
మనోజ్‌కుమార్
కన్వేయర్ బెల్టు సమీపంలో చేపట్టిన తవ్వకాల్లో గుర్తింపు
మృతుడు జేపీ కంపెనీకి చెందిన ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్‌కుమార్‌గా నిర్ధారణ
మృతుడి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేత
సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ ప్రమాదంలో శిథిలాల కింద కూరుకుపోయిన వారిలో మరొకరి మృతదేహం మంగళవారం లభ్యమైంది. మృతుడిని జేపీ కంపెనీకి చెందిన ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్‌కుమార్ (50)గా గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సహాయ బృందాలు మనోజ్‌కుమార్ మృతదేహాన్ని సొరంగం నుంచి బయటకు తీసుకొచ్చాయి. నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని ఆయన కుటుంబానికి అప్పగించారు.
ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆర్డీఓ సురేశ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తరఫున మృతుని కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందించారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో మనోజ్‌కుమార్ స్వగ్రామం యూపీలోని ఉన్నావ్ జిల్లా బంగార్మావ్ గ్రామానికి తరలించారు. మనోజ్‌కుమార్ 2009 నుంచి జేపీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య స్వర్ణలత, కుమార్తె శైలజ (24), కుమారుడు ఆదర్శ్ (17) ఉన్నారు.
ఎక్స్‌కవేటర్ ద్వారా తవ్వకాలతో మృతదేహం బయటకు..
సొరంగంలోని 14వ కి.మీ. సమీపంలో ఫిబ్రవరి 22న పైకప్పు కూలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఇంజనీర్లలో 8 మంది ఆచూకీ గల్లంతవడం తెలిసిందే. రంగంలోకి దిగిన సహాయక బృందాలు ఈ నెల 9 ఒక మృతదేహాన్ని (గురుప్రీత్‌సింగ్) వెలికితీయగా డీ2 ప్రాంతానికి సుమారు 190 మీటర్ల దూరంలో వెనక వైపు, కన్వేయర్ బెల్టుకు సమీపంలో మనోజ్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. సొరంగానికి కుడి వైపున కన్వేయర్ బెల్టు ఉండగా బెల్టు సమీపంలో ఇప్పటికే ఒకవైపు నుంచి తవ్వకాలు చేపడుతూ సహాయక బృందాలు మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఎడమ వైపున మట్టి వేశాయి.
ఎక్స్‌కవేటర్ సాయంతో అక్కడి మట్టిని తొలగిస్తుండగా మంగళవారం మృతదేహం కనిపించింది. ప్రమాదానికి ముందు లోకో ట్రైన్‌లో కాంక్రీట్ సెగ్మెంట్లు, సామగ్రిని తీసుకెళ్లారని, ప్రమాద సమయంలో లోకోట్రైన్‌తో సహా చెల్లాచెదురై వెనక్కి కొట్టుకొచ్చి ఉంటుందని సహాయక సిబ్బంది అంటున్నారు. ఇదే ప్రాంతంలో నాలుగు ఎక్స్‌కవేటర్ల సాయంతో ముమ్మరంగా తవ్వకాలు, మట్టి తొలగింపు చేపట్టారు.