పేదింటికి కలెక్టరచ్చిండు... పిల్లగాన్ని చదుకోనికి నిద్ర లేపిండు | Bhuvanagiri Collector Hanumantha Rao Unexpected Visit To Student Home | Sakshi
Sakshi News home page

పేదింటికి కలెక్టరచ్చిండు... పిల్లగాన్ని చదుకోనికి నిద్ర లేపిండు

Feb 6 2025 3:40 PM | Updated on Feb 6 2025 4:24 PM

Bhuvanagiri Collector Hanumantha Rao Unexpected Visit To Student Home

తెల్లారింది లేవండోయ్ కొక్కురోకో !!

పదోక్లాస్ పిల్లలను నిద్ర లేపుతున్న యాదాద్రి కలెక్టర్ హనుమంత రావు

అప్పుడే తెల్లారుతోంది...కోళ్లు కూస్తున్నాయి... సూరీడు రాలేదు.. ఇంకా మంచు తెరలు తొలగనే లేదు. ఆ చిన్న  ఊళ్ళోకి పెద్ద కారొచ్చింది. ఇంత చిన్న పల్లెలోకి ఇంత పొద్దుగాల ఎవరచ్చిర్రా అని తెల్లారి పొలం పనులకు వెళ్ళే రైతులు..నీళ్ళకోసం బావులవద్దకు వెళ్ళే మహిళలు విస్తుపోయి చూస్తున్నారు. కార్లోంచి టిప్ టాప్ గా దిగిన ఒక ఆఫీసర్ ఆ ఊళ్ల పదోక్లాస్ చదూతున్న పిల్లవాడు ఇంటికి వెళ్ళి.. టక్.. టక్ అని డోర్ కొట్టారు.. ఏందబ్బా ఇంత మబ్బులల్ల 

ఇంటికి ఎవరొచ్చిర్రు.. చుట్టాలు ఇంత వేకువనే వస్తారా... అంటూ పిల్లగాని తల్లి విజయలక్ష్మి తలుపు తీసింది.. ఎదురుగా ఎవరో ఆఫీసర్...అమ్మో ఎవరాయన 

ఇంత ఉదయం ఎందుకు వచ్చాడు అనుకుంటూ విస్తుపోయి చూస్తుండగా ఆయనే ముందుగా మాట్లాడారు...అమ్మా నేను మీ జిల్లా కలెక్టర్ను.. మీ అబ్బాయి భరత్ చంద్ర పదోక్లాస్ చదువుతున్నాడు కదా..ఎలా ఉన్నాడు.. బాగా చదువుతున్నాడా..బాధ్యతగా ఉంటున్నాడా.. పొద్దున్నే మబ్బులల్ల నిద్ర లేపండి..ఉదయాన్నే చదివించండి...పొద్దీకి టీవీలు. ఫోన్లు చూడనివ్వకండి.. పదో క్లాస్ చాలా ముఖ్యం కదమ్మా.. బాగా చదివించండి.. అంటూ ఒక చైర్..ఎగ్జామ్ ప్యాడ్..పెన్నులు వంటివి అందజేశారు..అసలు కలెక్టర్ ఏందీ..తమ ఇంటికి రావడం ఏందీ అని ఆ తల్లి విజయలక్ష్మి నోట మాట రాలేదు..అసలిదంతా ఏమిటి అని ఆమె షాక్ లో ఉండిపోయింది..

 తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు పదోక్లాస్ అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు.ఈ నేపథ్యంలో  టెన్త్ క్లాస్  పిల్లలను ప్రోత్సహించేందుకు.. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివేందుకు పదో క్లాస్ అనేది తొలిమేట్టు అనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియచెప్పేందుకు తానే నడుంబిగాంచారు. అందులో భాగంగా ఆయన సంస్థాన్ నారాయణపురం మండలంలోని కంకణాలు గూడెం గ్రామానికి వెళ్లి తెల్లవారి ఐదు గంటలకే విద్యార్థులు నిద్రలేపే వేకప్ కాల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

ఆ గ్రామంలో పదో క్లాస్ చదువుతున్న పిల్లలు పిల్లలకు వెళ్లి వారు చదువుతున్న తీరు గురించి తల్లిదండ్రులతో ఒక చేసి పిల్లల పట్ల మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. అంతేకాకుండా భరత్ చంద్ర అనే విద్యార్థి ఇంటికి వెళ్లి ఆయన పదవ క్లాస్ పరీక్షలు పూర్తయ్యే వరకు నెలకు రూ.5000 రూపాయలు ఖర్చుల నిమిత్తం తాను చెల్లిస్తానని చెబుతూ.. వెనువెంటనే రూ. 5000 అందజేశారు. అంతేకాకుండా భరత్ ఉన్నత చదువులకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని.. ఆయన జీవితం స్థిరపడేంతవరకు తాను తోడుగా ఉంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. 

తెల్లవారేసరికి గ్రామంలో కలెక్టర్ పర్యటన ఓ విద్యార్థి ఇంట్లో ఆయన కూర్చుని తల్లిదండ్రులతో మాట్లాడడం క్షణాల్లో ఊరంతా పాకేసింది. మన ఊరు అబ్బాయి భరత్ ఇంటికి కలెక్టర్ సాబ్ వచ్చాడంట.. చదువుకోడానికి డబ్బులు ఇచ్చారట.. పెన్నులు కుర్చీ ప్యాడ్ వంటివి ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఆయన ఎంత చదివితే అంత చదివిస్తానని కూడా మాటిచ్చాడంట.. నిజంగా ఇంతలా ప్రోత్సహించే అధికారులు ఉంటే పిల్లలు ఎందుకు చదువుకోరు అంటూ గ్రామస్తులు అబ్బాయి తో పాటు కలెక్టర్ను సైతం అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంత రావు మాట్లాడుతూ విద్యార్థి దశలో పిల్లలు బాధ్యతగా ఉండాలని.. వృధా కాకుండా తెల్లవారు జామునే లేచి చదువుకోవాలని.. అలాంటప్పుడే ఉన్నత స్థానాలకు చేరుతారని ఉద్బోధించారు.. చదువుకునే పిల్లలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చి ముందుకు కదలారు... ఆయన వెళుతున్న వైపే చూస్తూ భరత్... ఆయన తల్లి విజయలక్ష్మి.. చూస్తూ నిలబడిపోయారు. సిమ్మాదిరప్పన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement