మడ్వి హిడ్మా, బార్సే దేవా తల్లులతో భోజనం చేస్తున్న విజయ్‌శర్మ
మావోయిస్టు అగ్ర నేతపై కేంద్రం ఫోకస్
లొంగిపోవాలంటూ హిడ్మాకు రాయబారం
ఆయన అనుచరులతో మాటామంతికీ ప్రయత్నాలు
హిడ్మా, బార్సేదేవా తల్లులతో ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం భేటీ..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వచ్చే ఏడాది మార్చి 31లోగా మావోయిస్టులను దేశం నుంచి సమూలంగా నిర్మూలిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించిన గడువు.. ఇటు మావోయిస్టులు, అటు కేంద్ర ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ఉనికిని ఎలాగైనా నిలుపుకొనేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తుండగా.. ఏదో ఒక రూపంలో సాయుధ పోరాటాలకు ముగింపు పలకడానికి కేంద్ర, పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు అమలు చేస్తున్నాయి.
అందరి కళ్లూ హిడ్మా పైనే..
ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ అడవుల్లో అబూజ్‌మాడ్, ఇంద్రావతి నేషనల్ పార్క్, దక్షిణ బస్తర్ ప్రాంతాలు మావోయిస్టులకు ఒకప్పుడు కంచుకోటగా ఉండేవి. ఆపరేషన్ కగార్ దెబ్బతో అబూజ్‌మాడ్‌లో విప్లవ శక్తులు బలహీనపడగా.. ఇంద్రావతి నేషనల్ పార్కులోనూ గడ్డు పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సరిహద్దు పంచుకుంటున్న దక్షిణ బస్తర్ ప్రాంతంలోనే ఆ పార్టీకి గట్టి పట్టు ఉంది.
ఇక్కడ మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మాతో పాటు పీఎల్‌జీఏ బెటాలియన్ వన్ కమాండ్ బార్సే దేవా మాటువేసి ఉన్నారు. 200 మందికి పైగా సాయుధ మావోయిస్టులు కొందరు కేంద్ర కమిటీ సభ్యులతో పాటు తెలంగాణ కమిటీకి రక్షణ కల్పిస్తున్నారు. దీంతో హిడ్మా, బార్సే దేవాను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో కూంబింగ్ చేపట్టేందుకు ప్రభుత్వాలు కార్యాచరణ సిద్ధం చేశాయి. నిర్బంధం తీవ్రం చేసినా మావోయిస్టుల వైపు నుంచి కనీస స్థాయిలో ప్రతిఘటన లేకపోవడంతో.. కేంద్రం తన వ్యూహాలను మార్చుకున్నట్టు తెలుస్తోంది.
సరిహద్దు దాటేశారు?
మాజీ మావోయిస్టులు సోనూ, ఆశన్న భారీ సంఖ్యలో అనుచరులతో లొంగిపోగా, వీరి పిలుపు మేరకు మరికొందరు మావోయిస్టులు సైతం ఆయుధాలు వదిలి ప్రధాన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఇలా అజ్ఞాత జీవితం వదిలి వచ్చే వారికోసం గడిచిన నెల రోజులుగా దండకారణ్యంలో భద్రతా దళాల గస్తీ తగ్గింది.
ఇదే అదనుగా గెరిల్లా వార్ ఫేర్‌లో ఆరితేరిన హిడ్మా, ఆయన అనుచరులు దండకారణ్యంతో సరిహద్దులు పంచుకునే తెలంగాణ, ఒడిశా, ఏపీలోని ‘సేఫ్ జోన్’కు చేరుకున్నట్టు కేంద్రం సందేహిస్తోంది. దీంతో కర్రెగుట్టలో చేపట్టినట్టు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తరహా చర్యలను దక్షిణ ప్రాంతంలో మరోసారి చేపట్టడంపై కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే, భారీగా అడవులను జల్లెడ పట్టినప్పటికీ ఆశించిన ఫలితాలు ఏ మేరకు అందుతాయనే అంశంపై స్పష్టత కరువైంది.
వ్యూహం మార్చి..
హిడ్మా సొంతూరైన సుక్మా జిల్లాలోని పువ్వర్తిలోకి ప్రభుత్వ దళాలు 2024 ఫిబ్రవరిలో ప్రవేశించాయి. అప్పటి నుంచి ఇటువైపు ప్రభుత్వ పెద్దలెవరూ కన్నెత్తి చూడలేదు. కానీ అనూహ్యంగా ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం హోదాలో హోంశాఖ చూస్తున్న విజయ్‌శర్మ సోమవారం స్వయంగా పువ్వర్తి వెళ్లారు. నల్లప్యాంటుపై తెల్ల అంగీ వంటి సాధారణ వస్త్రధారణ, మెడలో ఎర్ర రంగు రుమాలు ధరించిన ఆయన స్థానికులతో మమేకమయ్యారు.
ఆ గ్రామంలో ఉన్న హిడ్మా, బార్సే దేవా తల్లులతో మాటామంతీ జరిపారు. లొంగిపోవాలని హిడ్మా, దేవాకు వారి తల్లులతోనే స్వయంగా పిలుపునిప్పించారు. తద్వారా ఛత్తీస్‌గఢ్‌లో కాకపోయినా మరో చోటైనా సరే సాయుధ పోరాట పంథా నుంచి విప్లవ నాయకులు పక్కకు తప్పుకునేలా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ సరికొత్త వ్యూహం ఏ మేర సానుకూల ఫలితం అందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


