breaking news
IMG Scam
-
ఐఎంజీ భూములపై దర్యాప్తునకు సీబీఐ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్(ఐఎంజీబీపీఎల్)కు అక్రమంగా భూముల కేటాయింపుపై దర్యాప్తునకు సీబీఐ సిద్ధంగా ఉందని, అదే విషయాన్ని ఆ సంస్థ దాఖలు చేసిన కౌంటర్లోనూ పేర్కొందని హైకోర్టుకు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు తెలిపారు. అయినా ప్రభుత్వం తాత్సారం చేయడం సరికాదన్నారు. దేశంలో 2003లో జరిగిన అతిపెద్ద భూకుంభకోణం ఇదని.. దీనిపై సీబీఐ విచారణ కోరుతూ పిటిషనర్లు వ్యాజ్యాలు దాఖలు చేసి దాదాపు 12 ఏళ్లు గడిచిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రూ.వేల కోట్ల విలువైన (నేటి విలువ ప్రకారం దాదాపు రూ.లక్ష కోట్లు) హైదరాబాద్ పరిధిలో రెండుచోట్ల 850 ఎకరాల ప్రభుత్వ భూములను కారుచౌకగా ఓ బోగస్ కంపెనీకి కేటాయించారని, ఆ కంపెనీకి వందల కోట్ల రాయితీలు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్‌లోని స్టేడియాలు అప్పగించారని.. దీని వెనుక నాటి రాజకీయ పెద్దలు(చంద్రబాబు ప్రభుత్వం) ఉన్నారని, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్, న్యాయవాది శ్రీరంగారావు హైకోర్టులో 2012లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. నాటి నుంచి వీటిపై విచారణ సాగుతూ ఉంది. ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం మరోసారి ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున గండ్ర వాదనలు వినిపిస్తూ.. ‘సుప్రీంకోర్టులో ఐఎంజీబీపీఎల్ దాఖలు చేసిన అప్పీల్‌కు, ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాలకు ఎలాంటి సంబంధం లేదు. ఐఎంజీబీపీఎల్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఇంకా లిస్ట్ కాలేదు. ఒకవేళ లిస్ట్ అయినా దానితో ఈ వ్యాజ్యాల విచారణకు ఎలాంటి ఆటంకం రాదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసమంటూ, సుప్రీంకోర్టులో అప్పీల్ అంటూ ఈ ఏడాదిలోనూ పదిసార్లు ఈ వ్యాజ్యాలు వాయిదా పడ్డాయి. విచారణ చేపట్టాలి’అని కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. రెండు వారాలు వేచిచూసి విచారణ చేపడతామంటూ.. ఈ నెల 29కి వాయిదా వేసింది. -
ఐఎంజీ కేసులో బాబుపై చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: మరోసారి ఐఎంజీ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. కోట్లాది రూపాయల విలువైన భూముల్ని అప్పటి ఉమ్మడి ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు ఐఎంజీ భరత(ఐఎంజీబీ) ప్రైవేట్ లిమిటెడ్‌కు కట్టబెట్టారని, ఈ వ్యవహారంలో చంద్రబాబు, కంపెనీపై ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీకి న్యాయవాది ఇమ్మనేని రామారావు వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండగా అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఐఎంజీ పేరిట కాగితాలకే పరిమితమైన కంపెనీకి సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూములుసహా 850 ఎకరాలు కారుచౌకగా ఇచ్చారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కోట్లాది రూపాయల విలువైన 850 ఎకరాలను ఐఎంజీ–భరత కంపెనీకి ఇవ్వడం వెనుక కుట్ర, మోసం, అధికార దుర్వినియోగం, అవినీతి ఉందని ఆయన ఆరోపించారు. ఇందుకు కీలక పాత్రధారి అయిన అప్పటి ఉమ్మడి ఏపీ ఆపద్ధర్మ సీఎం, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు తనకు సన్నిహితుడైన అహోబిలరావు (బిల్లీరావు), ఆయన సోదరుడు ప్రభాకరరావు(ప్యాట్రో)లకు చెందిన ఐఎంజీబీ కంపెనీకి అప్పనంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించారని వివరించారు. భూముల రిజిస్ట్రేషన్లకు కూడా చంద్రబాబు ప్రభుత్వం రాయితీలు ఇచ్చిందని, చంద్రబాబు బినామీ కంపెనీలకు భూములు ఇచ్చారని, ఇందుకు కారణమైన ఆ ముగ్గురిని ప్రాసిక్యూట్ చేయాలని కోరారు. కేవలం 8 రోజుల కంపెనీకి, రూ.5 లక్షల షేర్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కోట్లాది రూపాయల హైదరాబాద్ భూముల్ని ఇచ్చేసే కుట్రకు కారణమైనవారిని వదిలిపెట్టడానికి వీల్లేదన్నారు. ఆ ఇద్దరూ చంద్రబాబుకు సన్నిహితులు ఆగస్టు 5వ తేదీ 2003లో ఐఎంజీబీని రిజిస్ట్రేషన్ చేశారని, అప్పుడు షేర్ క్యాపిటల్ కేవలం రూ.5 లక్షలు మాత్రమేనని, ఈ కంపెనీ అధిపతులుగా చెప్పుకునే బిల్లీరావ్, ప్యాట్రోలు ఇద్దరూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులని ఇమ్మనేని తెలిపారు. క్రీడలకు చెందిన అంతర్జాతీయ కంపెనీ ఐఎంజీకి అనుబంధ కంపెనీగా ఐఎంజీబీని పేర్కొన్నారని, నిజానికి ఐఎంజీకి ఐఎంజీబీలకు ఏమాత్రం సంబంధం లేదని, ఇదే విషయాన్ని ఫ్లోరిడాలో ఉండే ఐఎంజీ వెల్లడిం చిందని తెలిపారు. తప్పుడు పత్రాలు, ఫోర్జరీలతో మోసం చేసిన ఆ చంద్రబాబు, బిల్లీరావు, ప్యాట్రోలను విచారించాలని, వీరిపై ఐపీసీలోని 420, 406, 408, 468,471, 120 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని, రిజిస్ట్రేషన్ చట్టంలోని 82, 83 సెక్షన్ల ప్రకారం వారిపై చర్యలు తీసుకునే అధికారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి ఉందని పేర్కొన్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక వ్యవహారాల్లో రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని, అందుకు అనుగుణంగా ఐఎంజీబీ పేరిట రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ అధికారులు చేసిన 850 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఇమ్మనేని తన వినతిపత్రంలో పేర్కొన్నారు. -
'చిల్లర వ్యవహారాలు మానుకోండి'
విశాఖపట్నం: జయలలితకు పడిన శిక్ష వైఎస్ జగన్ కు పడుతుందనడం అవగాహనారాహిత్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్థసారథి అన్నారు. రాజ్యాంగపరమైన పదవులు జగన్ అనుభవించలేదని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు జగన్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. చిల్లర వ్యవహారాలు పక్కనపెట్టి ప్రజలకు సరైన పాలన అందించాలని సూచించారు. ఐఎంజీ తదితర కేసుల్లో ప్రాథమిక ఆధారాలతో విజయమ్మ కోర్టును ఆశ్రయిస్తే చంద్రబాబు భయపడి కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని తెలిపారు. సీబీఐ లేదా అలాంటి సంస్థలతో దర్యాప్తు చేయించుకుని క్లీన్చిట్ ఎందుకు తెచ్చుకోలేదని పార్థసారథి ప్రశ్నించారు.