గుడ్‌న్యూస్‌! గద్వాల మీదుగా జైపూర్‌కు మరో రైలు

Another train to Jaipur via Gadwala - Sakshi

మహబూబ్‌నగర్‌– విశాఖ రైలు ప్రారంబోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి 

పాలమూరు’కు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ 

రైల్వే స్టేషన్‌లో బీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల పోటాపోటీ నినాదాలు 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: త్వరలోనే కర్నూలు నుంచి గద్వాల మీదుగా జైపూర్‌ వరకు మరో రైలు పరుగులు పెట్టనుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన మహబూబ్‌నగర్‌– విశాఖ రైలును కిషన్‌రెడ్డి.. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శనివారం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ గతంలో జిల్లాకు ప్రధాని  మో­దీ  వచ్చినప్పుడు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించేలా, నిధులు వచ్చేలా కృషి చేయాల­ని కోరారు. రైలు ప్రారంబోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల పోటాపోటీ నినాదాలతో రైల్వేస్టేషన్‌ ప్రాంగణం, పరిసరాలు మార్మోగాయి. 

తెలంగాణలో పంటల బీమా పథకం ఎక్కడ?: కిషన్‌రెడ్డి 
తెలంగాణలో కనీసం పంటల బీమా పథకం అమలు చేయడం లేదని.. ఇక్కడ వర్షాలకు పంటలు నష్టపోతే సాయం చేయకుండా బీఆర్‌ఎస్‌ నాయకులు నాందేడ్‌ వెళ్లి ప్రగల్భాలు పలుకుతున్నారని అని కిషన్‌రెడ్డి విమర్శించారు. మహబూబ్‌నగర్‌ పర్యటనలో భాగంగా శనివారం ఆయన బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

పేదోడికి ఇల్లు కట్టే సోయిలేదు గానీ.. ప్రగతి భవన్, సచివాలయాన్ని రికార్డు సమయంలో కడతారని ఎద్దేవా చేశారు. కేంద్ర నిధుల్లో 42 శాతం వాటా రాష్ట్రాలకు వస్తోందని, రైతులకు పెరిగిన ఎరువుల ధరల భారం పడకుండా రూ.లక్ష కోట్ల సబ్సిడీని ఇస్తోందని ఆయన వివరించారు. ఒక్కో రైతుకు ఎకరాకు ఏడాదికి రూ.18,254 సబ్సిడీ.. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.6 వేల సాయం అందజేస్తోందని వివరించారు. 

దేశ భవిష్యత్‌ కోసమే రూ.2వేల నోట్ల ఉపసంహరణ
‘రూ.2 వేల నోట్ల ముద్రణ 2018 మార్చి 31 నుంచే బంద్‌ అయింది.. ఈ నోటు ఉపసంహరణపై ఎవరూ ఆందోళన చెందొద్దు.. సెపె్టంబర్‌ 30 వరకు బ్యాంకుల్లో బదలాయింపు చేసుకోవచ్చు.. దేశ భవిష్యత్‌ కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది’అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top