుల సన్నబియ్యం తినడానికి పనికిరాకుండా పోవడాన్ని కూడా గుర్తించారు.  

గోదాముల నుంచే మొదలు.. 
ఎఫ్‌సీఐ గోదాముల నుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు బియ్యం వచ్చే సమయంలోనూ భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్లతో మిల్లర్లు కుమ్మౖMð్క బియ్యం లోడ్‌లను పక్కదారి పట్టిస్తున్నట్లు ఇప్పటికే పలు సంఘటనల్లో బయటపడింది. గత ఏప్రిల్‌ మొదటి వారంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలంలోని సుద్దాల ఎఫ్‌సీఐ గోదాం నుంచి సుల్తానాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు 5 లారీల్లో బియ్యం పంపించారు. కానీ 420 బస్తాల చొప్పున ఉన్న 3 లారీలు మాత్రమే గోదాంకు చేరాయి. మిగతా 2 లారీలు కాట్నపల్లి వద్ద ఉన్న ఓ రైస్‌ మిల్లులో అన్‌లోడ్‌ అయ్యాయి.

ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ లేఖ ద్వారా తెలియజేశారు. సంస్థ ప్రధాన కార్యాలయానికి సంబంధం లేకుండా పెద్దపల్లిలో సీఎంఆర్‌కు అదనంగా 30 వేల టన్నుల బియ్యం తీసుకున్నట్లు తేలిందని కూడా వివరించారు. ఈ ఘటనపై మరింత లోతైన విచారణ జరపాలని కోరారు. ఇక ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి చౌకధరల దుకాణాలకు బియ్యం పంపించే క్రమంలో కూడా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని స్పష్టమవుతోంది.

ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో కూడా భారీ మొత్తంలో బియ్యం మాయం అవుతున్నాయి. మెదక్‌తో పాటు రామాయంపేట, తూప్రాన్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో 10 వేల క్వింటాళ్లకు పైగా పీడీఎస్, సన్న బియ్యం లెక్క తేలకుండా పోయినట్లు విజిలెన్స్‌ అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఈ స్టాక్‌ పాయింట్ల ఇన్‌చార్జిలపై కేసులు కూడా నమోదయ్యాయి.  

పట్టించుకోని అధికారులు 
తనిఖీల్లో బయటపడుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు పెద్దగా దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు విని్పస్తున్నాయి. 171 ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో కనీసం 150 చోట్ల అక్రమాలు జరుగుతున్నాయని, జిల్లా స్థాయిల్లోని అధికార యంత్రాంగం అండతో బియ్యం య థేచ్ఛగా గాయబ్‌ అవుతున్నాయని సంస్థకు చెందినవారే అంగీకరించడం గమనార్హం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top