
కౌంటర్‌లోనూ దర్యాప్తు సంస్థ ఈ విషయం వెల్లడించింది
అయినా ప్రభుత్వం తాత్సారం చేయడం తగదు
సీబీఐ విచారణ కోరుతూ 12 ఏళ్ల క్రితమే వ్యాజ్యాలు
హైకోర్టులో పిటిషనర్ల తరఫు న్యాయవాది గండ్ర వాదనలు
సాక్షి, హైదరాబాద్: ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్(ఐఎంజీబీపీఎల్)కు అక్రమంగా భూముల కేటాయింపుపై దర్యాప్తునకు సీబీఐ సిద్ధంగా ఉందని, అదే విషయాన్ని ఆ సంస్థ దాఖలు చేసిన కౌంటర్‌లోనూ పేర్కొందని హైకోర్టుకు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు తెలిపారు. అయినా ప్రభుత్వం తాత్సారం చేయడం సరికాదన్నారు. దేశంలో 2003లో జరిగిన అతిపెద్ద భూకుంభకోణం ఇదని.. దీనిపై సీబీఐ విచారణ కోరుతూ పిటిషనర్లు వ్యాజ్యాలు దాఖలు చేసి దాదాపు 12 ఏళ్లు గడిచిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
రూ.వేల కోట్ల విలువైన (నేటి విలువ ప్రకారం దాదాపు రూ.లక్ష కోట్లు) హైదరాబాద్ పరిధిలో రెండుచోట్ల 850 ఎకరాల ప్రభుత్వ భూములను కారుచౌకగా ఓ బోగస్ కంపెనీకి కేటాయించారని, ఆ కంపెనీకి వందల కోట్ల రాయితీలు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్‌లోని స్టేడియాలు అప్పగించారని.. దీని వెనుక నాటి రాజకీయ పెద్దలు(చంద్రబాబు ప్రభుత్వం) ఉన్నారని, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్, న్యాయవాది శ్రీరంగారావు హైకోర్టులో 2012లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. నాటి నుంచి వీటిపై విచారణ సాగుతూ ఉంది.
ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం మరోసారి ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున గండ్ర వాదనలు వినిపిస్తూ.. ‘సుప్రీంకోర్టులో ఐఎంజీబీపీఎల్ దాఖలు చేసిన అప్పీల్‌కు, ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాలకు ఎలాంటి సంబంధం లేదు. ఐఎంజీబీపీఎల్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఇంకా లిస్ట్ కాలేదు. ఒకవేళ లిస్ట్ అయినా దానితో ఈ వ్యాజ్యాల విచారణకు ఎలాంటి ఆటంకం రాదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసమంటూ, సుప్రీంకోర్టులో అప్పీల్ అంటూ ఈ ఏడాదిలోనూ పదిసార్లు ఈ వ్యాజ్యాలు వాయిదా పడ్డాయి. విచారణ చేపట్టాలి’అని కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. రెండు వారాలు వేచిచూసి విచారణ చేపడతామంటూ.. ఈ నెల 29కి వాయిదా వేసింది.