అందోల్‌, జోగిపేట చైర్మన్‌ను దింపేద్దాం..

BRS Leaders No Confidence Motion On Andole Jogipet Municipal Chairman - Sakshi

సాక్షి, జోగిపేట(అందోల్‌): సంగారెడ్డి జిల్లాలోని అందోల్‌–జోగిపేట మున్సిపాలిటీ రాజకీయాలు ఊహించని విధంగా రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మున్సిపల్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌లపై సొంత పార్టీ (బీఆర్‌ఎస్‌)కి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. దీనిపై శనివారం కలెక్టరేట్‌ కార్యాలయంలో నోటీసును అందజేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

శనివారం ఉదయం 11 మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు తమ కుటుంబ సభ్యులతో కలసి చిట్కుల్‌లోని చాముండేశ్వరీ అమ్మవారి ఆలయం ఆవరణలో సమావేశమయ్యారు. చైర్మన్, వైస్‌చైర్మన్‌ల వ్యవహారశైలిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, వారిని పదవిలో నుంచి దింపేయాలని తీర్మానించారు. అక్కడ నుంచి నేరుగా సంగారెడ్డి కలెక్టరేట్‌కు వెళ్లారు. అక్కడ కలెక్టర్‌ లేకపోవడంతో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డిని కలిశారు. ఆయన సూచన మేరకు ఇన్‌వార్డులో అవిశ్వాస తీర్మానం నోటీసును అందించారు. అక్కడి ఉద్యోగులు సోమవారం వచ్చి కలెక్టర్‌ను కలవాలని సూచించడంతో నోటీసు అందించి వెనుదిరిగారు.  

మెజారిటీ కౌన్సిలర్ల వ్యతిరేకత 
అందోల్‌ – జోగిపేట మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులున్నాయి. ఇందులో 14 మంది బీఆర్‌ఎస్, ఆరుగులు కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఉన్నారు. ప్రస్తుతం వీరిలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు చైర్మన్‌ను వ్యతిరేకిస్తున్నారు. రోజూ చైర్మన్‌ వెంట ఉండే కౌన్సిలర్లు సైతం బహిరంగంగా చైర్మన్‌ తీరుపై విమర్శలు చేయడం విశేషం. కాగా, ఈ పరిణామంపై ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top