
ఖమ్మం జిల్లా: నాలుగేళ్ల బాలిక పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేస్తే మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసిన తహసీల్ ఉద్యోగుల తీరు విమర్శలకు తావిచ్చింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి ఉపేందర్ – మమత దంపతుల నాలుగేళ్ల కుమార్తెకు జనన ధ్రువీకరణ పత్రం కావాలని గతేడాది డిసెంబర్ 17న తహసీల్‌లో దరఖాస్తు ఇచ్చారు. నాటి నుంచి తిరుగుతుండగా రకరకాల సాకులు చెప్పిన ఉద్యోగులు.. ఎట్టకేలకు ఈనెల 4వ తేదీన సర్టిఫికెట్ జారీ చేశారు.
కానీ అది డెత్ సర్టిఫికెట్ కావడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఉద్యోగి తప్పుగా వచ్చిందంటూ దాన్ని వెనక్కి తీసుకుని చించేశారు. ఆపై బర్త్ సర్టిఫికెట్ ఇచ్చినా అందులో సరైన వివరాలు లేకపోవడంతో ప్రశ్నించగా.. ఆ ఉద్యోగి ‘సర్టిఫికెట్ ఇవ్వడమే ఎక్కువ.. మళ్లీ ప్రశి్నస్తారా’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడని ఉపేందర్ తెలిపాడు. ఈ ఘటనపై తహసీల్దార్ రవికుమార్ స్పందిస్తూ, విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, సరైన పత్రం జారీ చేస్తామని తెలిపారు.